Friday, May 9, 2025
Homeరాష్ట్రీయంమందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతి

మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతి

- Advertisement -

– కర్రెగుట్టల్లో పారుతున్న రక్తపుటేరులు
– వరంగల్‌కు చేరుకున్న డీజీపీ, గ్రేహౌండ్స్‌ డీజీ
– మృతులకు ఘనంగా నివాళి
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ అటవీ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టల్లో 15 రోజులుగా రెండు రాష్ట్రాల పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌, గ్రేహౌండ్స్‌ బలగాలు పెద్ద ఎత్తున ‘కగార్‌’ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా, ఇప్పటి వరకు పెద్ద ఎత్తున మావోయిస్టులే మృతిచెందారు. కాగా, గురువారం ఉదయం ములుగు జిల్లా వాజేడు మండలం, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ చేస్తుండగా.. మవోయిస్టులు పెట్టిన మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతిచెందడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటనలో మరొక ఆర్‌ఎస్‌ఐ తీవ్రంగా గాయపడ్డారు. 15 రోజులుగా కర్రెగుట్టల్లో జరుగుతున్న ‘కగార్‌’ ఆపరేషన్‌తో మావోయిస్టులు రాష్ట్రంలోకి చొరబడకుండా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సరిహద్దు జిల్లాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్‌ జరుపుతున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన వందలాది మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేస్తూ ముందుకు పోతున్నారు. ఈ క్రమంలో గురువారం మందుపాతర పేలడంతో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతిచెందారు. వారిని.. శ్రీధర్‌, పవన్‌ కళ్యాణ్‌, సందీప్‌గా గుర్తించారు. ముగ్గురు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అలాగే, వరంగల్‌ మండలం పైడిపెల్లి గ్రామానికి చెందిన ఆర్‌ఎస్‌ఐ రణధీర్‌ తీవ్రంగా గాయపడగా.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర డీజీపీ జితేందర్‌, గ్రేహౌండ్స్‌ డీజీపీ స్టీఫెన్‌ రవీంద్ర హుటాహుటిన వరంగల్‌కు చేరుకున్నారు. ఎంజీఎంలో ముగ్గురు పోలీసుల మృతదేహాల వద్ద నివాళులర్పించారు. కాగా, ముగ్గురు పోలీసులు మృతిచెందడంతో సరిహద్దు అటవీ గ్రామాల్లో యుద్ధవాతావరణం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -