Monday, May 5, 2025
Homeక్రైమ్వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

- Advertisement -

– కీసర ఓఆర్‌ఆర్‌పై కంటైనర్‌ను కారు డీ కొని ఇద్దరు..
– సిద్దిపేట జిల్లాలో ఒకరు..
నవతెలంగాణ-కీసర/ వర్గల్‌

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లికి చెందిన యశ్వంత్‌ (25), పీర్జాదిగూడకు చెందిన చార్లెస్‌ (25), ఎల్బీనగర్‌కు చెందిన చెన్నకేశవ గౌడ్‌ (23), అలాగే వివేక్‌, సురేగ్‌, యశ్వంత్‌ నాయక్‌.. శనివారం కర్నాటకలోని బీదర్‌ జిల్లా లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానానికి కారులో వెళ్లారు. ఆదివారం ఉదయం తిరుగు ప్రయాణంలో యశ్వంత్‌ కారును నడుపుతుండగా చార్లెస్‌ ముందు సీట్లో కూర్చున్నాడు. మిగతా ముగ్గురు వెనక సీటులో ఉన్నారు. ఉదయం 11:15 గంటల సమయంలో కీసర ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు చేరుకోగానే, ముందున్న గ్యాస్‌ కంటైనర్‌ లారీని కారు వెనుక నుంచి ఢ కొని డివైడర్‌కు తగిలింది. ఈ ప్రమాదంలో యశ్వంత్‌, చార్లెస్‌ అక్కడికక్కడే మృతిచెందారు. చెన్నకేశవ గౌడ్‌కు తీవ్ర గాయాలవడంతో ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కీసర ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలంలోని కావేరి సీడ్స్‌ కంపెనీ దగ్గరలోని గౌరారం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటకలోని బీదర్‌ జిల్లాకు చెందిన అమర్‌(26) గతేడాది నుంచి కావేరి సీడ్స్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. రోజులాగే గౌరారం నుంచి అమర్‌, రాంసింగ్‌.. ఇద్దరూ కావేరి కంపెనీ వైపు వెళ్తుండగా మర్కుక్‌ వైపు నుంచి అజాగ్రత్తగా, వేగంగా దూసుకొచ్చిన ఓ ద్విచక్ర వాహనం వీరి వాహనాన్ని బలంగా ఢ కొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరిని వెంటనే గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అమర్‌ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. రాంసింగ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వాహనాన్ని ఢ కొట్టిన మరో వాహనంపై ఉన్న వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మృతుని తండ్రి సిద్ధకంతప్ప ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -