గ్రామాల్లో నిఘా పెంచిన అటవీ శాఖ
జాగ్రత్తలు తీసుకోవాలని ఆ గ్రామాల ప్రజలకు సూచనలు
నవతెలంగాణ – హైదరాబాద్
రాష్ట్రంలో సంచరిస్తున్న పులి విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అటవీ శాఖ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించిన పులిని పట్టుకునేందుకు అటవీశాఖ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అది పలు జిల్లాల్లోని గ్రామాల పరిసరాల్లో తిరుగుతుండటంతో ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి అడవిని వదిలి వచ్చిన విషయం తెలియడంతో పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ వినరు కుమార్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సమావేశాల్లో పులి ప్రస్తుతం ఎక్కడ తిరుగుతోంది, ప్రజలు ఎలా జాగ్రత్తగా ఉండాలి, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆదివారం (ఫిబ్రవరి 8న) సిద్ధిపేట జిల్లా ఆరేపల్లి గ్రామం పరిసరాల్లో ఉన్నట్టు అటవీ శాఖ బృందాలు నిర్ధారించాయి. పులి ఉత్తర దిశగా కదులుతున్నట్లు ట్రాకింగ్ ద్వారా తెలిసింది. ఫిబ్రవరి 6, 7 తేదీల్లో పులి అడుగుజాడలు కనిపించడంతో పాటు, కొన్ని చోట్ల ప్రత్యక్షంగా కనిపించినట్టు కూడా నమోదు చేశారు.
గ్రామాల్లో నిఘా పెంపు
ప్రజలకు, పులికి ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు సిద్ధిపేట, జనగాం, కరీంనగర్, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ, పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. పుణె నుంచి వచ్చిన టైగర్ రెస్క్యూ నిపుణులు పరిస్థితిని పర్యవేక్షిస్తుండగా, స్థానిక వెటర్నరీ డాక్టర్లు వారికి సహకారం అందిస్తున్నారు. అవసరమైతే ఎన్టీసీఏ నిబంధనల ప్రకారం పులిని పట్టుకునే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పులి వేట చేసిన ప్రాంతాల వద్ద ప్రజలు గుమిగూడకుండా పోలీసులు అదుపు చర్యలు చేపడుతున్నారు. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించకుండా ఉండేందుకు అటవీ శాఖ ప్రతిరోజూ అధికారిక సమాచారం వెల్లడిస్తున్నది.
గ్రామస్తులకు సూచనలు
శానిగరం, కోహెడ మండలాలు, ఆరేపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ తాజాగా సూచనలు జారీ చేసింది. రాత్రివేళ అవసరం లేకపోతే బయటకు వెళ్లొద్దనీ, అత్యవసర పరిస్థితుల్లో ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని తెలిపింది. రైతులు విద్యుత్ వైర్లు పెట్టడం, ఉచ్చులు వేయడం చేయరాదని హెచ్చరించింది. పశువులను రాత్రివేళ తప్పనిసరిగా సురక్షిత షెడ్లలో ఉంచాలని సూచించింది.
ఇటీవల ఎనిమిది పశువులపై పులి దాడి చేసినట్టు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం అక్కడికక్కడే పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల భద్రతే ప్రధానంగా, పులి సంరక్షణకు భంగం కలగకుండా శాస్త్రీయ పద్ధతిలో చర్యలు కొనసాగిస్తామని అటవీ శాఖ స్పష్టం చేసింది. పులి కదలికలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలనీ, నిర్ధారణ లేని వార్తలను సోషల్ మీడియాలో పంచుకోవద్దని ప్రజలను కోరింది.



