సిటిజన్‌షిప్ రద్దును వేగవంతం చేయాలని ప్రభుత్వ యోచన
వాషింగ్టన్ : అమెరికాలో జన్మించకపోయినప్పటికీ నిబంధనలు పాటించి దేశ పౌరసత్వం పొందిన వారిపై ట్రంప్ ప్రభుత్వం దృష్టి సారించింది. వారిలో కొంతమంది పౌరసత్వాన్ని తొలగించే ప్రయత్నాలను వేగవంతం చేయాలని యోచిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇమ్మిగ్రేషన్ లిటిగేషన్ కార్యాలయానికి నెలకు 100-200 మంది వివరాలు పంపాలని సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. అంటే ఆయా వ్యక్తులకు ఉన్న హక్కులు, అధికారాలను తొలగించి వారి పౌరసత్వాన్ని రద్దు చేస్తారన్న మాట. 2017 నుంచి ఇప్పటి వరకూ ఇలాంటి కేసులు 120 మాత్రమే దాఖలయ్యాయని న్యాయ శాఖ తెలిపింది. ఇతర దేశాలకు చెందిన వారు అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసినప్పుడు ఆ ప్రక్రియలో మోసానికి పాల్పడినా, తప్పుడు సమాచారం ఇచ్చినా వారికి కల్పించిన పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారాన్ని చట్టం కల్పించింది.
ట్రంప్ ప్రభుత్వం అవలంబిస్తున్న దుందుడుకు విధానం కారణంగా దరఖాస్తుదారులు నిజాయితీతో వ్యవహరించినా తప్పులు జరిగితే వారి పౌరసత్వం ప్రమాదంలో పడుతుందని ఇమ్మిగ్రేషన్ హక్కుల గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో కొన్ని మార్పులను అమలు చేస్తోంది. దీనివల్ల ఇతర దేశాల వారు అమెరికాలో ప్రవేశించడం, అక్కడ ఉండడం కష్టంగా మారింది. ఈ మార్పుల కారణంగా…దక్షిణ సరిహద్దులో ఆశ్రయం కోరే వారిపై ఆంక్షలు అమలులో ఉన్నాయి. అమెరికాలో ఆశ్రయం కోరే వారి దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలను లక్ష్యంగా చేసుకొని ప్రయాణ నిషేధాలు విధించారు. అబద్ధాలు చెప్పి, తప్పుడు సమాచారం ఇచ్చే వారిని లక్ష్యంగా చేసుకొని పౌరసత్వాలు రద్దు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. సెన్సస్ బ్యూరో డేటా ప్రకారం విదేశాల నుంచి వచ్చి అమెరికా పౌరసత్వం పొందిన వారి సంఖ్య సుమారు 26 మిలియన్లు. గత సంవత్సరం ఎనిమిది లక్షల మందికి పైగా కొత్త పౌరులు ప్రమాణం చేశారు. వీరిలో మెక్సికో, భారత్, ఫిలిప్పీన్స్, డొమినిసియన్ రిపబ్లిక్ లేదా వియత్నాంలో జన్మించిన వారే ఎక్కువ.
అమెరికా పౌరసత్వం పొందిన వారికి గండం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



