ఈ మధ్య కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధ పడుతున్నారు. థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్… అయితే ఎక్కువగా ఉత్పత్తి చేయడమో, లేకపోతే అస్సలు ఉత్పత్తి చేయకపోవడమో జరగడం వల్ల ఇబ్బంది మొదలవుతుంది. పురుషుల కంటే స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ హార్మోన్ మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవ క్రియ సజావుగా సాగాలన్నా, శరీరంలో ఉత్పత్తి అయ్యే కణాలు ఎప్పటికప్పుడు రిపేర్ కావాలన్నా ఇది సహకరిస్తుంది. సమతుల ఆహారాన్ని తీసుకోకపోవడమూ ఈ హార్మోన్ విడుదలలో హెచ్చు తగ్గులు రావడానికి కారణంగా చెబుతున్నారు. ఇలా థైరాయిడ్ సమస్య ఉన్న వారు ఆహారంలో ఏం మార్పులు చేసుకోవాలనే దానిపై నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..
థైరాయిడ్ గ్రంథి విడుదల చేయాల్సిన దానికంటే తక్కువ హార్మోన్‌ని విడుదల చేస్తుంటే దాన్ని హైపో థైరాయిడిజం అంటారు. ముఖ్యంగా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఆహారాన్ని క్రమబద్ధంగా తినాలి. ఒకసారి తినడం, ఒకసారి తినకపోవడం చేయకూడదు. అలాగే వీరు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని తినేందుకు ప్రయత్నించాలి. ఉసిరికాయలో చాలా ఎక్కువగా సీ విటమిన్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం మంచిది. చేపలు, నట్స్, తాజా కూరగాయలు, పళ్లు తీసుకోవాలి. ఈ సమస్య వున్నవాళ్లు క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్, సోయ, పాలకూరలను తినకూడదు. వీటిలో ఉండే గోయిట్రోజెన్ సమస్యను మరింత పెంచుతుంది. అలాగే చిలకడ దుంపలు, స్ట్రాబెరీలు, పీచ్‌లు, వేరుశెనగలు, కొలస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండే రెడ్ మీట్ తినకూడదు.
థైరాయిడ్ గ్రంథి అవసరం అయిన దానికంటే ఎక్కువ హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తుంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అని పిలుస్తుంటారు. వీరు ఎక్కువగా నీటిని తాగుతూ శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. నాన్ అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే వాడాలి. తాజా పళ్లు, ఎగ్ వైట్స్ తినొచ్చు.
వీరు చాలా ముఖ్యంగా ఉప్పు ఉన్న ఆహార పదార్థాలను తగ్గించాలి. అయోడైజ్డ్ ఉప్పు తినడం మానేయాలి. నువ్వుల పొడిని తినకూడదు. హై కేలరీలు ఉండే స్వీట్లను తినకూడదు. పాలు, చీజ్, ఐస్ క్రీమ్‌లు, పెరుగు లాంటివి తినకూడదు. రైస్ కూడా తగ్గించాలి. ఫ్రై చేసిన ఆహార పదార్థాల్ని తగ్గించాలి. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. కెఫీన్ ఉండే పదార్థాలు తీసుకోకూడదు. చేపలు, గుడ్డులో పచ్చసొన తినకూడదు.