ప్రతి అమెరికన్‌కూ రెండు వేల డాలర్ల డివిడెండ్ ఇస్తానని హామీ
వాషింగ్టన్ : తన సుంకాల విధానాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గట్టిగా సమర్ధించుకున్నారు. సుంకాలను వ్యతిరేకించే వారిని మూర్ఖులుగా అయన అభివర్ణించారు. అమెరికా అత్యంత బలమైన, సంపన్న దేశంగా ఆవతరించడానికి సుంకాలు ఉపకరించాయని చెప్పారు. టారిఫ్‌ల ద్వారా అమెరికాకు అనేక ట్రిలియన్ డాలర్లు సమకూరుతున్నాయని అంటూ ఒక్కో అమెరికన్‌కు రెండు వేల డాలర్ల డివిడెండ్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన ట్రూత్ సోషల్ వేదికలో ఓ పోస్ట్ పెట్టారు. తన నాయకత్వంలో అమెరికా ప్రపంచంలో అత్యంత సంపన్నమైన, గౌరవనీయ దేశంగా మారిందని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో ఇప్పుడు దాదాపుగా ద్రవ్యోల్బణం అనేదే లేదని, స్టాక్ మార్కెట్ రికార్డు సృష్టించిందని తెలిపారు.
‘ఉద్యోగులకు వేతనాలు భారీగా లభిస్తున్నాయి. పదవీ విరమణ ప్రయోజనాల నిమిత్తం వారు తమ జీతంలో కొంత భాగాన్ని పొదుపు, మదుపు చేస్తున్నారు. దీనివల్ల పన్ను ప్రయోజనాలు చేకూరుతాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పొదుపు జరుగుతోంది. సుంకాల ద్వారా దేశానికి అనేక ట్రిలియన్ డాలర్లు వచ్చి పడుతున్నాయి. దీంతో మనకున్న 37 ట్రిలియన్ డాలర్ల అప్పును త్వరలోనే తీర్చడం మొదలు పెడతాం’ అని ట్రంప్ వివరించారు. అమెరికాలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని, దేశవ్యాప్తంగా ప్లాంట్లు, ఫ్యాక్టరీల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. అధిక ఆదాయం పొందుతున్న వారు మినహా దేశంలోని ప్రతి ఒక్కరికీ రెండు వేల డాలర్ల చొప్పున అందజేస్తానని హామీ ఇచ్చారు. అయితే ప్రతిపాదిత చెల్లింపులపై ట్రంప్ ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.
సుంకాలను వ్యతిరేకించే వారు మూర్ఖులు : ట్రంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



