Monday, March 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకూల్చివేతలకి ముగ్గురు మంత్రులే బాధ్యత వహించాలి

కూల్చివేతలకి ముగ్గురు మంత్రులే బాధ్యత వహించాలి

- Advertisement -

భూదాన్‌ భూముల్లోనే పేదలకు పక్కా ఇండ్లు కట్టించాలి
పేదలకు న్యాయం చేయకపోతే సీపీఐ(ఎం) ఆందోళనలు ఉధృతం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు డిమాండ్‌

నవతెలంగాణ-ఖమ్మం కలెక్టరేట్‌
ఖమ్మంలోని వెలుగుమట్లలో ప్రభుత్వం కూల్చి వేసిన ఇండ్లున్న భూదాన భూములు విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు తీవ్రంగా ఖండించారు. పేదల ఇండ్ల కూల్చివేతకి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులే నైతిక బాధ్యత వహించాలన్నారు. భూదాన భూముల్లోనే పేదలకు పక్కా ఇండ్లు కట్టించాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోతినేని మాట్లాడారు. మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని, భూదాన భూములు విలువైనవని పేర్కొనడం సరైనది కాదని అన్నారు.

భూదాన భూములు దానం చేసిన వారు పేదల కోసమే దానం ఇచ్చారని గుర్తు చేశారు. 1965, భూదాన యజ్ఞ బోర్డు చట్టం కూడా ఈ భూములు పేదలకే ఇవ్వాలని చెబుతున్నదని తెలిపారు. అవి విలువ ఎక్కువున్నా, తక్కువున్నా పేదలకే చెందుతాయని స్పష్టంచేశారు. చట్టాన్ని పక్కన పెట్టి ”విలువైన భూములు” అనే పేరుతో పేదలను అక్కడి నుంచి వెళ్లగొట్టడం చట్ట ఉల్లంఘనతో సమానమని అన్నారు. భూదాన యజ్ఞం భూములను రెవెన్యూ శాఖ ఎలా స్వాధీనం చేసుకుంటుందని ప్రశ్నించారు. 147, 148, 149 సర్వే నెంబర్లలోని ఈ భూదాన భూముల్లో ఈ పేదలకు నాటి చైర్మెన్‌ రాజేందర్‌ రెడ్డి స్వయంగా పట్టాలు ఇచ్చానని చెప్పారని గుర్తుచేశారు. కాబట్టి ఆ భూముల్లోనే పేదలకు పట్టాలు ఇచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

భూదాన భూముల్లో ఇండ్లు కోల్పోయిన పేదలను చీలదీసి, బెదిరించి నష్టం కలిగించేలా అధికారులు వ్యవహరిస్తున్నారని సుదర్శన్‌ విమర్శించారు. వారికి షెల్టర్‌గా ప్రస్తుతం కేటాయించిన అంబేద్కర్‌ భవన్‌, టీటీడీసీ భవనాలకు వాడుకొనే నీళ్ళు కూడా బంద్‌ చేశారని చెప్పారు. అక్కడ వృద్ధులు, చంటి పిల్లల తల్లులు, గర్భిణులు నరకం అనుభవిస్తున్నారని అన్నారు. గుట్టల్లో ఇండ్లు వేసుకుని నివసిస్తున్న వారంతా పేదలేనని, వారికి న్యాయం చేయాలని కోరారు. వారిని సొంత గ్రామాలకు పంపాలని మండల రెవిన్యూ అధికారులతో ఒత్తిడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావాస కేంద్రాల్లో తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.విక్రమ్‌, బండి రమేష్‌, భూక్యా వీరభద్రం, మెరుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -