ఘజియాబాద్‌లో తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న అక్కాచెలెళ్లు
ఘజియాబాద్ : కొరియన్ గేమింగ్ యాప్‌కు బానిసలైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారు జామున 2:15 గంటల సమయంలో ఈ అక్కాచెల్లెళు తమ హౌసింగ్ సోసైటీలోని తొమ్మిదవంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గేమింగ్ యాప్‌లో చివరి టాస్క్ ఆత్మహత్య అని, గేమింగ్ యాప్‌లో సూచనల మేరకే బాలికలు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది. ఈ సంఘటన పూర్తి వివరాల ప్రకారం ఘజియాబాద్‌లోని సన్ సిటీ కాంప్లెక్స్‌లో చేతన్ కుమార్ అనే వ్యక్తి తన ఇద్దరు భార్యలు సుజాత, హీనాతో కలిసి ఉంటున్నారు.
వీరికి మొత్తం నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో ఫకి (12), ప్రాచి (14), విశిఖ (16) అనే ముగ్గురు గేమింగ్ యాప్‌కు బానిసలయ్యారు. తల్లిదండ్రులు దీన్ని నివారించడానికి ప్రయత్నించినా వారిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామను తమ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. తరువాత బాల్కనీకి వెళ్లి అక్కడ్ని నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సమయంలో వారి అరుపులు, వారు కిందపడిన శబ్ధం విని తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారు, సెక్యూరిటీ గార్డులు అక్కడకు చేరుకున్నారు. బాలికలను అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలికలు మరణించినట్టు వైద్యులు చెప్పారు. ఈ సంఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలికల ప్యాకెట్ డైరీలో ఎనిమిది పేజీల్లో ఈ సూసైడ్ నోట్‌ను రాసారు. సూసైడ్ నోట్‌లో ‘సారీ.. పపా..! కొరియాను వదులుకోలేం. జీవితాలను అంతం చేసుకుంటున్నాం’ అని ఉంది.
వారి మొబైల్ కార్యకలాపాల పూర్తి వివరాలు ఉన్నాయి. ‘మీరు మమ్మల్ని కొరియన్ల నుంచి దూరం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు మేం కొరియన్లను ఎంతగా ప్రేమిస్తున్నామో మీకు తెలుస్తుంది’ అని రాసారు. ఈ ముగ్గురు కొరియన్ పాప్ సంస్కృతి, కొరియన్ సినిమాలు, సంగీతం, షార్ట్ ఫిల్మ్‌లు, షోలు, సిరీస్‌లకు పూర్తిగా ఆకర్షితులైనట్టు డైరీ నోట్స్ వెల్లడించాయి. ‘ముగ్గరు అమ్మాయిలు కొరియన్ సంస్కృతితో ప్రభావితమయ్యారని, దాన్ని వారు సూసైడ్ నోట్‌లో ప్రముఖంగా ప్రస్తావించారని’ సీనియర్ పోలీస్ అధికారి నిమిస్ పటేల్ తెలిపారు. ఈ ముగ్గురు స్నానం చేయడంతో సహా తినడం, ఆడుకోవడం అన్నీ కలిసే చేసేశారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో వీరికి ఫోన్ వ్యసనం ప్రారంభమయింది.
తరువాత నుంచి స్కూల్‌కు వెళ్లడం క్రమంగా తగ్గించేశారు. రెండేండ్ల నుంచి వారు పూర్తిగా పాఠశాలకు వెళ్లడం లేదు. బాలికలు ముగ్గురు కొరియన్ భాషకు ఎంతగా అలవాటు పడ్డారంటే వారు తమకు కొరియన్ పేర్లును కూడా పెట్టుకున్నారు. బాలికల తండ్రి చేతన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ పిల్లలు ఆడుతున్న గేమ్‌లో టాస్క్‌లు ఉన్నాయని తనకు తెలియదని చెప్పారు. అయితే తన కుమార్తెలు పదేపదే కొరియాకు వెళ్లాలనుకుంటున్నారని చెప్పేవారని తెలిపారు. పోలీసు ఫోరెన్సిక్ బృందం వారి మొబైల్ ఫోన్లను పరిశీలించిన తరువాతే తనకు ఈ విషయాలన్నీ తెలిశాయని చెప్పారు.



