నవతెలంగాణ-కమ్మర్ పల్లి : కమ్మర్ పల్లి అటవీ రేంజ్ పరిధిలోని భీంనగర్ అటవీ ప్రాంతంలో అక్రమంగా అటవీ భూమిని చదును చేసేందుకు సిద్ధంగా ఉంచిన మూడు బ్లేడ్ ట్రాక్టర్లను పట్టుకున్నట్లు అటవీ రేంజ్ అధికారి రవీందర్ నాయక్ తెలిపారు. శనివారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల అడ్డ బోర్ తండాకు చెందిన పలువురు భీం నగర్ ప్రాంతంలో అటవీ భూమిని చదును చేసేందుకు వెళ్తున్నారన్న విశ్వాసనీయ సమాచారం మేరకు అటవీశాఖ సిబ్బంది అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. అక్కడ ఎలాంటి బ్లేడ్ ట్రాక్టర్లు అటవీ శాఖ సిబ్బందికి కనిపించలేదు.
ఆదివారం తెల్లవారుజామున గాలింపు చేపట్టిన సిబ్బందికి భీంనగర్ నార్త్ బీట్ అటవీ ప్రాంతంలో మూడు బ్లేడ్ టాక్టర్లు భూమిలో దిగబడి పోయి ఉండడాన్ని సిబ్బంది గమనించారు. వాటన్ని అటవీ శాఖ సిబ్బంది జెసిబి సహాయంతో బయటకు తీయించారు. అనంతరం స్వాధీనం చేసుకున్న మూడు బ్లేడ్ ట్రాక్టర్లను భీంగల్ పోలీసుల, చందుర్తి మల్యాల్ రేంజ్ సిబ్బంది సహాయంతో కమ్మర్ పల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఫీల్డ్ రీ సర్వే చేసినా అనంతరం కేసు నమోదు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రేంజ్ అధికారి రవీందర్ నాయక్ తెలిపారు. బ్లేడు ట్రాక్టర్లను పట్టుకున్న చందుర్తి మల్యాల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఖలీలుద్దీన్, మానాల సెక్షన్ అధికారి అజీముద్దీన్, కొనరావుపేట్ సెక్షన్ అధికారి పల్లె శ్రీనివాస్, మానాల బీట్ అధికారి మౌనిక, నిమ్మపల్లి బీట్ అధికారి సుదర్శన్, రుద్రంగి బీట్ బాలక్రిష్ణ, భీం నగర్ నార్త్ సెక్షన్ అధికారి భూమయ్య, బీట్ అధికారి సాగరిక, బేస్ క్యాంప్ సిబ్బంది గణేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.