కివీస్‌తో తొలి 3 టీ20లకు దూరం
పొత్తికడుపు గాయానికి శస్త్రచికిత్స
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముంగిట స్వదేశంలో కివీస్‌తో భారత్ 5 టీ20లు ఆడనుంది. పొత్తికడుపు గాయానికి శస్త్రచికిత్స అనంతరం రిహాబిలిటేషన్‌లో ఉన్న తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో తొలి 3 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని, చివరి రెండు మ్యాచ్‌లపై తర్వాతి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. విజరు హజారే ట్రోఫీలో హైదరాబాద్‌కు సారథ్యం వహిస్తున్న తిలక్ వర్మ.. మ్యాచ్ అనంతరం పొత్తికడుపులో అసౌకర్యానికి గురయ్యాడు. వైద్యుల సూచన మేరకు తక్షణమే స్కానింగ్ చేసి, రాజ్‌కోట్‌లోని ఓ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స చేశారు. బుధవారం శస్త్రచికిత్స చేయగా.. గురువారం రాజ్‌కోట్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. తిలక్ వర్మ ఆరోగ్యంపై వైద్యుల సూచన మేరకు న్యూజిలాండ్‌తో చివరి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండేది లేనిది తేలనుంది.
రాజ్‌కోట్‌లో విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్, హైదరాబాద్ మ్యాచ్‌లో ఆడిన తిలక్ వర్మ మైదానంలో చురుగ్గా కనిపించాడు. మ్యాచ్ అనంతరం పొత్తి కడుపులో నొప్పితో బాధపడటంతో వైద్యులు స్కానింగ్‌కు తీసుకెళ్లారు. శస్త్రచికిత్స విజయవంతం కావటంతో హైదరాబాద్‌కు చేరుకున్న తిలక్ వర్మ.. వారం రోజుల్లోనే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చేరుకోనున్నాడు. అక్కడ బీసీసీఐ వైద్య బృందం, ఫిట్‌నెస్ ట్రైనర్లు రిహాబిలిటేషన్ ప్రణాళిక రూపొందిస్తారు. తిలక్ వర్మ సీవోఈలో సుమారు 3-4 వారాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో చివరి రెండు టీ20లకు దూరమైనా.. ఫిబ్రవరి 7న ముంబయిలో జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు ఫిట్‌నెస్ సాధించటంపై ఫోకస్ ఉండనుంది. ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్ ఫిబ్రవరి 7న యుఎస్‌ఏ, 12న నమీబియా, 15న పాకిస్తాన్, 18న నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు తిలక్ వర్మ దూరమైనట్టు ప్రకటించిన బీసీసీఐ.. ఆ సిరీస్‌కు తిలక్ వర్మ స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయలేదు.



