– నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ ఆర్.సతీష్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది అని పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీష్ కుమార్ అన్నారు. అశ్వారావుపేట లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆయన బుధవారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం నామినేషన్ సెంటర్ల పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు, రూట్ మ్యాప్, ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు,మెటల్ డిటెక్టర్ల వినియోగం వంటి అంశాలపై డీఎస్పీ అధికారులతో సమీక్షించారు.
అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎలాంటి గందరగోళం, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.విలేకర్లతో మాట్లాడుతూ అశ్వారావుపేట మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛా యుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో కృషి చేస్తోందని తెలిపారు.ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
నామినేషన్ సమయంలో అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని, గుంపులుగా చేరి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించ రాదని హెచ్చరించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, నినాదాలు, శబ్ద కాలుష్యం సృష్టించే చర్యలను సహించబోమని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టంగా తెలిపారు.
ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పోలీస్ శాఖకు సహకరించి ఎన్నికల నిర్వహణను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక సీఐ నాగరాజు రెడ్డి, ఎస్సైలు యాయాతి రాజు, అఖిల, ఇతర పోలీస్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



