Monday, March 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో ముగ్గురు రిమాండ్‌

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో ముగ్గురు రిమాండ్‌

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు
టీడీపీ ఎంపీ పుట్ట మహేశ్‌తో పాటు ఇతరులకు స్టేషన్‌ బెయిల్‌
కొనసాగుతున్న విచారణ
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు

నవతెలంగాణ-మొయినాబాద్‌
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఫౌంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు ఆదివారం ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితేష్‌రెడ్డి, మరో వ్యక్తి నితేష్‌ శర్మ ఉన్నారు. ఇదే కేసులో అరెస్టయిన టీడీపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్‌ కుమార్‌ యాదవ్‌తోపాటు మిగతా వారికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. ఈగల్‌ టీమ్‌ ఎస్పీ, చేవెళ్ల డీసీపీ యోగేష్‌ గౌతమ్‌, మొయినాబాద్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నయీముద్దీన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఫౌంహౌస్‌లో శనివారం రాత్రి డ్రగ్స్‌ పార్టీ నిర్వహించారు.

ఈ పార్టీకి రోహిత్‌రెడ్డి, ఏపీ ఎంపీ మహేష్‌ కుమార్‌యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే సోదరుడు రితేష్‌రెడ్డి, నమిత్‌, కౌశిక్‌ రవి, అర్జున్‌రెడ్డి, రవేష్‌, శ్రావణ్‌కుమార్‌, విజయకృష్ణ, సిరివేరి శరత్‌కుమార్‌, ప్రియాంకరెడ్డి హాజరయ్యారు. డ్రగ్స్‌ తీసుకుంటున్నారన్న పక్కా సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ, ఈగల్‌ టీమ్‌ ఫాంహౌస్‌లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 10 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా డ్రైవర్‌ సిల్వరి శరత్‌కు మార్‌ వద్ద నుంచి 0.26 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఓ అడ్వకేట్‌ ఈ డ్రగ్స్‌ తీసుకువచ్చారు. అతడే పార్టీకి డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే పార్టీలో భారీగా విదేశీ మద్యం వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు.

తనిఖీల్లో మొత్తం 48 బీర్‌ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ఖరీదైన విదేశీ మద్యం బ్రాండ్ల బాటిళ్లను కూడా పోలీసులు సీజ్‌ చేశారు. స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి వీటిని వినియోగించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదిలా ఉంటే నిందితులను అదుపులోకి తీసుకుని డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఎంపీ మహేష్‌కుమార్‌ యాదవ్‌కు రాత్రి నెగటివ్‌ రాగా.. ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది.

మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డిపాటు మరో ఇద్దరిని ముందుగా శంషాబాద్‌ రూరల్‌ పీఎస్‌కు తరలించారు. అనంతరం కోర్టులో హాజరపరిచేందుకు తీసుకెళ్లారు. వీరిని జడ్జి ఎదుట హాజరుపరచగా.. వీరికి రిమాండ్‌ విధించారు. ఈ కేసులో ఉన్న ఎంపీ మహేష్‌కుమార్‌ యాదవ్‌తోపాటు ఇతరులకు నోటీసులు ఇచ్చి వదిలేశారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

పోలీసులపై కాల్పులు
ఈ ఘటనలో పోలీసులపై కాల్పుల ఘటన కలకలం రేపింది. పోలీసులు ఫాంహౌస్‌ వద్దకు వెళ్లిన సమయంలో పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ తుపాకీ మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తమ్ముడిదిగా పోలీసులు గుర్తించారు. జర్మనీకి చెందిన 32వ రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఒక లైవ్‌ రౌండ్‌, నాలుగు ఖాళీ కార్ట్రిడ్జ్‌ను కూడా పోలీసులు సీజ్‌ చేశారు.

డ్రగ్స్‌ సరఫరాపై ఆరా..
ఈ కేసులో మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సరఫరా చేశారు, మరెవరైనా ఇందులో భాగస్వాములు ఉన్నారా అనే విషయాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పార్టీ నిర్వహణ, తుపాకీ వినియోగం, డ్రగ్స్‌ వినియోగం వంటి అంశాలన్నింటినీ పోలీసులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. అవసరమైతే మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాజకీయ ప్రకంపనలు
ఈ డ్రగ్స్‌ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫాంహౌస్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేది కావడం, ఈ పార్టీలో టీడీపీ ఎంపీ, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే పాల్గొనడంతో రాజకీయ కోణం అలుము కుంది. ఈ కేసుపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ స్పందిస్తూ.. దీనికి బీఆర్‌ఎస్‌ పార్టీ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డ్రగ్స్‌ టెస్ట్‌కు సిద్ధం కావాలని అన్నారు. దీనికి కేటీఆర్‌ కూడా స్పందించారు.

ఈ కేసులో ఎంతటివారున్నా వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తాను డ్రగ్స్‌ టెస్టుకు సిద్ధమని ప్రకటించారు. అయితే ఈ కేసులో తన పేరు ప్రస్తావించే ప్రయత్నం చేయొద్దని, అలా చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సైతం టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య వార్‌ నడుస్తోంది. టీడీపీ ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కేసు రాజకీయంగా ఇంకెన్నీ మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -