Sunday, October 26, 2025
E-PAPER
Homeసమీక్షబాలలను ఆహ్లాదపరిచే'టింకూ.. ద చిట్టెలుక'

బాలలను ఆహ్లాదపరిచే’టింకూ.. ద చిట్టెలుక’

- Advertisement -

ఆకు కదిలినా ఆందోళన పడే టింకూ అనే చిట్టెలుక ఉన్న అడవిలోకి పట్నం ఎలుక వచ్చి తన వెంట తీసుకువెళుతుంది. అక్కడ ఆహారం సంపాదించడం దినదిన గండంగా ఉండడం నచ్చదు. అస్వస్థతగా ఉన్న మిత్రునికి ఆహారం తెద్దామని వెళ్ళి వేరుశనగ పప్పు తెచ్చి ఇస్తుంది. తిన్న మిత్రుడు చనిపోతూ, విషం కలిపారు తినకు అని చెబుతుంది. భయంతో అడవిలోకి పరుగు తీసిన ఎలుకకు మర్రి చెట్టు కింద ఉన్న సాధువు కనిపిస్తాడు. ఎలుక జన్మ వద్దు, పిల్లిగా మార్చమని వేడుకుంటుంది. పిల్లిగా మారిన పిదప నీటికోసం చెరువు వద్దకు వెళ్ళగా వేటకుక్కల గుంపు వెంటపడుతుంది.

పరుగుతో ఒక గుడిసెలో చొరబడి, ఇంట్లో ఉన్న అన్నం, పాలు దొంగతనంగా స్వాహా చేస్తుంటుంది. చూసిన ఇల్లాలు బిందెతో నెత్తిమీద ఒక్కటి వేస్తుంది. మళ్ళీ సాధువు వద్దకు వెళ్ళి తనకీ జన్మ వద్దు కుక్కలా మార్చమంటుంది. కుక్కగా మారి పట్నంలోని ధనవంతుల ఇంటిలోకి చేరి రాజభోగం అనుభవిస్తుంది. కానీ స్వేచ్చ లేకుండా బంధీగా ఉండటం నచ్చని కుక్క అక్కడనుండి తప్పించుకుంటుంది. ఆకలి బాధతో తన జాతి కుక్కలతోనే ఆహారం కోసం పోట్లాడుతుంది. ఇంతలో మునిసిపాలిటీ వారు వచ్చి కుక్కలను వల వేసి వ్యాన్‌లో పట్టుక పోతారు. తోటి కుక్కలకు ఉపాయం చెప్పి తలుపు తీయగానే అన్ని కుక్కలతో పాటు తప్పించుకుంటుంది.

అడవిలో ఎలుగుబంటి, నక్క, జింక జీవితాలు కూడా ఆనందంగా లేవని, సింహాన్ని చూసి అన్ని జంతువులు భయ పడుతున్నాయని గ్రహించి, ఏకంగా సింహంలా మార్చమంటుంది సాధువును కలిసి. సింహంగా మారగా దానికి మిత్రులు ఉండరు. ఓ కుందేలు పిల్లతో స్నేహం కుదిరి, స్నేహంలోని మాధుర్యాన్ని చవి చూస్తుంది. వేటాడే క్రమంలో సర్కస్‌ వాళ్ళ బోనులో చిక్కుతుంది. సర్కస్‌ ప్రాంగణంలోకి చేరిన సింహం అక్కడినుండి ఎలా తప్పించుకుంది? చివరకు టింకూ తన పూర్వ రూపానికి మారిందా లేదా..? పుస్తకం చదివి తెలుసుకోవలసిందే. ”ఈ సష్టిలో ప్రతి ప్రాణికి దేని స్థాయిలో దానికి ఆహార సంపాదనలో అడ్డంకులు ఎదురౌతూనే ఉంటాయి. బ్రతకడానికి పోరాటం చేయాలనేది ఈ సృష్టి నియమం. నీకున్న లోపమల్లా నీలోని భయం. ఇలా భయపడే ప్రతి జీవి చెప్పే మాటే తలరాత.

ఆ భయాన్ని వదిలి పెట్టి చూడు జీవితం నీకెంత తప్తిని ఇస్తుందో కష్టపడటంలోని ఆనందం ఏంటో నీకే తెలుస్తుంది” అని సాధువు చెప్పిన మాటలు మనకందరికీ వర్తిస్తాయి. ”జీవన పోరాటంలో బలవంతులకీ, బలహీనులకి ఎప్పుడూ పోరాటము జరుగుతూనే ఉంటుంది. ఈ పోరాటంలో బలవంతులనే కాదు, బలహీనులను కూడా విజయం వరిస్తుంది. దైర్యం ఉంటేనే మనుగడ” అనే మార్క్సిస్ట్‌ ఫిలాసఫీని అంతర్లీనంగా ఇమిడ్చి, జానపద కథను నవలగా విస్తరించి సత్య సుందరంగా తీర్చి దిద్దిన నాగ శిరీషను అభినందించకుండా ఉండలేం. నవలను చేతిలోకి తీసుకుంటే, ఆపకుండా చదివేస్తాం అర్థ గంటలో. సరళమైన వాక్యాలు, బిగువు సడలని కథనంతో మనల్ని టింకూ వెంట పరుగు పెట్టిస్తుంది రచయిత్రి. సందర్భానికి తగినట్లుగా ప్రతి పేజీలో బాలలను ఆకర్షించేలా అద్భుతమైన బొమ్మలు వేసిన వారి అమ్మాయి ఆయుషీని హృదయానికి హత్తుకోవాలనిపిస్తుంది. బాలలూ, బాల సాహిత్యాన్ని ప్రేమించే పెద్దలూ తప్పకుండా చదవాల్సిన నవల.

  • పుప్పాల కృష్ణమూర్తి, 99123 59345
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -