నైజాం, నరేంద్రమోడీ విధానాలు ప్రజలను వంచించేవే
ప్రజావిముక్తి పోరాటానికి మతరంగు పులిమితే చరిత్ర క్షమించదు
చరిత్రను వక్రీకరించటం మూర్ఖత్వం
కేవీపీఎస్ సెమినార్‌లో సారంపల్లి, అబ్బాస్, జి రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మచ్చుకైనా కన్పించని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ వాళ్లు దానికి వారసులమంటూ చెప్పుకోవటం సిగ్గుచేటని వక్తలు విమర్శించారు. మహాత్తరమైన ఆ ప్రజా విముక్తి పోరాటానికి మతం రంగు పులిమి రాజకీయ లబ్దిపొందాలనుకుంటే..చరిత్ర క్షమించబోదని హెచ్చరించారు. నైజాం సర్కార్, నరేంద్రమోడీ విధానాలు రెండూ ప్రజలను వంచించేవేనని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు అధ్యక్షతన ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం- వాస్తవాలు వక్రీకరణలు’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఆలిండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ 1913లో హిందూ మహాసభ, 1925లో ఆర్‌ఎస్‌ఎస్, 1951 లో జనసంఫ్‌ు ఏర్పడితే.. 1946 సెప్టెంబర్ 11 నుండి 1951 సెప్టెంబర్ 17 వరకు జరిగిన మహాత్తరమైన ఆ పోరాటంలో సంఫ్‌ు పరివారం ఎందుకు పాల్గొనలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.
ముస్లింలకు వ్యతిరేకంగా హిందూవులు చేసిన పోరాటంగా చెప్పటం తగదని హితవు పలికారు. మాతృభాషను కాదనీ, ఉర్దూమాత్రమే మాట్లాడాలని నాడు నవాబు హుకుం జారీ చేస్తే..నేడు మోడీ హిందీని అధికారిక భాషగా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. దొరలు భూస్వాములు, జాగిర్దారులు నిజాం సైన్యంలో కలిసి ప్రజలను నానా చిత్ర హింసలకు గురిచేశారని చెప్పారు. విస్నూర్ రామచంద్రారెడ్డిది ఏ మతమో బీజేపీ పెద్దలు చెప్పగలరా? అని ప్రశ్నించారు. దోపిడీదారులు, దోపిడీకి గురైన పేదలు కూడా హిందువులేననే విషయాన్ని మత ఉన్మాదులు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో మఖ్దూం మోహినుద్దీన్, అలంకుంద్ మీరి తదితరులు కామ్రేడ్స్ అసోసియేషన్‌ను స్థాపించారనీ, నైజాం నిరంకుశత్వంపై ఆక్షరాయుధాలను ఎక్కుపెట్టినందుకు షోయబుల్లాఖాన్ కాళ్ళూ, చేతులు నరికిన చరిత్రను వీరు ఎందుకు చూడలేక పోతున్నారని ప్రశ్నించారు. ఆ పోరాటంలో మొదటగా ప్రాణాలిచ్చింది షేక్ బందగీ అని గుర్తు చేశారు. సాయుధ పోరును వక్రీకరిస్తే బీజేపీకి తెలంగాణలో పుట్టగతులుండబోవని హెచ్చరించారు.
సాయుధ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదే
దున్నేవానికి భూమి కావాలని వెట్టి చాకిరి అంతం చేయాలని జరిగిన మహత్తర పోరాట వారసత్వం కమ్యూనిస్టులదేనని టీపీఎస్‌కే కన్వీనర్ జి రాములు అన్నారు. ఆ పోరాటం ప్రపంచ చరిత్ర పుటల్లో సజీవంగా నిలుస్తుందన్నారు. కమ్యూనిస్టులు రాత్రిపూట బడులు, గ్రంథాలయాలు, అక్షరాస్యత ఉద్యమాన్ని నిర్మించారని చెప్పారు. కుల పీడనకు వ్యతిరేకంగా, పీడిత వర్గాన్ని ఏకం చేసిందని తెలిపారు.
ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఎర్రజెండా పాతి బీజేపీ సభ పెట్టాలి
సెప్టెంబర్ 17న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఎర్ర జెండా పాతి, ఆ జెండా నాయకత్వంలో జరిగిన పోరాటం గురించి ఉన్నదున్నట్టుగా చెప్పె దైర్యం బీజేపీ నేతలకు ఉందా? అని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం డి అబ్బాస్ నిలదీశారు. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బీజేపీ ఏ అర్హతతో సభ పెడుతున్నదని ప్రశ్నించారు. సాయుధ పోరాటంతో ఏ మాత్రం సంబంధం లేని సంఫ్‌ుపరివారం ఆ పోరాట ఉత్సవాలను నిర్వహించటం సిగ్గుచేటని విమర్శించారు. నాడు నైజాం, భూస్వాములు కలిసి మహిళలను బట్టలూడదీసి బతుకమ్మ లాడిస్తే.. ఆధునిక యుగంలో నేటి బీజేపీ పాలనలోని డబుల్ ఇంజన్ సర్కార్ మణిపూర్‌లో ఇద్దరు మహిళలను బట్టలూడదీసి నగంగా ఊరేగించిందని గుర్తు చేశారు. నైజాం నవాబు, నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు కవల పిల్లలాంటివేనని చెప్పారు.
కులం, మత ఉన్మాదాలను తూలనాడి, పీడిత వర్గాన్ని ఏకం చేసిన వర్గ పోరాటం వీర తెలంగాణ సాయుధ పోరాటమని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు అన్నారు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో మహిళలు ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. మహిళలు తుపాకీ పట్టి రజాకార సైన్యాలకు, విసునూర్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కమ్యూనిస్టులదేనని అని చెప్పారు.