- – పంపిణీకి భారతదేశంలోనే తొలి వినూత్న నమూనా
– తెలంగాణ మొబైల్ ఎరువుల బుకింగ్ యాప్ - – ఏడీఏ పెంటేల రవి కుమార్
- నవతెలంగాణ – అశ్వారావుపేట
- వ్యవసాయంలో ఎరువులు సమయానికి అందుబాటులో ఉండటం అత్యంత కీలకం.పంట ముఖ్య దశల్లో కొన్ని రోజులు ఆలస్యం జరిగినా దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. అవసరమైన మేర,సమయానికి ఎరువులు అందించాలనే ఉద్దేశంతో,బ్లాక్ మార్కెటింగ్,ఆందోళనతో ఎక్కువగా కొనుగోలు చేయడం వంటి సమస్యలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ప్రత్యేకమైన మొబైల్ ఎరువుల బుకింగ్ యాప్ ను ప్రారంభించింది అని వ్యవసాయ అదనపు సంచాలకులు పెట్టేలా రవి కుమార్ అన్నారు. ఆయన బుధవారం నవతెలంగాణ తో మాట్లాడారు.
సంస్కరణ పరిమితులు విధించడానికే కాదు; రైతులకు సౌలభ్యం, పారదర్శకత మరియు శాస్త్రీయంగా ఎరువుల కేటాయింపును అందించడమే లక్ష్యం అంటున్నారాయన. క్యూ ల నుండి ప్రణాళికాబద్ధమైన బుకింగ్ వైపు గతంలో ఎరువుల బస్తాలు డీలర్ కేంద్రాలలో ఆధార్ ధృవీకరణ ఆధారంగా పంపిణీ చేయబడేవి. కానీ ఆ వ్యక్తికి భూమి ఉందా, ఏ పంట సాగు చేస్తున్నాడు, ఆ దశలో ఎరువు అవసరమా అనే అంశాలు పంపిణీ తో శాస్త్రీయంగా అనుసంధానం కాలేదు.
గత పంట కాలాలలో కారణంగా తరుచుగా కనిపించిన పరిస్థితులు:
• డీలర్ దుకాణాల వద్ద భారీ క్యూలు
• నిల్వలపై అనిశ్చితి
• భయంతో అధిక కొనుగోలు
• నిల్వలు దాచిపెట్టడం
• ఎరువుల మళ్లింపు (డైవర్షన్)
రైతులు స్టాక్ ఉందో లేదో తెలియక రైతులు పలు మార్లు దుకాణాలను సందర్శించాల్సి వచ్చేది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ వ్యవసాయ శాఖ రైతులకు సులభంగా ఉపయోగపడే డిజిటల్ పరిష్కారాన్ని తీసుకువచ్చింది.
సినిమా టికెట్ బుకింగ్ లా యూరియా బుకింగ్
ఈ యాప్ సులభంగా అర్థమయ్యే విధంగా రూపొందించబడింది.
సినిమా టికెట్లను ఆన్‌లైన్‌బలో బుక్ చేసుకున్నట్లే, ఇప్పుడు తెలంగాణ రైతులు:
• తమ ప్రాంతంలో యూరియా స్టాక్ ఎంతో ఉందో రియల్ టైమ్ లో తెలుసుకోవచ్చు
• అవసరమైన పరిమాణాన్ని మొబైల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు
• నిర్ధారణ వచ్చిన తర్వాత మాత్రమే డీలర్ వద్దకు వెళ్లవచ్చు
• క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు.
దీంతో ఎరువుల కొనుగోలు ప్రక్రియ సులభంగా, క్రమబద్ధంగా మారింది.
పంటల ఆధారంగా శాస్త్రీయ కేటాయింపు
పాత విధానంలో ఉన్నట్లుగా ఎవరైనా స్వేచ్ఛగా కొనుగోలు చేసే విధానం కాకుండా, ఈ యాప్ ద్వారా నిజమైన సాగుదారులకు మాత్రమే ఎరువులు చేరేలా ఏర్పాటు చేశారు.
అర్హతను క్రింది అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు:
• పట్టాదారు పాస్‌బుక్ సమాచారం
• సాగులో ఉన్న భూమీ విస్తీర్ణం (కౌలు లేదా స్వంత భూమి)
• వేసిన పంట
• వ్యవసాయ విశ్వవిద్యాలయ సూచనలు
పంట మరియు భూమి విస్తీర్ణాన్ని బట్టి ఎరువు పరిమాణాన్ని శాస్త్రీయంగా నిర్ణయించి విడతలవారీగా విడుదల చేస్తున్నారు.
దీంతో:
• సమర్థవంతమైన ఎరువుల వినియోగం
• పోషక పదార్థాల సమతుల్య వినియోగం
• పంట ఆరోగ్యం మెరుగుదల
మొట్టమొదటిసారిగా ఒక రైతు ఎంత ఎరువు కొనుగోలు చేస్తున్నాడో, అది సిఫారసులకు అనుగుణంగా ఉందో లేదో ఈ యాప్ ద్వారా అధికారులకు పర్యవేక్షణ సాధ్యమైంది.
యూరియా వినియోగం పెరుగుదల – నేపథ్యం
భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద యూరియా వినియోగదారు. సంవత్సరానికి సుమారు 35–36 మిలియన్ టన్నులు పై,
తెలంగాణలో యూరియా వినియోగం:
• 2020–21 లో 16.42 లక్ష మెట్రిక్ టన్నులు
• 2024–25 లో 20.07 లక్ష మెట్రిక్ టన్నులు
ఈ పెరుగుదలకు కారణాలు:
• వరి సాగు విస్తీర్ణం 42.2 లక్ష హెక్టార్ల నుండి 52.6 లక్ష హెక్టార్ల కు పెరగడం
• వరి పంటకు పలుమార్లు నత్రజని అవసరం ఉండటం
• మొక్కజొన్న సాగు విస్తరణ (హెక్టారుకు 70–90 కిలోల నత్రజని అవసరం)
• పత్తి సాగు స్థిరంగా కొనసాగడం
ఈ పెరుగుతున్న డిమాండ్ ను యాప్ ద్వారా క్రమబద్దీకరించడానికి ఇప్పుడు వీలు కలుగుతున్నది.
అమలులో స్థానిక అవసరాలకు అనుగుణంగా యాప్ లో మార్పులు-చేర్పులు ఎరువుల డీలర్ కేంద్రాల పరిధిని నిర్ణయించడం ఒక ముఖ్య సవాల్. అందుకే జిల్లాల అవసరాలకు అనుగుణంగా విభిన్న విధానాలు అమలు చేస్తున్నారు:
• కొన్నిచోట్ల జిల్లా స్థాయిలో
• మరికొన్నిచోట్ల డివిజన్ స్థాయిలో
• కొన్ని ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు మండలాలను యూనిట్ గా
ఈ నిర్ణయాన్ని స్థానిక అధికారులే తీసుకుంటున్నారు. పంటల విస్తీర్ణం, డీలర్ నెట్‌వర్క్, రవాణా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని అమలు చేస్తున్నారు.
స్పష్టమైన ఫలితాలు
2026 ఫిబ్రవరి 15 నాటికి:
• 12.73 లక్షల మంది రైతులు యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్నారు
• 50.48 లక్షల సంచులు బుక్ అయ్యాయి
• 46.13 లక్షల సంచులు కొనుగోలు పూర్తయ్యాయి
ఈ లెక్కలు యాప్ వినియోగం పట్ల రైతుల విశ్వాసాన్ని చూపుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో మొదట ఐదు జిల్లాల్లో పైలట్ గా ప్రారంభమైన ఈ యాప్, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ఫీల్డ్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేస్తున్నారు.
జాతీయ స్థాయిలో గుర్తింపు
సమయానికి, అవరసమైన మేర ఎరువుల పంపిణీ జరగడం, బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తున్నందుకు కేంద్ర ఎరువుల శాఖ ప్రశంసించింది. ఫలితాలు సానుకూలంగా ఉండటంతో, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలపై కూడా పరిశీలిస్తోంది.
రైతు సంక్షేమానికి దోహదం చేసే నమూనా
తెలంగాణ మొబైల్ ఎరువుల బుకింగ్ యాప్ ముఖ్య లక్షణాలు:
• అవసరం మేరకు ఎరువులను అందించడం
• సమయానికి సరఫరా
• బ్లాక్ మార్కెట్ నియంత్రణ
• శాస్త్రీయ పోషక నిర్వహణ
• రైతు సౌలభ్యం
పెరుగుతున్న సాగు విస్తీర్ణం, ఎరువుల డిమాండ్ మధ్య తెలంగాణ ప్రభుత్వం సాంకేతికతను వినియోగించి పారదర్శకమైన, క్రమబద్ధమైన పంపిణీ వ్యవస్థను ఈ యాప్ ద్వారా పరీక్షించి సఫలీకృతమైంది.
క్యూ ల సమస్యకు పరిష్కారంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం, ఇప్పుడు జాతీయ స్థాయిలో అనుసరించదగిన పాలనా నమూనాగా మారింది.



