– బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే
– 11లోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ చేయాలి
– ఫార్ములా ఈ- రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్‌కు అనుమతి ఏదీ?
– జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బీజేపీ పరోక్ష మద్దతు
– త్వరలో బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం! : జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో, జూబ్లీహిల్స్
”కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సీబీఐకి అప్పగిస్తే.. మూడు నెలలైనా కేసు పెట్టలేదు. బీఆర్‌ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధం కాకపోతే.. మీరు, వాళ్లు ఒక్కటి కాదంటే ఈనెల 11లోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ చేసి.. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలి” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రహమత్‌నగర్ డివిజన్‌లోని శ్రీరామ్‌నగర్ క్రాస్ రోడ్ (పీజేఆర్ సర్కిల్) వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో సీఎం ప్రసంగించారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలు పదే పదే చెప్పారని గుర్తు చేశారు. ‘కాళేశ్వరం కేసును సీబీఐకి పంపిస్తే 48 గంటల్లో తండ్రీ కొడుకులను జైలుకు పంపిస్తామన్నారు. మీరు, వాళ్లు ఒక్కటి కాకపోతే, కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌ని ఎందుకు అరెస్టు చేయడం లేదు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు.. ఇందులో మీ చీకటి ఒప్పందం ఏంటి?” అని బీజేపీని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సీఎం ప్రశ్నించారు. ‘చీకటి ఒప్పందం చేసుకుని జూబ్లీహిల్స్‌లో బీజేపీ బీఆర్‌ఎస్‌కు పరోక్ష మద్దతు ఇస్తోందన్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని, ఇది తాను అంటున్నది కాదని. వాళ్ల ఆడబిడ్డ చెబుతున్నదేనని చెప్పారు.
సెంటిమెంట్ పేరుతో ఓట్లు దండుకోవాలనే..
‘సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆయన సతీమణిని గెలిపించాలని అడుగుతున్నారు. కానీ ఇదే కేసీఆర్.. 2007లో పీజేఆర్ మరణించినప్పుడు ఏం చేశారు’ అని ప్రశ్నించారు. ‘ఆనాడు పీజేఆర్ రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు సైతం విజ్ఞత ప్రదర్శించి, ఏకగ్రీవానికి అంగీకరించి పోటీకి పెట్టలేదు. కానీ కేసీఆర్ మాత్రం సెంటిమెంట్ లేదంటూ పీజేఆర్ కుటుంబంపై అభ్యర్థిని నిలబెట్టారు. మద్దతు అడగడానికి వెళ్లిన పీజేఆర్ భార్యను, కుటుంబాన్ని మూడు గంటలపాటు గేటు బయట నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. పీజేఆర్ కుటుంబంపై పోటీకి పెట్టినందుకు బీఆర్‌ఎస్ నేతలు రహమత్‌నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాకే జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడగాలని సీఎం డిమాండ్ చేశారు.
కేటీఆర్‌కు నైతిక హక్కు లేదు
సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఇంటి నుంచి బయటకు పంపిన దుర్మార్గుడు కేటీఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదన్నారు. పదేండ్ల పాలనలో ఐదేండ్లపాటు మంత్రివర్గంలో ఒక్క మహిళకూ స్థానం ఇవ్వని కేసీఆర్, కేటీఆర్‌కు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వంటి నేతలకు నాయకత్వం ఇచ్చిందని, తమ మంత్రివర్గంలో సీతక్క, కొండా సురేఖ వంటి వారికి గౌరవం ఇచ్చిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూబ్లీహిల్స్‌లోనే 14,159 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. ”మేము 200 యూనిట్ల ఉచిత కరెంట్, సన్న బియ్యం, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే, బీఆర్‌ఎస్ నాయకులు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ఆ పథకాన్ని ఆపాలని చూస్తున్నారు’ అని విమర్శించారు. ‘మీ రేషన్ కార్డు రద్దు చేయడానికా బీఆర్‌ఎస్‌ను గెలిపించేది? మీ ఉచిత కరెంట్ ఆపడానికా? ఆడబిడ్డల బస్సు ప్రయాణం ఆపడానికా?’ అని ప్రజలను ప్రశ్నించారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే, ఎన్నికల తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 4వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. అలాగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న మిత్రపక్షాలైన సీపీఐ(ఎం), సీపీఐ, ఎంఐఎం, టీజేఎస్ పార్టీలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ఇతర నేతలు ఉన్నారు.
ఆ ముగ్గుర్ని అరెస్టు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



