– అమిత్ షాను ప్రశ్నించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ : నేరస్థులను పార్టీల్లో చేర్చుకుని తరువాత వారిని ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రిగా చేస్తున్న వ్యక్తులకు ఎన్నేండ్లు జైలు శిక్ష విధించాలని కేంద్ర మంత్రి అమిత్‌షాను ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో కేజ్రీవాల్ సోమవారం ఒక పోస్టు చేశారు. స్కాముల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను బీజేపీ తన పార్టీలోకి చేర్చుకోవడాన్ని కేజ్రీవాల్ విమర్శించారు. ‘తీవ్రమైన నేరాలకు పాల్పడిన నేరస్థులను తమ పార్టీలో చేర్చుకుని, వారి కేసులన్నీ కొట్టివేసి, వారిని మంత్రులుగా, ఉపముఖ్యమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేసే వ్యక్తి తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదా? అలాంటి వ్యక్తికి ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష విధించాలి?’ అని కేజ్రీవాల్ తన పోస్టులో ప్రశ్నించారు. మరో పోస్టులో ‘కేంద్రం ప్రభుత్వం రాజకీయ కుట్రతో నన్ను తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపినప్పుడు నేను 160 రోజులు పాటు ప్రభుత్వాన్ని జైలు నుంచి నడిపాను’ అని కూడా కేజ్రీవాల్ తెలిపారు.
తాను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపిన సమయంలో విద్యుత్ కోతలు లేవని, మంచినీరు అందుబాటులో ఉండేదని, ఆసుపత్రుల్లో ఉచిత పరీక్షలు, మందులు అందాయని తెలిపారు. ప్రయివేటు పాఠశాలలు ఏకపక్షంగా, గుండాయిజం చేయడానికి అనుమతించలేదని కేజ్రీవాల్ గుర్తు చేశారు. అయితే గత ఏడు నెలల్లో బీజేపీ ప్రభుత్వం ఢిల్లీని దారుణమైన స్థితికి తీసుకొచ్చిందని, ఢిల్లీ ప్రజలు జైలు నుంచి పనిచేసిన ప్రభుత్వమే బాగుందని గుర్తుంచుకుంటున్నారని కేజ్రీవాల్ తెలిపారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతుగా అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా కేజ్రీవాల్ ఈ ప్రశ్నలు వేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ జైలు నుంచి ప్రభుత్వాన్ని ఎందుకు నడపాలని ప్రశ్నించారు. జైలు శిక్ష పడినప్పుడే కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉండాల్సిందని అమిత్ షా అన్నారు.