నెలాఖరు నాటికి పూర్తిస్థాయి క్యాబినెట్?..సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు
దిశా నిర్దేశం చేసిన రాహుల్ గాంధీ
ఇప్పటి వరకూ ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాలకు ప్రాధాన్యత
అజారుద్దీన్ ఉండేనా… ఊడేనా?
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి రెండున్నరేండ్లు కావస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే ఇప్పుడా సమయం వచ్చినట్టు పార్టీ ఢిల్లీ అగ్రనాయకత్వం నుంచి వస్తున్న సమాచారం. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఇదే విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించినట్టు తెలిసింది. రాహుల్ గాంధీ ఇచ్చిన ఫ్రీ హ్యాండ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు స్పీడ్ పెంచుతున్నట్టు సమాచారం. ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి ఉపయోగపడే వారిని క్యాబినెట్‌లోకి తీసుకుని తన టీమ్‌ను మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు.
అదే సమయంలో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగేలా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామంటూ అంతర్గతంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అనేక విషయాల్లో మంత్రివర్గ సహచరుల నుంచి సరైన సహకారం లేకపోవడం, ప్రభుత్వాన్ని, పార్టీని డిఫెన్స్ చేయాల్సిన సమయంలో వారు మౌనంగా ఉండటం వంటివి రాబోయే రోజుల్లో తీరని నష్టం కలిగిస్తాయని సీఎం అంచనా వేశారు. దీన్ని సరి చేసేందుకు వీలుగా యువ నేతలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఐదుగురిని ఇటీవలే ప్రభుత్వ విప్‌లుగా నియమించారు. దీంతోపాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోనున్నారు. పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ సమయంలో ఇప్పుడున్న వారిలో ఎవరినైనా పక్కనపెట్టాల్సి వస్తే వారికి క్యాబినెట్ హోదాతో కార్పొరేషన్ చైర్మెన్ పదవులను కట్టబెట్టేందుకు సీఎం యోచిస్తున్నట్టు సమాచారం.
ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఎవరైనా ఒప్పుకోకపోతే ఏఐసీసీ స్థాయిలో పార్టీ పదవి ఇస్తామనే హామీ ఇవ్వాలని భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఇప్పటికే లాబీయింగ్ మొదలు పెట్టారు. ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేని సామాజిక తరగతులు, ఉమ్మడి జిల్లాల నేతలకు క్యాబినెట్‌లో పెద్ద పీట వేయాలని ఏఐసీసీ పెద్దలు సీఎంకు సూచించారు. ఇదే జరిగితే ప్రస్తుతమున్న ఇద్దరు ముగ్గురు మంత్రులను పక్కన పెట్టాల్సి వస్తుందని అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అందువల్ల పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎమ్మెల్సీగా ఉన్న మహేశ్‌కుమార్ గౌడ్‌ను ఆ జిల్లా నుంచి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ వినిపిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో బలమైన మున్నూరుకాపు, యాదవ సామాజిక తరగతులకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు.
దీంతో మున్నూరుకాపు సామాజిక తరగతి నుండి ఆది శ్రీనివాస్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారని సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి యాదవుల ప్రాతినిధ్యం లేని మొదటి క్యాబినెట్ రేవంత్‌దే. అందువల్ల ఆ సామాజిక తరగతికి చెందిన బీర్ల అయిలయ్యకు ఈసారి ఛాన్స్ దక్కే అవకాశముంది. లంబాడా సామాజిక తరగతికి సైతం మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం లేదు. దీంతో సీనియర్ ఎమ్మెల్యే బాలూనాయక్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. ఈ కూర్పులో భాగంగా మంత్రి వర్గంలో చోటు దక్కని సామాజిక తరగతులకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని కట్టబెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇదిలా ఉంటే క్యాబినెట్‌లో బెర్తు కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ వీరిద్దరూ రెడ్డి సామాజిక తరగతికి చెందిన వారే కావటం వల్ల వారి ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఆ తరగతి నుంచి ఇప్పటికే ఎక్కువ మంది మంత్రులుగా ఉన్న సంగతి తెలిసిందే.
అజహరుద్దీన్ ఉండేనా…ఊడేనా?
మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ పరిస్థితి ఇప్పుడు డోలాయమానంలో పడింది. గవర్నర్ కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీగా చేసి, ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. ఆ ప్రకారం ఆయన గత అక్టోబరులో మంత్రి పదవిని చేపట్టారు. కానీ గవర్నర్ కోటాలో అజహరుద్దీన్ ఎమ్మెల్సీ కాలేకపోయారు. సంబంధిత దస్త్రం ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. ఈ విషయమై మాజీ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మతో సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు మంతనాలు జరిపారు. ఆ ఫైలు ఒక కొలిక్కి వచ్చే దశలో గవర్నర్ మహారాష్ట్రకు బదిలీపై వెళ్లిపోయారు. కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆ దస్త్రంపై ఇంకా దృష్టి సారించలేదు. ఈనెల 26తో మంత్రిగా అజహరుద్దీన్ కాలపరిమితి పూర్తవుతున్న క్రమంలో ఆ ఫైలును క్లియర్ చేయించటం ద్వారా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా? లేదా? అనేది చూడాలి. అది సాధ్యం కాకపోతే ఈనెల 26లోగా అజహరుద్దీన్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించి, మళ్లీ ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.



