– పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీహెచ్‌ఎంసీపై మేఘం గర్జించింది. ఆకాశానికి చిల్లులు పడ్డాయా? అన్నట్టుగా కుండపోత వర్షం కురిసింది. శేరిలింగంపల్లిలో 12.65 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రాత్రి పది గంటల వరకు 669 ప్రాంతాల్లో వర్షం కురువగా…అందులో ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 160కిపైగా ప్రాంతాలుండటం గమనార్హం. వచ్చే మూడు రోజుల పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న హెచ్చరించారు. ఆ జాబితాలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నల్లగొండ, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయని తెలిపారు.
గురువారం అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు
(రాత్రి 9 గంటల వరకు)
శాలిగౌరారం(నల్లగొండ) – 12.75 సెంటీమీటర్లు
గచ్చిబౌలి (రంగారెడ్డి) – 12.65 సెంటీమీటర్లు
శ్రీనగర్‌కాలనీ(హైదరాబాద్) – 11.38 సెంటీమీటర్లు
అడ్డగూడూరు(యాదాద్రి) – 11.35 సెంటీమీటర్లు
సరూర్‌నగర్(రంగారెడ్డి) – 11.30 సెంటీమీటర్లు
ఖైరతాబాద్(హైదరాబాద్) – 11.15 సెంటీమీటర్లు
మణికొండ(రంగారెడ్డి) – 10.96 సెంటీమీటర్లు
యూసుఫ్‌గూడ(హైదరాబాద్) – 10.73 సెంటీమీటర్లు
ఉప్పల్(మేడ్చల్ మల్కాజిగిరి) – 10.45 సెంటీమీటర్లు
వలిగొండ(యాదాద్రి భువనగిరి) – 10.08 సెంటీమీటర్లు