– ఉమ్మడి కరీంనగర్ మున్సిపల్ పోరులో ‘బి-ఫాం’ సెగ
– జగిత్యాలలో జీవన్‌రెడ్డి వర్సెస్ సంజయ్ వార్
– కరీంనగర్‌లో బాహాబాహీ
– సీనియర్ కార్యకర్తల కన్నీరు
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
దశాబ్దాలుగా పార్టీ జెండా మోసి, కష్టకాలంలో అండగా నిలబడినందుకు తగిన శాస్తి చేశారని క్షేత్రస్థాయి కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. పది రోజుల కిందట పార్టీ మారిన వారికి ‘బి-ఫాం’లు ఇచ్చి అందలం ఎక్కించడంపై ‘ఒరిజినల్’ నేతలు భగ్గుమంటున్నారు. జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు, రాయికల్ నుంచి మెట్‌పల్లి వరకు ప్రతిచోటా ‘వలసవాదులు వర్సెస్ పాతవాళ్లు’ అన్నట్టుగా యుద్ధం నడుస్తోంది. టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ నేతలు రోడ్డెక్కుతున్నారు. జగిత్యాలలో సీనియర్ నేత జీవన్‌రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య పోరు వీధిన పడగా, కరీంనగర్‌లో ఏకంగా భౌతిక దాడులు, కన్నీటి పర్యంతాలు చోటుచేసుకున్నాయి.
జగిత్యాలలో 30-20 ఫార్ములాపై రగడ
జగిత్యాల కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గ్రూపుకు.. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గ్రూపుకు మధ్య టిక్కెట్ల కేటాయింపు చిచ్చు రేపింది. మొత్తం 50 సీట్లలో సంజయ్ గ్రూపుకు 30, జీవన్‌రెడ్డి గ్రూపుకు 20 సీట్లు కేటాయించడంపై జీవన్‌రెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవన్‌రెడ్డి నివాసం వద్ద కార్యకర్తలు ఎమ్మెల్యే సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర పదజాలంతో దూషించారు. ‘నీది ఏ పార్టీరా.. మా పార్టీలోకి వచ్చి మా కడుపు కొడతావా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ‘కాంగ్రెస్ అభ్యర్థులెవరో కార్యకర్తలకు తెలియని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ మద్దతుదారులకు, వలసవాదులకు మధ్యే ఈ పోటీ’ అంటూ జీవన్‌రెడ్డి పరోక్షంగా అసంతృప్తి వెళ్లగక్కారు. జగిత్యాల వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వంటి హేమాహేమీలు భేటీ అయినా ఫలితం లేకపోయిందన్న చర్చ ఆ పార్టీలో నడుస్తోంది.
మెట్‌పల్లి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హరితకు టిక్కెట్ నిరాకరించడంతో ఆమె జీవన్‌రెడ్డి నివాసంలోనే ఏడ్చేశారు. ఐదేండ్లుగా పార్టీ కోసం కష్టపడితే చివరి నిమిషంలో పేరు తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాయికల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని నాగరాజు పార్టీకి రాజీనామా చేశారు.
కరీంనగర్‌లో ‘ముష్టిఘాతాలు’.. డీసీసీ అధ్యక్షుని ముందే తోపులాట!
కరీంనగర్ కాంగ్రెస్‌లో టిక్కెట్ల వ్యవహారం వీధికెక్కింది. సీతారాంపూర్‌లోని డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం నివాసంలోనే సీన్ రక్తికట్టింది. మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ (మార్షల్) భార్య శ్రీలతకు టిక్కెట్ ఇవ్వలేదని ఆరోపిస్తూ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావుతో వాగ్వాదానికి దిగారు. ఇది కాస్తా తోపులాట వరకు వెళ్లింది. ఇదే సమయంలో ప్రెస్‌మీట్ ద్వారా మార్షల్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వెలిచాల రాజేందర్‌రావు బీజేపీతో కుమ్మక్కై టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన రవీందర్‌కు టిక్కెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అజీమ్ తన పదవికి రాజీనామా చేశారు.
వలస బాబులకే టికెట్లు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



