- ఫైనల్లో సినర్, అల్కరాస్ ఢీ
- సెమీస్‌లో జకోవిచ్ ఓటమి
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
2025 టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్‌లో వరల్డ్ నం.1 జానిక్ సినర్ (ఇటలీ), వరల్డ్ నం.2 కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) ఆధిపత్యం కొనసాగుతుంది. జానిక్ సినర్ వరుసగా నాల్గో గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌కు చేరుకోగా.. కార్లోస్ అల్కరాస్ వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ పోరుకు చేరుకున్నాడు. ప్రపంచ టాప్-2 ఆటగాళ్లు వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ అంతిమ సమరంలో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో అసమాన ఐదు సెట్ల సమరంతో టెన్నిస్ అభిమానులకు ఉత్కంఠభరిత అనుభవాన్ని అందించిన సినర్, అల్కరాస్.. నేడు యుఎస్ ఓపెన్‌లో ఏం చేస్తారో చూడాలి.
నవతెలంగాణ-న్యూయార్క్
ప్రపంచ నం.1, ఇటలీ స్టార్ జానిక్ సినర్‌కు ఈ ఏడాదిలో ఎదురులేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి యూఎస్ ఓపెన్ వరకు ప్రతి గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌కు చేరుకున్న సినర్.. 2025లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో కెనడా ఆటగాడు, 25వ సీడ్ ఫెలిక్స్ ఆగర్‌పై జానిక్ సినర్ 6-1, 3-6, 6-3, 6-4తో మెరుపు విజయం సాధించాడు. 11 ఏస్‌లు, నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించిన సినర్.. పాయింట్ల పరంగా 120-100తో పైచేయి సాధించాడు. 9 ఏస్‌లు, ఓ బ్రేక్ పాయింట్‌తో మెరిసిన ఫెలిక్స్.. యుఎస్ ఓపెన్‌లో సినర్ రెండోసారి విజయం కోసం నాలుగు సెట్ల మ్యాచ్ ఆడేలా చేశాడు. సినర్ 33 విన్నర్లు కొట్టగా.. ఫెలిక్స్ 36 విన్నర్లు సంధించాడు. సినర్ 22 అనవసర తప్పిదాలతో సరిపెట్టగా.. ఫెలిక్స్ 41 అనవసర తప్పిదాలు చేశాడు. బలమైన సర్వ్‌లకు తిరుగులేని ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లు జత కలవటంతో జానిక్ సినర్ అలవోక విజయం సాధించాడు. ఈ ఏడాది నాల్గో గ్రాండ్‌స్లామ్‌లో టైటిల్ పోరుకు చేరుకున్నాడు.
పురుషుల సింగిల్స్ మరో సెమీఫైనల్లో వరల్డ్ నం.2 కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) అదరగొట్టాడు. 24 గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ విజేత, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్‌పై రెండున్నర గంటల్లోనే అల్కరాస్ గెలుపొందాడు. 6-4, 7-6(7-4), 6-2తో కార్లోస్ అల్కరాస్ మూడు సెట్లలోనే మెరుపు విజయం అందుకున్నాడు. ఏడు ఏస్‌లు, 31 విన్నర్లకు తోడు నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించిన కార్లోస్ అల్కరాస్ 38 ఏండ్ల జకోవిచ్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి సెట్‌ను 4-6తో చేజార్చుకున్న జకోవిచ్.. రెండో సెట్లో అల్కరాస్ సర్వ్‌ను బ్రేక్ చేసి సత్తా చాటాడు. కానీ పుంజుకున్న అల్కరాస్ ఆ సెట్‌ను టైబ్రేకర్‌కు తీసుకెళ్లాడు. టైబ్రేకర్‌లో 7-4తో మెరిసిన అల్కరాస్.. జకోవిచ్ ఆశలు ఆవిరి చేశాడు. మూడో సెట్లో మరింత దూకుడు ప్రదర్శించి 6-2తో మ్యాచ్‌తో పాటు ఫైనల్లో బెర్త్‌ను కైవసం చేసుకున్నాడు.
టైటిల్ నిలుపుకుంటాడా?
1996 తర్వాత ఓ అరుదైన ఘట్టం యుఎస్ ఓపెన్‌లో ఆవిష్కితం అయ్యేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 2024 యుఎస్ ఓపెన్ విజేతలుగా నిలిచిన జానిక్ సినర్, అరినా సబలెంక ఈ ఏడాది సైతం టైటిల్ పోరుకు చేరుకున్నారు. చివరగా 1996లో పీట్ సంప్రాస్, స్టెఫీగ్రాఫ్‌లు మాత్రమే యుఎస్ ఓపెన్‌లో టైటిల్ నిలుపుకున్న మెన్స్, ఉమెన్స్ సింగిల్స్ ద్వయంగా నిలిచింది. సుమారు 30 ఏండ్ల తర్వాత ఆ రికార్డును సమం చేసే అవకాశం సినర్, సబలెంకకు వచ్చింది.
2025 సినర్, అల్కరాస్ నామ సంవత్సరంగా నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మినహా మిగతా మూడు గ్రాండ్‌స్లామ్స్‌లో ఈ ఇద్దరే పోటీపడుతున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్‌లో సినర్ విజేతగా నిలువగా.. ఫ్రెంచ్ ఓపెన్‌ను నాటకీయ తరహాలో అల్కరాస్ దక్కించుకున్నాడు. ఇటీవల సిన్సినాటి ఓపెన్‌లోనూ సినర్, అల్కరాస్ ఫైనల్లో తలపడినా.. గాయంతో సినర్ వాకోవర్ ఇచ్చాడు. ముఖాముఖి రికార్డులో 9-5తో సినర్‌పై అల్కరాస్‌కు పైచేయి ఉంది. కానీ హార్డ్‌కోర్ట్‌పై సినర్ అత్యంత విధ్వంసక ఆటగాడు. ప్రత్యర్థులకు ఒక్క సెట్ కోల్పోకుండా టైటిల్స్ నెగ్గగల సత్తా సినర్ సొంతం. సినర్ ఆధిపత్యానికి సవాల్ విసురుతున్న అల్కరాస్.. నేడు యుఎస్ ఓపెన్ విజయంతో ఈ ఏడాది లెక్క సమం చేసేందుకు ఎదురు చూస్తున్నాడు.
ఆ ఒక్కటి కొట్టాలని..!
వయసు 38 ఏండ్లు. కెరీర్ గ్రాండ్‌స్లామ్ విజయాలు 24. టెన్నిస్ ఓపెన్ శకంలో ఆల్‌టైమ్ రికార్డుకు టైటిల్ దూరంలో నిలిచాడు. ఈ ఏడాది వరుసగా ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. రికార్డు టైటిల్ వేటలో ఏడాదిలో నాలుగు గ్రాండ్‌సామ్స్‌లో నిరాశ తప్పలేదు. అయినా, ఆ ఒక్కటి కొట్టాలనే తపన కొనసాగుతుందని సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ అంటున్నాడు. గత 8 గ్రాండ్‌స్లామ్స్ టోర్నీల్లో సినర్, అల్కరాస్‌లు కలిసి ఏడు గెల్చుకున్నారు. జకోవిచ్ ఈ ఏడాది నాలుగు సెమీఫైనల్స్‌లో మూడింట ఈ ఇద్దరి చేతిలోనే పరాజయం పాలయ్యాడు. రికార్డు టైటిల్ వేట ఊరిస్తున్నా.. సినర్, అల్కరాస్ అత్యుత్తమ ఫామ్, ఉత్తమ ఫిట్‌నెస్ జకోవిచ్‌ను ఆ మైలురాయికి దూరంగా ఉంచుతున్నాయి.
‘ఈ ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్స్ సెమీస్‌లో మూడింట సినర్, అల్కరాస్ చేతిలో ఓడాను. మెల్‌బోర్న్‌లో జ్వెరెవ్ పైచేయి సాధించాడు. ఈ ఇద్దరు గొప్పగా ఆడుతున్నారు. ఐదు సెట్ల మ్యాచ్‌లో ఈ ఇద్దరిని ఎదుర్కొవటం ఎంతో సవాల్‌గా మారింది. గ్రాండ్‌స్లామ్స్ టోర్నమెంట్ ఆఖర్లో ఆడటం మరింత కష్టంగా మారింది. ప్రస్తుతం టెన్నిస్‌లో ఈ ఇద్దరు అద్బుతంగా ఆడుతున్నారు. నేను పరిస్థితులకు తగినట్టు వంద శాతం ప్రదర్శన ఇచ్చేందుకు శ్రమిస్తున్నాను. నేను వరుస టైటిల్స్ సాధించిన సమయంలో అభిమానుల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. కానీ ఇప్పుడు వరుసగా నాల్గోసారి సెమీస్‌లో ఓడినా.. న్యూయార్క్‌లో అభిమానులు అపూర్వ ఆదరణ చూపించారు. రేసు నుంచి ఇప్పుడే తప్పుకోవటం లేదు. ఈ పోటీని నేను ఆస్వాదిస్తున్నాను’ అని సెమీఫైనల్లో ఓటమి అనంతరం జకోవిచ్ అన్నాడు.