Wednesday, February 25, 2026
E-PAPER
Homeక్రైమ్ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

- Advertisement -

అంబర్‌పేటలో విషాదం
అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులే కారణం
పది రూపాయల బాండ్‌ పేపర్‌పై సూసైడ్‌ నోట్‌
నవతెలంగాణ-అంబర్‌పేట

హైదరాబాద్‌ అంబర్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మ హత్యకు పాల్పడ్డారు. భర్త, భార్యతో పాటు కుమారుడు సూసైడ్‌ చేసుకున్నారు. పది రూపాయల బాండ్‌ పేపర్‌పై సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది. ఈ ఘటనకు సంబంధించి సికింద్రాబాద్‌ జోన్‌ డీసీపీ రక్షిత కె మూర్తి, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబర్‌పేట బాపునగర్‌ కాకతీయ బజార్‌లో కడిగేకర్‌ రామరాజు(54), అతని భార్య కె.మాధవి(50), కుమారుడు శశాంక్‌ రాజ్‌ (27) నివాసముంటున్నారు. దంపతులకు అమూల్య అనే కుమార్తె ఉంది. ఆమెకు ఏడేండ్ల క్రితం జీడిమెట్ల ప్రాజెక్టు కాలనీకి చెందిన జి.కిరణ్‌ కుమార్‌తో వివాహం జరిగింది. రామరాజ్‌ మల్లాపూర్‌లో తన కుమారుడు శశాంక్‌ రాజ్‌తో కలిసి కింగ్స్‌ బిర్యానీ రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నాడు. అయితే రామరాజుకు గత కొంతకాలంగా వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఐదారు రోజులుగా ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున అతన తన భార్య, కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. 10 రూపాయల బాండ్‌ పేపర్‌పై సూసైడ్‌ నోట్‌ రాశారు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతోనే తాము ఆత్మహత్య చేసుకున్నట్టు అందులో పేర్కొన్నారు. రామరాజు తన ఇంట్లోని రెండో అంతస్థులో బెడ్‌రూమ్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కుమారుడు శశాంక్‌ రాజ్‌ ముందుగా చేతి మనికట్టును కత్తితో కోసుకుని తీవ్ర రక్తస్రావం జరిగిన తర్వాత తాను చనిపోనేమోనని మరో గదిలో వెళ్లి ఉరివేసుకున్నట్టు తెలుస్తోంది. భార్య మాధవి మంచంపై మృతి చెంది పడి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. కాగా, శశాంక్‌ రాజ్‌ తన స్నేహితుడు రవికి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫోన్‌లో సందేశం పంపాడు. ఉదయం 8 గంటల సమయంలో ఆ మెసేజ్‌ చూసిన రవి వెంటనే ఇంటికి వెళ్లి చూడగా ముగ్గురు మృతదేహాలు కనిపించాయి. వెంటనే దంపతుల కుమార్తె అమూల్యకు సమాచారం ఇచ్చాడు. ఆమె ఉదయం 10.30 సమయంలో అక్కడికి చేరుకుంది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, క్లూస్‌ టీమ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రామరాజు భార్య మరణానికి గల కారణాలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముందు తండ్రీ, కుమారుడు కలిసి ఆమెపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి తర్వాత వీరు ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇన్‌స్పెక్టర్‌ టి.కిరణ్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -