Thursday, May 15, 2025
Homeరాష్ట్రీయంచీరలు కట్టి..నుదుటిన తిలకం దిద్ది..

చీరలు కట్టి..నుదుటిన తిలకం దిద్ది..

- Advertisement -

– హనుమకొండ జిల్లా సందర్శనకు మిస్‌వరల్డ్‌ పోటీదారులు
– ఘన స్వాగతం పలికిన అధికార యంత్రాంగం
– వేయి స్తంభాల దేవాలయం, రామప్ప సందర్శన
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి/ ములుగు/గోవిందరావుపేట

మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ చేరుకున్న పోటీదారులు హెరిటేజ్‌ వాక్‌లో భాగంగా బుధవారం హనుమకొండలో పర్యటించారు. తెలుగుదనం ఉట్టిపడేలా.. పట్టుచీర పట్టు పరికిణిలు కట్టుకుని తిలకం దిద్దుకుని అచ్చం తెలంగాణ అమ్మాయిల్లా తయారయ్యారు. కాకతీయుల కళా వైభవం చూసి మంత్రముగ్ధులయ్యారు. వరంగల్‌లోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయం, వరంగల్‌ కోట, రామప్పను సందర్శించేందుకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో రెండు బృందాలుగా హనుమకొండ, ములుగులోని టూరిజం హౌటల్‌ హరిత కాకతీయకు సాయంత్రం చేరుకున్నారు. హనుమకొండకు చేరుకున్న వివిధ దేశాలకు చెందిన 22మంది పోటీదారుల బృందానికి పూలమాలలు వేసి వారిపై పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. వీరికి వరంగల్‌ హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్‌ సత్య శారద, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులు పుష్ప గుచ్చాలు అందజేశారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, సంప్రదాయ డోలు వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు పోటీదారులు నృత్యాలు చేశారు. అనంతరం హరిత కాకతీయ నుంచి వేయి స్తంభాల దేవాలయానికి బయలుదేరారు. అక్కడ సంప్రదాయ నృత్యాలతో మహిళలు స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో ఉన్న కోనేరును పరీశీలించారు. వేయి స్తంభాల దేవాలయం ప్రాశస్త్యాన్ని వివరించే శిలా శాసనాన్ని పరిశీలించారు. శిలా శాసనంలో ఉన్న ఆలయ చరిత్రను గైడ్‌ వివరించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తాంబాలంలో చెంబులో ఉన్న నీళ్లతో కాళ్లు కడుక్కున్నారు. ఆలయం ఆవరణలో ఉన్న నంది విగ్రహం వద్ద ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. అనంతరం కల్యాణ మండపాన్ని దర్శించారు. అనంతరం ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన పోటీదారులు.. లేజర్‌ కాంతులతో దేదీప్యమానంగా ఉన్న ఆలయ పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. ఆలయం వద్ద ఫొటోలు దిగారు. వేద పండితులు అందించిన తీర్థ ప్రసాదాల్ని స్వీకరించారు. అనంతరం వరంగల్‌ కోటను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి, మేయర్‌ గుండు సుధారాణి, కుడా చైర్మెన్‌ వెంకట్రామిరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే ఇతర అధికారులు పాల్గొన్నారు.
రామప్ప ఆలయంలో..గిరిజన సంప్రదాయ నృత్యంతో స్వాగతం
ములుగు జిల్లా రామప్ప ఆలయానికి చేరుకున్న ప్రపంచ పోటీదారులకు మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ దివాకర, ఎస్పీ శబరిష, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. గిరిజన గుస్సాడీ నృత్య ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన ద్వారా కళాకారులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలోకి చేరుకున్న పోటీదారులు ఎవరికి వారే స్వయంగా కాళ్లు కడుక్కొని పూజలు చేసేందుకు ఆలయంలోకి వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత, చరిత్రను ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పురాతన రామప్ప ఆలయ తీరుతెన్నులను తనివి తీరా తిలకించి ఫిదా అయ్యారు. రామప్ప ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద తెలంగాణ సాహిత్య అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాకతీయ రాజుల పరిపాలన చారిత్రాత్మక అంశాలను నృత్య రూపంలో కళాకారులు ప్రదర్శించారు. రాణి రుద్రమదేవి వేషధారణలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్‌పర్సన్‌ శ్రీమతి అలేఖ్య పుంజరి ప్రదర్శించారు. మంత్రి వెంట ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మెన్‌ సిరిసిల్ల రాజయ్య అధికారులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -