కొత్త తరం కంప్యూటర్లకు ఊతమిచ్చే ఆవిష్కరణలు
స్టాకహేోం : ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. అనేక కణాలతో కూడిన క్వాంటమ్ టన్నెలింగ్‌ను మాక్రో స్కోపిక్ స్కేలుపై ఎలా పరిశీలించవచ్చు అనే అంశంపై జాన్ క్లార్క్, మైఖేల్ డివొరెట్, జాన్ మార్టినిస్‌లు సాగించిన పరిశోధనకు గానూ ఈ పురస్కారం లభించింది. ‘ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో మాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్‌లో ఆవిష్కరణలకు గానూ ఈ పురస్కారం అందచేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. శతాబ్ద కాలం నాటి క్వాంటమ్ మెకానిక్స్‌లో ఇంకా కొత్తగా ఆశ్చర్యచకితులను చేసే అంశాలను కనుగొనడం అద్భుతమైన విషయమని పేర్కొంది.
డిజిటల్ సాంకేతికతకు క్వాంటమ్ మెకానిక్స్ పునాది అయినందున దీనివల్ల ఆపారమైన ఉపయోగాలు వున్నాయని భౌతిక శాస్త్రంలో నోబెల్ కమిటీ ఛైర్మన్ ఓలె ఎరిక్సన్ పేర్కొన్నారు. కంప్యూటర్ మైక్రోచిప్స్‌లోని ట్రాన్సిస్టర్లు క్వాంటమ్ టెక్నాలజీకి ఒక ఉదాహరణ. మొబైల్ ఫోన్లు, కెమెరాల నుంచి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వరకు ఈనాడు మనం ఉపయోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో క్వాంటమ్ మెకానిక్స్ ఆధారం లేకుండా ఏదీ వుండదని నోబెల్ కమిటీ పేర్కొంది. ఈ ఏడాది కనుగొన్న కొత్త ఆవిష్కరణ క్వాంటమ్ కంప్యూటర్లు, క్వాంటమ్ సెన్సార్లు వంటి కొత్త తరం క్వాంటమ్ టెక్నాలజీ వృద్ధి చెందడానికి అవకాశాలు కల్పిస్తోందని నోబెల్ కమిటీ మీడియా ప్రకటనలో పేర్కొంది.