నవతెలంగాణ – వనపర్తి
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ డిసెంబర్ 23వ తేదీన వనపర్తి జిల్లా పర్యటనకు వస్తున్నందున అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈనెల 23వ తేదీన గవర్నర్ పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 23వ తేదీన 3.30 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిల్లా పర్యటనకు రానున్నట్లు తెలిపారు. గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ముఖాముఖీలో పాల్గొంటారని, అలాంటి వారిని గుర్తించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కార్యక్రమానికి జిల్లాలోని ప్రముఖులను ఆహ్వానించాలని ఆర్డీవోకు సూచించారు.
ప్రొటోకాల్, బందోబస్తు, స్టాళ్ల సందర్శన, డయాస్, సౌండ్ సిస్టం, కరెంట్ సరఫరా తదితరవి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశించారు. జిల్లా ప్రొఫైల్ తో పాటు వివిధ రంగాల్లో జిల్లా సాధించిన అభివృద్ధి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్య నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డి ఆర్ డి ఓ ఉమాదేవి, డీ ఎం హెచ్ ఓ సాయినాథ్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.



