Saturday, November 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంముగ్గురు సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్‌

ముగ్గురు సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్‌

- Advertisement -

– ఉద్యోగాల ఆశ చూపి రూ.6లక్షలు చోరీ
నవతెలంగాణ-కాగజ్‌నగర్‌

ఉద్యోగాల ఆశ చూపి రూ.6లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లను ఆసిఫాబాద్‌ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగజ్‌నగర్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ వివరాలు వెల్లడించారు. తనకు ఉద్యోగం ఆశ కల్పించి వాట్సప్‌ లింక్‌ ద్వారా గుర్తుతెలియని వ్యక్తులు తన వద్ద రూ.6 లక్షలు కాజేశారంటూ కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన గద్దల కిరణ్‌కుమార్‌ ఆగస్టు 19న టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు దీని సూత్రధారి గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. టౌన్‌ ఎస్‌ఐ ప్రశాంత్‌తోపాటు ప్రత్యేక పోలీసు బృందం అక్కడికి వెళ్లి విచారణ చేపట్టింది. ఇందులో ముగ్గురు నిందితులు ఉన్నట్టు గుర్తించారు. అహ్మదాబాద్‌కు చెందిన కడవల భవేష్‌ సీదా భారుకి చెందిన ఐడీఎఫ్‌బి బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు జమ కాగా.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. రాథోడ్‌ రాహుల్‌ తన చేత ఖాతా తెరిపించాడని, అతనే బ్యాంక్‌ లావాదేవీలు నిర్వహిస్తూ ప్రతి లావాదేవికీ తనకు కమీషన్‌ కింద రూ.3వేలు ఇచ్చేవాడని భవేష్‌ తెలిపాడు. ఈ విధంగా మొత్తం రూ.1,32,000 తన ఖాతా నుంచి రాహుల్‌కు ఇచ్చినట్టు చెప్పాడు. వెంటనే పోలీసులు రాథోడ్‌ రాహుల్‌ హాజబారును అదుపులోకి తీసుకొని విచారించగా తాను సాహు ప్రదీప్‌ అనే వ్యక్తి సూచన మేరకు భవేష్‌తో ఖాతా తెరిపించానని, ఇందుకోసం తాను కమీషన్‌గా రూ.9 వేలు తీసుకున్నట్టు ఒప్పుకున్నాడు. భవేష్‌ ఖాతాలో జమ అయిన మొత్తాన్ని చెక్కు ద్వారా డ్రా చేసి సాహు ప్రదీప్‌కు అందించినట్టు తెలుపగా.. పోలీసులు సాహు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకొని విచారిం చారు.
అభిషేక్‌ పాటిల్‌ అనే వ్యక్తి సూచన మేరకు తాను బ్యాంక్‌ ఖాతాలు తెరిపించి వాటి ద్వారా జరిగే లావాదేవీలపై కమీషన్‌ పొందుతున్నట్టు సాహు ప్రదీప్‌ ఒప్పుకున్నాడు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. పరారీలో ఉన్న అభిషేక్‌ పాటిల్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. భవేష్‌కు మహారాష్ట్ర, తమిళనాడులో కూడా బ్యాంక్‌ ఖాతాలు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. అభిషేక్‌ పాటిల్‌ పట్టుబడితే కేసు కొలిక్కి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం పట్టుబడి ముగ్గురు నిందితులు కూడా అహ్మదాబాద్‌ కు చెందిన వారే. ఇందులో సాహు ప్రదీప్‌ గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసుకొని ఎంబీఏ చదువు తుండగా, భవేష్‌ సీదా బారు టైలరింగ్‌, రాథోడ్‌ రాహుల్‌ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దీన్‌, కాగజ్‌నగర్‌ టౌన్‌ సీఐ ప్రేంకుమార్‌, టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాణా ప్రతాప్‌, సీఐ రవీందర్‌, ఎస్‌ఐ తేజస్విని, టౌన్‌ ఎస్‌ఐ యాదగిరి, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -