Saturday, April 4, 2026
E-PAPER
Homeకరీంనగర్దొంగతనాలపై కట్టు దిట్టమైన నిఘా: ఎస్ఐ

దొంగతనాలపై కట్టు దిట్టమైన నిఘా: ఎస్ఐ

- Advertisement -

నవతెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ
నవతెలంగాణ – రాయికల్

మండలంలో ఇటీవల చోటుచేసుకున్న దొంగతనాల నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. గత నెల క్రితం రాజనగర్ గ్రామంలో దొంగతనం కోసం ఓ దుండగుడు ఇంటిలో చొరబడే ప్రయత్నం చేసిన ఘటన చోటుచేసుకోగా.. స్థానిక యువకులు వెంబడించినప్పటికీ నిందితుడు తప్పించుకున్నాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఇక శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అలీయానాయక్ తాండా శివారులోని ఓ కిరాణా దుకాణంలో దొంగతనానికి యత్నించిన ఇద్దరు బాలురలో ఓ బాలుడు షటర్ కింద ఇరుక్కుపోవడంతో, ఆ మార్గంలో వెళ్తున్న దావన్‌పల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు గమనించి దుకాణ యజమానికి సమాచారం ఇచ్చాడు.

అనంతరం శనివారం ఉదయం గ్రామ పెద్దల సమక్షంలో బాలురను పిలిపించి విచారణ జరిపినట్లు సమాచారం. ఈ వరుస ఘటనలు స్థానికుల్లో ఆందోళనకు దారితీస్తుండగా.. పోలీసుల గస్తీ, నిఘాపై కొన్ని వర్గాల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో పర్యవేక్షణ తగిన స్థాయిలో లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. అలాగే కొన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల లేమి, పహారా వ్యవస్థలో లోపాలు ఉన్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా స్పష్టమైన నిర్ధారణ లేకపోయినప్పటికీ, ప్రజల్లో భద్రతపై చర్చ మొదలైంది. మరోవైపు, ఈ ఘటనల నేపథ్యంలో మండలంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు రాయికల్ ఎస్ఐ సిహెచ్ సుధీర్ రావు తెలిపారు. పట్టణంతో పాటు 32 గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దొంగతనాల నివారణ, కేసుల పురోగతి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన ‘నవతెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

నవతెలంగాణ: గత ఏడాది కాలంలో మండలంలో మొత్తం ఎన్ని దొంగతనాల కేసులు నమోదు అయ్యాయి?
ఎస్ఐ: మొత్తం 20 కేసులు నమోదు అయ్యాయి.

నవతెలంగాణ: నమోదైన కేసుల్లో ఎన్ని ఛేదించారు? ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి?
ఎస్ఐ: 16 కేసులను ఛేదించాము. 2 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

నవతెలంగాణ: ఈ దొంగతనాల వెనుక ఒకే ముఠా ఉందా?
ఎస్ఐ: 5 కేసులు ఒకే ముఠా చేయగా వారిని పట్టుకొని రిమాండ్‌కు పంపించాము. మిగతా కేసులు వేర్వేరు వ్యక్తులు చేసినవి.

నవతెలంగాణ: దొంగతనాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించారా?
ఎస్ఐ: గుర్తించి ఆ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను పెంచాము.

నవతెలంగాణ: రాత్రి గస్తీ ఎలా నిర్వహిస్తున్నారు?
ఎస్ఐ: బ్లూ కోల్ట్,పెట్రోలింగ్ అధికారులను నియమించి పగలు, రాత్రి గస్తీ నిర్వహిస్తున్నాము.

నవతెలంగాణ: సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో దర్యాప్తు ఎలా చేస్తున్నారు?
ఎస్ఐ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దర్యాప్తు కొనసాగిస్తున్నాము.

నవతెలంగాణ: దొంగిలించిన సొత్తులో ఎంత మేరకు రికవరీ చేశారు?
ఎస్ఐ: సుమారు 33.56 శాతం సొత్తు స్వాధీనం చేసుకున్నాము.

నవతెలంగాణ: నిందితులను అరెస్ట్ చేసిన కేసులు ఎన్ని?
ఎస్ఐ: 16 కేసుల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశాము.

నవతెలంగాణ: గ్రామాల్లో భద్రత కోసం ఏ చర్యలు తీసుకుంటున్నారు?
ఎస్ఐ: ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.

నవతెలంగాణ: ప్రజల ఆందోళనపై మీ స్పందన ఏమిటి?
ఎస్ఐ: ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బంగారం, నగదు బ్యాంకుల్లో భద్రపరచుకోవాలి. అనుమానాస్పద పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలి.

నవతెలంగాణ: భవిష్యత్తులో నివారణకు తీసుకుంటున్న చర్యలు?
ఎస్ఐ: సీసీ కెమెరాల ఏర్పాటు, పగలు-రాత్రి గస్తీ,పాత నేరస్థులపై నిఘా,మొబైల్ ఫింగర్‌ప్రింట్ పరికరాలతో తనిఖీలు చేస్తున్నాము.

నవతెలంగాణ: ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
ఎస్ఐ: ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వాలి. అత్యవసర సమయంలో 100కు కాల్ చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -