– మృతుల్లో తల్లీకూతురితోపాటు.. మరో బాలుడు
– సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరపల్లిలో ఘటన
నవతెలంగాణ-చిన్నకోడూరు
చెక్ డ్యామ్‌లో స్నానం కోసం వెళ్లిన బాలిక, బాలుడు నీట మునగగా, వారిని కాపాడానికి ప్రయత్నించిన బాలిక తల్లి కూడా నీటి మునిగి ముగ్గురూ మృతిచెందిన విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి గ్రామంలో శనివారం జరిగింది. ఎస్‌ఐ సైఫ్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. కస్తూరిపల్లి గ్రామానికి చెందిన మందాల నారాయణరెడ్డి మామిడి తోటలో బీహార్‌కు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. అయితే శనివారం ఆ మామిడి తోటకు పక్కనే ఉన్న చెక్ డ్యామ్‌లో స్నానాల కోసమని బాలిక ముంజేయి బిరజ్(6) బాలుడు కిరణ్ కుమార్(12) వెళ్లారు. వారు ప్రమాదశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన బిరజ్ తల్లి ఉమాదేవి(32) వారిని కాపాడే ప్రయత్నం చేసి.. ఆమె కూడా నీట మునిగి మృతి చెందింది. తల్లీకూతురుతో పాటు మరో బాలుడు.. ముగ్గురూ ఒకే ప్రమాదంలో నీట మునిగి మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ శీను, ఎస్‌ఐ సైఫ్ అలీ ఘటనాస్థలికి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
చెక్‌డ్యామ్‌లో స్నానానికి వెళ్లి.. నీట మునిగి ముగ్గురు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



