Sunday, July 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందిక్కుమొక్కు లేనోళ్లు..వారి బతుక్కి భరోసా ఏది?

దిక్కుమొక్కు లేనోళ్లు..వారి బతుక్కి భరోసా ఏది?

- Advertisement -

– యాజమాన్య నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఉదాసీనతే కారణం
– సిగాచి మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించటంలో నిర్లక్ష్యం
– వలస కార్మికచట్టాన్ని అమలు చేయాల్సిందే : రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సిగాచి ఘటన అందరినీ నివ్వెరపరిచిందనీ, ఈ ఘోర ప్రమాదానికి యాజమాన్య నిర్లక్ష్యం ప్రభుత్వ ఉదాసీనతే కారణమని పలువురు వక్తలు విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐ టీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో’ సిగాచి ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి’ డిమాండ్‌పై రాష్ట్ర ఉపా ధ్యక్షులు విఎస్‌ రావు అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావే శాన్ని నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంద ర్భంగా అన్ని కార్మిక సంఘాలు ఆదివారం ఘటనాస్థలాన్ని పరిశీలించాలనీ, అనంతరం కార్మికశాఖ మంత్రికి వినతి పత్రాన్ని అందజేయాలని నిర్ణయించాయి. 14న హైదరా బాద్‌లోని ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలనీ, 15న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించాలనే తీర్మానాన్ని రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
అనంతరం భాస్కర్‌ మాట్లాడుతూ సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరమైందన్నారు. ఇటీ వల కాలంలో ఇలాంటి ఘటనలు వరసగా జరుగుతున్నా యని చెప్పారు. ప్రభుత్వం, యజమాన్యం మాత్రం ఎంతో కొంత నష్టపరిహారాన్ని ప్రకటించి చేతులు దులుపుకుంటు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికుల భద్రత కోసం చట్టాలున్నా.. అవి చట్టు బండలుగా మిగిలిపోతున్నాయని చెప్పారు. ఆ చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వాలు సవరణల పేరుతో వాటిని నిర్వీర్యం చేస్తున్నాయని వివరించారు. దిక్కుమొక్కులేని ఆ వలస కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయనీ, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పరిశ్రమలను చట్టబద్ధంగా నడిపించాల్సిన యాజమాన్యం, లాభాపేక్షతో నిర్లక్ష్యంగా వ్యవహరించటం మూలంగానే ఈ ఘటన జరిగిందని విమర్శించారు. అందుకే యజమాన్యంపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మికశాఖ తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేదని చెప్పారు. ఇంతటి ఘోర ప్రమాదానికి ప్రభుత్వం, యజమాన్యం ఇరువురూ బాధ్యులేనని స్పష్టం చేశారు. నైపుణ్యం లేని కార్మికులతో రియాక్టర్ల వద్ద పనిచేయించటం మూలంగానే ఈ ఘటన జరిగినట్టు వార్తలొస్తున్నాయని తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ వేతనాలిచ్చి, ఎక్కువ గంటలు కార్మికులతో పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఇది ఒక సిగాచి పరిశ్రమ వరకే పరిమితం కాదనీ, ఎక్కువ పరిశ్రమల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోందని అన్నారు. ఇప్పటికే వరస ఘటనలతో అనేక మంది కార్మికులు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లాభాలు దండుకోవటమే లక్ష్యంగా పరిశ్రమ యజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సిగాచి ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి పరిహారం ప్రకటించి, ఆపన్నహస్తం అందించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరుపున రూ.లక్ష ఆర్థిక సహాయం అందించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ ప్రభుత్వాలు వలస కార్మిక చట్టాన్ని అమలు చేయటంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమ ర్శించారు. ఇప్పటికైనా ఘటన ఎలా జరిగిందో వెలికి తీయా లని డిమాండ్‌ చేశారు. అది జరిగిన రెండు, మూడు రోజుల తర్వాత యజమాన్యం వచ్చిందనీ, మనుషుల ప్రాణా లంటే.. ఇంత నిర్లక్ష్యమా? అని ప్రశ్నించారు. లేబర్‌ ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షణే లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరవాలనీ, అసంఘటిత కార్మి కులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐఎన్‌టీయూసీ నాయకులు విజరుకుమార్‌ మాట్లాడుతూ కాలం చెల్లిన డ్రయ్యర్‌ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. దీనికి పరిశ్రమ యజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. టీయూసీఐ అధ్యక్షులు సూర్యం మాట్లాడుతూ అది సిగాచి కాదు..పిచాచి అని ఇటీవల ‘నవతెలంగాణ’ ఎడిటోరియల్‌ లో ప్రస్తావించిన విషయాలను గుర్తు చేశారు. లాభాపేక్షతో యజమాన్యాలు కార్మికుల ప్రాణాలను పట్టించుకోవటం లేదని చెప్పారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎంకే బోస్‌ మాట్లాడుతూ బయటి ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకొచ్చి పనిచేయించే పద్ధతికి యాజమాన్యాలు అలవాటు పడ్డాయని ఆరోపించారు. వీరితో 12గంటలకు పైగా పని చేయించుకుంటున్నాయని, కార్మిక శాఖ పర్యవేక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రమా దానికి కారణాలను వెలికితీయాలని డిమాండ్‌ చేశారు. వాటి నివారణకు తగిన చర్యలు చేపడుతున్నారా? లేదా? అన్నదే ఇక్కడ ప్రధాన అంశమని చెప్పారు. నైపుణ్యం గల కార్మికులు ఎందుకు లేరో యజమాన్యం సమాధానం చెప్పా లని ప్రశ్నించారు. యజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఎస్వీ రమ మాట్లాడుతూ సిగాచి ప్రమాదం హృదయవిదారకమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వరస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదో కార్మికులకు సమాధానం చెప్పాలని నిలదీశారు. టీయూసీఐ కార్యదర్శి ఎస్‌ఎల్‌ పద్మ మాట్లాడుతూ ఆ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సమయంలో ఎంత మంది పని చేస్తున్నారో స్పష్టత లేదని ఆరోపించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్‌, పి శ్రీకాంత్‌, కూరపాటి రమేష్‌, వంగూరు రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -