విచారణ అనంతరం ఒకరి విడుదల
టీవీ చానల్ ఆఫీసులో సోదాలు
బ్యాంకాక్‌కు పారిపోతుంటే పట్టుకున్నాం : పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్/సిటీబ్యూరో
మహిళా ఐఏఎస్ అధికారిపై అభ్యంతరకర రీతిలో కథనం ప్రసారం చేసిన కేసులో ముగ్గురు జర్నలిస్టులను సిట్ అధికారు లు అరెస్ట్‌చేశారు. ఇందులో ఎన్టీవీ ఇన్‌ఫుట్ ఎడిటర్ దొంతు రమేష్, సీనియర్ జర్నలిస్టు పరిపూర్ణాచా రి, సుధీర్‌బాబు ఉన్నారు. మంగళ వారం రాత్రి వీరిని హైదరాబాద్ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని ఇంటిదగ్గర, ఒకరిని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అరెస్ట్ చేశారు. ఇటీవల ఆ న్యూస్ చానల్‌లో ఒక మహిళా ఐఏఎస్ అధికారి, మరో మంత్రి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతు న్నాయనే కథనాన్ని ప్రసారం చేశారు. దీంతో ఇటు ఐఏఎస్, అటు ఐపీఎస్ వర్గాలు సదరు వార్తాకథనంపై భగ్గుమన్నాయి. ఈ వార్త ప్రసారం ద్వారా ఆ మహిళా ఐఎఎస్ పరువు ప్రతిష్ట, గౌరవ మర్యాదలకు తీవ్ర హాని కలిగిదంటూ ఈ వార్తను ప్రసారం చేసిన టీవీ చానల్ బాధ్యులతోపాటు ఏడు యూట్యూ బ్ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం ఇటు ప్రభుత్వంతోపాటు అటు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఇందుకు ఐపీఎస్ అధికారుల సంఘం కూడా మద్దతు పలికింది. దీనిపై స్పందించిన రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక ధర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన సిట్ పోలీస్ అధికారులు ప్రాథమిక విచారణలో ఈ ప్రసారం వెనుక ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేష్, సుధీర్ బాబు, పరిపూర్ణాచారి ఉన్నట్టు తెలిసి అర్థరాత్రి అరెస్ట్ చేశారు. అదే సమయంలో బుధవారం ఎన్టీవీ కార్యాలయంలో సిట్ ప్రత్యేక బృందం సోదాలు నిర్వహించింది. ఈ ప్రసారం కోసం వాడిన కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్, సీపీయూను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిట్ అధికారులు తమ కార్యాలయంలోకి ప్రవేశించ డం పట్ల ఎన్టీవీ జర్నలిస్టులు, సిబ్బంది తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఒకవైపు పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగానే, మరోవైపు వారికి వ్యతిరేకంగా ఎన్టీవీ సిబ్బంది, జర్నలిస్టులు నినాదాలు చేశారు. సోదా చేయడానికి సెర్చ్ వారెంట్ మీ దగ్గర ఉందా? అంటూ సిట్ అధికారులను నిలదీశారు. అందుకు మౌనం వహించిన అధికారులు ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. కాగా తమ కార్యాలయంలోకి సిట్ అధికారులు బలవంతంగా ప్రవేశించి మహిళా ఉద్యోగులు, జర్నలిస్టులు, సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి తమకు అవసరమైనవి ఇవ్వకపోతే అందరిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించాల్సి వస్తుందని బెదిరించారని ఆ చానల్ సిబ్బంది ఆరోపించారు. ఇదిలావుండగా అరెస్టయిన ముగ్గురు జర్నలిస్టులను హైదరాబాద్‌లోని నేర పరిశోధక విభాగానికి(సీసీఎస్) తరలించి సిట్ అధికారులు మూడు గంటలపాటు విచారించారు. అనంతరం కేసులో నిందితుడిగా ఉన్న పరిపూర్ణాచారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మరో ఇద్దరు నిందితులు దొంతు రమేశ్, సుధీర్‌బాబును సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం సీసీఎస్‌కు తీసుకెళ్లారు. అర్థరాత్రి తర్వాత వీరిద్దరినీ న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.
అక్రమంగా అరెస్ట్ చేశారు:జర్నలిస్టులు
సీసీఎస్ వద్ద దొంతు రమేష్, సుధీర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ తమను సిట్ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారనీ, తాము ఎలాంటి పొరపాట్లు చేయలేదని చెప్పారు. తాము నిరపరాధులమనీ, కోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా సిట్ అధికారులు తమను అడ్డగోలు ప్రశ్నలతో వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇండ్ల ప్రహారీగోడలు దూకి తలుపులు బద్దలుకొట్టి తమను పట్టుకొచ్చారని జర్నలిస్టులు వివరించారు.
బ్యాంకాక్‌కు పారిపోతుంటే అరెస్ట్ చేశాం : హైదరాబాద్ సీపీ సజ్జనార్
ఈ కేసులో నిందితులైన ఎన్టీవీ జర్నలిస్టులు బ్యాంకాక్‌కు పారిపోతుంటే అరెస్ట్ చేశామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. వీరి ఇండ్లపై దాడులు చేసి తలుపులు విరగ్గొట్టి పట్టుకొచ్చామని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ముందుగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవొచ్చు కదా అని విలేకర్లు ప్రశ్నించగా, తాము విచారణకు రమ్మని చెప్పామనీ, తర్వాత వారు మొబైల్ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకున్నారనీ, ఇక నోటీసులు ఇచ్చేది ఏంటని ఆయన ఎదురు ప్రశ్నించారు. విచారణకు రమ్మన్నప్పుడు వెంటనే రావచ్చు కదా అని ఆయన అన్నారు. పైగా వారు బ్యాంకాక్‌కు పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారనీ, ఆ ప్రయత్నంలో ఉండగానే తాము పట్టుకున్నామని తెలిపారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారి పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా వార్తప్రసారాలు చేసి, మరోవైపు ఆమె కార్యాలయంలో పనిచేసుకునే పరిస్థితులను సైతం కలుషితం చేశారని వివరించారు. ఇది ఎంతవరకు న్యాయమని ఆయన అడిగారు. మహిళల పరువు మర్యాదలకు ఎక్కడ భంగమేర్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. ఐఏఎస్ అధికారుల సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఎన్టీవీతోపాటు ఇతర యూట్యూబ్ ఛానళ్ల బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని సజ్జనార్ స్పష్టం చేశారు.
ముగ్గురు జర్నలిస్టుల అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



