నుదిట సిందూరం, చెవిలో పువ్వు, మెడలో కాషాయ కండువా, చేతిలో రెండు ప్యాకెట్లతో ఇంట్లోకి అడుగుపెట్టాడు కమల్. ఇదంతా చూసి లక్ష్మికి ఆశ్చర్యమేసింది. అయినా ఎప్పుడూ ఉండే వ్యవహారమే కదా! తన పనిలో తాను పడిపోయింది. కానీ నానిగాడు ఊరుకోలేదు. తండ్రి చేతిలోని ప్యాకెట్లు గుంజుకున్నాడు. ఒక్క ప్యాకెట్లోనైనా తినే వస్తువు ఏదైనా ఉంటుందేమోనని వాడి ఆశ. కాని ప్యాకెట్లు విప్పి చూశాక వాడి ఆశ అప్పడంలా ముక్కలైపోయింది. ఒక ప్యాకెట్‌లో పూలదండ, మరో ప్యాకెట్‌లో ఒక కలర్ ఫొటో పెద్దాయనది. వాటిని చూసి కోపంతో పక్కకు విసిరేశాడు నానిగాడు.
కమల్‌కి పట్టరానికోపం వచ్చింది. నానిగాడిని పట్టుకొని కొట్ట బోయాడు. కాని వాడు దొరక్కుండా వెళ్లి తల్లి వెనుక దాక్కున్నాడు.
”వాడ్ని ఎందుకు కొడుతున్నారు? ఏం తప్పు చేశాడు?” అడిగింది లక్ష్మి.
”కొట్టడం కాదు, దొరికితే చీరేస్తాను వాడ్ని! దేవుడి గదిలో పెట్టా లని తెచ్చిన ఫొటోను, దానికి వేయడానికి తెచ్చిన దండను నేలపాలు చేశాడు! వాడ్నేం చేసినా పాపం లేదు!” అన్నాడు కమల్ కోపంగా.
కింద పడ్డ ఫొటోను, పూలదండను చూసింది లక్ష్మి.
”అదేమిటీ పెద్దాయన పోయాడా? ఎక్కడా వాట్సాప్‌లో రాలేదు?” అన్నది లక్ష్మి.
”వాడితో పాటు నిన్ను కూడా చీరేస్తాను! ఆ ఫొటోను పూజగదిలో పెట్టి, పూజించడానికి తీసుకుని వచ్చాను!” అన్నాడు కమల్.
”ఆయన మీద మీకు భక్తి మరి ఎక్కువైతే జేబులో పెట్టుకుని తిరగండి. అంతేగాని పూజగదిలో పెట్టేయడం నేనొప్పుకోను!” తెగేసి చెప్పింది లక్ష్మి.
”నీలాంటి వాళ్లుఒప్పుకుంటే ఎంత? ఒప్పుకోకుంటే ఎంత? ఆయన కాలం సృష్టించుకున్న యోధుడు!” అన్నాడు కమల్. అట్లా అంటుంటే కమల్ ఛాతి 53 ఇంచుల దాకా పెరిగి ఆగిపోయింది.
”కాలం సృష్టించి 75 ఏళ్లు కావస్తుంది కదా మరి ఇప్పుడు గుర్తించారా?” అడిగింది లక్ష్మి.
”పిచ్చిదానా, సకల చరాచర ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. ఒక చిన్న ఆటంకం వస్తుందేమోనని మేము ఆందోళన పడ్డాం! ఇప్పుడు ఆ ఆటంకం దూదిపింజలా తేలిపోయింది!” అన్నాడు కమల్ ఉత్సాహంగా.
”ఏమిటి డాడీ ఆ ఆటంకం!” అడిగాడు నానిగాడు.
”సూటి ప్రశ్న! మొన్న 75 ఏండ్లు నిండితే రిటైర్ కావాలని మోహన్ భగవత్ అన్నాడు. ఇప్పటికే 75 ఏండ్ల్లు నిండిన వారిని బీజేపీ పార్టీలో అన్ని బాధ్యతల నుంచి తొలగించుతూ వచ్చారు! పెద్దాయనకు కూడా 75 ఏండ్ల్లు నిండుతున్నందున ఆయన్ను కూడా తొలగిస్తారేమోనని భయపడ్డాం! కాని కాలం సృష్టించుకున్న యోధుడికి రిటైర్మెంట్ ఉండదని స్వయంగా మోహన్ భగవత్ అన్నారు! ఇంక పెద్దాయన రిటైర్ కారు!” అన్నాడు కోపంగా కమల్.
”కాలం సృష్టించుకున్న యోధుడంటే ఏమిటి డాడీ!” అడిగాడు నానిగాడు.
‘శెభాష్! నీకే కాదు, మీ అమ్మకి కూడా అర్థం అయ్యేటట్టు చెబుతాను విను! ఒక కాలంలో ప్రజలకు ఏం కావాలో అది చేసిపెట్టే నాయకుడు పుడితే, ఇంకా ఎన్నో గొప్ప లక్షణాలు ఉంటే, అప్పుడు అతడిని కాలం సృష్టించుకున్న యోధుడు అంటారు! ‘అర్థమైందా?” అడిగాడు కమల్.
”అంటే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, సినిమాల్లో చిరంజీవి లాగా?” అన్నాడు నానిగాడు తండ్రి మొఖంలోకి గర్వంగా చూస్తూ.
ౖ”వాళ్లలా కాదు!” అన్నాడు కమల్ పళ్లు కొరుకుతూ.
”ఎందుకు కాదు? క్రికెట్‌లో సచిన్, సినిమాల్లో చిరంజీవి, వాళ్ల కాలంలో ప్రజలకు ఏం కావాలో అన్ని చేశారు కదా! సచినేమో సెంచరీలు, చిరంజీవి ఫైట్లు, డాన్సులు బ్రహ్మాండంగా చేశారు కదా! ఇంకేం గావాలి?” అన్నాడు నాని గాడు చిరు సినిమాలోని వీణ స్టెప్పు వేయబోతూ.
”ఒరేరు! పెద్దాయనకు, వారికి ఏం పోలిక నక్కకీ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది! వాళ్లిద్దర్ని మించినోడు పెద్దాయన!” అన్నాడు కమల్ పిడికిళ్లు కూడా బిగించి.
”ఓహో! సచిన్ కన్నా ఎక్కువ సెంచరీలు కొట్టాడా? చిరంజీవి కన్నా బాగా స్టెప్పులు వేశా డా? నాకు తెలియదేమిటి?” అన్నాడు నానిగాడు.
కమల్, నానిగాడ్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. కాని వాడు దొరకలేదు. కోపంగా భార్య వరక చూశాడు.
”నామీదెందుకు కోపం? కాలం సృష్టించు కున్న యోధుడికి క్రికెట్‌లో సెంచరీలు కొట్టడం, సినిమాల్లో స్టెప్పులు వేయటం ఒక లెక్కా? ఈ మెయిల్‌ను, డిజిటల్ కెమెరాను శాస్త్రవేత్తలు కనిపెట్టకముందే వాటిని వాడిన యోధుడు కదా! సెంచరీలు, స్టెప్పులు కూడా వేసేసి ఉంటాడులెండి. వాట్సాప్‌లో వెతకండి. దొరకవచ్చు!” అన్నది లక్ష్మి నవ్వుతూ.
కమల్ కోపం కట్టలు తెంచుకున్నది! కాని లక్ష్మిని మాటల్లో ఓడించటం అంత సులభం కాదు! అందుకే తమాయించుకున్నాడు.
”నీవు బాగా చదువుకున్నదానివి, లోకజ్ఞానం ఉన్నదానవి, పెద్దాయన గురించి, అంత తేలికగా మాట్లాడవచ్చా? పెద్దాయనకు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నా యో, నీకు తెలియదా? 75 ఏండ్ల వయస్సులో 18 గంటలు పని చేస్తున్నాడు. ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకుండా, తాత, ముత్తాతల పేరు చెప్పుకోకుండా, దేశంలో అగ్రస్థానానికి వచ్చాడు!” అన్నాడు కమల్.
”చిరంజీవి కూడా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, మెగా స్టార్ అయ్యాడు!” దూరం నుండే అరిచాడు నానిగాడు.
”ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసే సేవకుడు, తన పేరు మీద ఎలాంటి ఆస్తిపాస్తులు లేని నిస్వార్థ పరుడు!” అన్నాడు తన్మయత్వంతో కమల్.
”ఈ దేశంలో కోట్లాది మంది కార్మికులు సెలవు తీసు కోకుండా పనిచేస్తున్నారు. అంతేకాదు ఆర్టీసీలో అయితే తల్లిదండ్రులు చనిపోతే సెలవులు ఇవ్వకపోతే, డ్యూటీ పూర్తిచేసుకుని, అంతిమ యాత్ర చేస్తున్నారు. దేశంలో అగ్రస్థానంలో ఉంటే, ఆస్తిపాస్తులు లేవని చెప్పుకోవటం గొప్పేంకాదు!” అన్నది లక్ష్మి తేలిగ్గా.
”ఆయన పేరు చెబితే శత్రువులకు సింహస్వప్నం!” అన్నాడు కమల్ గొప్పగా.
”సింహస్వప్నం అంటే ఏమిటి డాడీ!” అడిగాడు నాని గాడు తండ్రికి దగ్గరగా వచ్చి.
”మంచి ప్రశ్న! ఏనుగులాంటి పెద్ద జంతువైనా సరే, నిద్రపోయినపుడు, సింహం కల్లోకి వస్తే భయంతో గుండెపగిలి చస్తాయి! అదే సింహస్వప్నం అంటే!” అన్నాడు కమల్ ఉత్సాహంగా.
”అబ్బా! పాకిస్తాన్ ప్రెసిడెంటుకి, చైనా ప్రెసిడెంటుకి నిద్రరాక ఎనెనళ్ళయ్యిందో! ఇంకా బతికే ఉన్నారు!” అన్నాడు నానిగాడు తండ్రికి దూరంగా జరుగుతూనే.
”బాలాకోట్‌లో, పహల్గాం తర్వాత పాకిస్తాన్ మీద, గల్వాన్‌లో చైనా మీద మనం గెలిచినట్లు చెప్పలేదా నీ కొడుక్కి” కమల్ కోపంగా అన్నాడు.
”మీరు సింహస్వప్నం గురించి చెప్పి, యుద్ధంలో గెలిచి నట్లు చెప్పలేదా అని నన్నంటారేం?” మీరన్నట్లు, మనమంటే నిజంగా భయముంటే మనజోలికి రానే రాకూడదు. కాని పుల్వామా, బాలాకోట్, గల్వాన్‌లోయ, పహల్గాం వీటన్నింటిలో శత్రువులే మన మీద ముందు దాడి చేశారు. మనపైన తేలిక భావం ఉండాలి! లేదంటే యుద్ధంలో గెలిచామని చెప్పుకోవటం కోసమైనా చేసుండాలి! పెద్దాయన లేని కాలంలో, మన చుట్టుపక్కల ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వలేదు తెలుసా?” నిష్కర్షగా అన్నది లక్ష్మి.
”ప్రజలకు మంచి చేయటంలో రేసు గుర్రం!” అన్నాడు కమల్.
”రేసు గుర్రం అంటే అల్లు అర్జున్ కదా డాడి!” అన్నాడు నానిగాడు. దాదాపు గేట్లోకి వెళ్లి నిలబడి.
”గత పదేండ్లలో ప్రజలకు ఏం మేలు జరిగిందో చెప్పండి! ఎన్నికోట్ల మందికి ఉద్యోగాలిచ్చారు? నల్లధనాన్ని తెచ్చి ప్రజలకు పంచి పెట్టారా? ఇదిమీ పెద్దాయన చెప్పినవే కదా! ఒక్కటీ చేయలేదు. ఒక్క పరిశ్రమనైనా పెట్టారా? కోహినూర్ పత్రాన్ని తెచ్చారా? లేక పాకిస్తాన్ కంట్రోల్‌లో ఉన్న కాశ్మీర్‌ను భారత్‌లో కలిపారా? ప్రజల ఆదాయాలు పెంచారా? భూములు పేదలకు పంచారా? ప్రాజెక్టు కట్టారా?
మీరన్నట్టు రేసుగుర్రమే! కాని ఎందులో తెలుసా? ప్రజల వనరులు అని రాజ్యాంగంలో చెప్పిన, బొగ్గు, స్పెక్ట్రమ్, సహజ వాయువు, చమురు, ఎన్నో విలువైన ఖనిజాలు. ఆఖరికి యుద్ధంలో వాడే పరికరాలను కూడా అంబానీలకు, అదానీలకు అప్పగించటంలో మాత్రమే రేసుగుర్రం” అన్నది లక్ష్మి.
”రాజీలేని దేశభక్తుడు, విశ్వగురు..” అంటూ ఏదో చెప్పబోయాడు.
”విశ్వగురు అనేది చాలా పెద్దమాట. ఇరుగు పొరుగు దేశాలతో కలిసి ఉండాలన్న కనీస రాజనీతి తెలియనివాడు విశ్వగురు అంటే ఎంత అవమానం! పహల్గాంలో 24 మందిని పొట్టన పెట్టు కుంటే ఒక్క దేశమైనా మద్దతునిచ్చిందా! మరి ఏమైంది మీ విశ్వ గురుత్వం?” ప్రశ్నించింది లక్ష్మి.
”వాట్సాప్‌లో ఇంకేం ఉన్నాయో వెతికాడు కమల్.
”మీరేమి వెతకనవసరంలేదు! దేశభక్తి గురించీ చెబు తాను! దేశమంటే మట్టికాదోరు! దేశమంటే మనుషులోరు!” అన్నాడు గురజాడ. ఈ దేశాన్ని 140 కోట్ల మనుషుల సమాహారంగా చూశారా ఎప్పుడైనా! మీకు దేశమంటే, ఆవులు, మట్టి అంతే. కనీసం హిందు వులను, హిందూ స్త్రీలను కూడా మనుషులుగా పట్టించుకోని దేశ భక్తులు మీరు! మొన్న మణిపూర్‌లో నగంగా ఊరేగించిన మహిళలు ముందు మనుషులు ఆ తర్వాత హిందూ స్త్రీలు. నిన్న ధర్మస్థలలో చనిపోయిన ఆడవారంతా దేవుడి దయకోసం వచ్చిన హిందూ మహిళలు, ఆ తర్వాత మనుషులు. ఈ దేశంలో బలహీనులపై అణిచివేత లేని రోజులేదు! లైంగికదాడి జరగని ఘడియలేదు! అన్నమో రామచంద్రా అంటూ ఇరవై కోట్ల మంది అన్నార్థులు రోజూ వేస్తున్న కేకలు మీకు వినపడవు! ఇదేం దేశభక్తి? ఎక్కడ మనిషి సగర్వంగా తలెత్తుకోగలడో, ఎక్కడ మనిషిని, మరొక మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి, నా దేశాన్ని తీసుకొని వెళ్లు అన్నాడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. అటు వెళ్దామని కలలుగంటున్న భారతమాత జుట్టుపట్టుకుని నరకంలోకి ఈడ్చుకెళ్తు న్నారు! అందుకే ఒక పదం పలికేటపుడు దానికున్న అర్థం పరమార్థం తెలుసు కోవాలి. అది తగినదా కాదా అని తెలుసుకొని పలకాలి!” అన్నది ఆవేశంగా లక్ష్మి..
నానిగాడు తల్లి పక్కకి వచ్చి చప్పట్లు కొట్టాడు.
– ఉషాకిరణ్