‘తరచూ నీరసంగా ఉంటుంది.. కొద్ది పాటి పనికే అలసిపోతున్నాను’ ఇలా మహిళలు చాలామంది వైద్యులని సంప్రదిస్తుంటారు. ‘ఆడవారు తొందరగా అలసిపోతారు, కష్టమైన పని చేయలేరు’ అనే ఒక ప్రగాఢ నమ్మకం సమాజంలో ఉండనే ఉంది. ప్రకృతి సహజంగా స్త్రీలు శక్తిసామర్థ్యాలు లేని వారో, అబలలో ఎంతమాత్రమూ కారు. అందరికీ అన్ని సమకూరుస్తూ, కుటుంబాన్ని, ప్రతి రోజూ, క్రమం తప్పకుండా పట్టాలపై పరిగెత్తించే సామర్థ్యత ఆడవారిదే. ఇంటిలోనే కాక బయట ప్రపంచంలో ఎక్కడ పని చేస్తున్నా.. ‘నేను లేకపోతే పని కుంటుపడుతుంది’ అనే భావంతో పనిచేసే ఘనత ఆడవారిదే. అన్ని పనులూ బాధ్యతగా తమపై వేసుకొని, పనులు చక్కగా చేసుకొనే మహిళలు, కొన్ని కారణాల వల్ల అలసటకు, నీరసానికి ఎక్కువగా గురయ్యే అవకాశముంది.
అలసట అంటే ఏమిటి? నీరసం అంటే ఏమిటి? రెండూ వేరా? అని ఎవరైనా అడగవచ్చు. రెంటిలో తేడాలున్నాయి. నీరసం అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. శరీరంలో జీవ శక్తి/చురుకుదనం లేనట్లు, శారీరకంగా, మానసికంగా బలహీనంగా అనిపించడం దీని పరిభాషైతే, శారీరక లేదా మానసిక శ్రమ తర్వాత శక్తి లేనట్లనిపించడం అలసట. ఇది తాత్కాలికమైనది.
అలసట ఎందుకు కలుగుతుంది?
అలసట మెదడు చేపట్టే ఒక క్లిష్టమైన రక్షణ చర్య. శక్తికి మించిన పనులు/వ్యాయామము చేసినప్పుడు (చేయవల్సిన పనులకు శరీరంలో తగినంత కెలోరీలు తయారుకాకపోవడం లేదా నిల్వలు లేకపోవడము) కండరాలు అతిగా వ్యాకోచించడం జరిగితే, రక్త సరఫరా తగ్గి, వాటిలో ఆక్సిజన్ పరిమాణం పడిపోతుంది. ఫలితంగా నొప్పి, వాపు వంటివి మొదలయ్యి కండరాలు దెబ్బతినే అవకాశముంటుంది. అటువంటప్పుడు మెదడు ఆ కండరాలకు సంకోచించే సంకేతాలు తగ్గిస్తుంది/ఆపివేస్తుంది. తద్వారా వాటికి విశ్రాంతి దొరికి, తిరిగి శక్తిని పుంజుకొంటాయి. ఈ స్థితి తరచుగా స్త్రీలలో ఉత్పన్నమౌతుంది.
శ్రద్ధ వహించరు
స్త్రీలు ఎదుర్కునే కొన్ని పరిస్థితులు అలసటను కలుగచేసేవిగా ఉంటాయి. ముఖ్యంగా ఋతుస్రావం. కొందరిలో రక్తస్రావం తీవ్రంగా ఉండి, ఎక్కువ రోజులు అయ్యి రక్తహీనతకు దారితీస్తుంది. దానితో పాటు ఆహారలోపం కూడా ఉండవచ్చు. సాధారణంగా స్త్రీలు రోజువారీ పనుల్లో పడి తాము తీసుకొనే ఆహారంపైన శ్రద్ధ వహించరు. తగినంత పౌష్టికాహారం (ముఖ్యంగా ఐరన్, బి12 భరిత ఆహారం) తీసుకోకపోవడం, వృత్తి-ఇల్లు- సాంఘిక ఒత్తుడులు వీటన్నిటినీ సమన్వయించడంలో కలిగే మానసిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం, నీరసం, వాటిని సరిచేసుకోవడానికి వాడే కొన్ని మందులు, ఈ రోజుల్లో కొందరిలో చూస్తున్నాము.
ఆహార లోపాలు
పొగ తాగడం, మద్యం-మాదకద్రవ్యాలు సేవించడం వంటివి కొన్ని సాధారణ కారణాలైతే, కొన్ని వ్యాధులు, తదనుగుణంగా జరిగే చికిత్సలు, కొన్ని అంటు వ్యాధులు, రక్తహీనత-ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడంతో కణాలకు ఆక్సిజన్‌ను అందజేసే హీమోగ్లోబిన్ కొరత ఏర్పడి అలసటకు దారి తీస్తుంది. అదే విధంగా అధిక రక్త పోటు, మధుమేహం, మూత్రపిండ, జీర్ణకోశ, థైరాయిడ్‌కి సంబంధించిన కొన్ని దీర్ఘ కాలిక వ్యాధులు, గర్భిణీలలో హార్మోన్లు, శారీరక మార్పులు అలసటకు కారణాలౌతాయి. రుతు విరతి పొందిన స్త్రీలలో మానసిక ఒత్తిడి, పైన చెప్పబడిన దీర్ఘ కాల వ్యాధులు, ఆహార లోపాలు అలసటకు, నీరసానికి దారితీయొచ్చు.
అలసట లక్షణాలు
తగినంత విశ్రాంతి తర్వాత కూడా బలహీనంగా ఉన్నామనే భావన, పనులపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం, జ్ఞాపకశక్తి సమస్యలు, పనితీరులో మార్పు, రోజువారీ పనుల్లో పాల్గొనడానికి ఉత్సాహం లేకపోవడం, పనులలో సామర్థ్యం తగ్గుట, అతిగా నిద్రకు లోనవడం, నిద్రలో ఆటంకాలు, శ్రమతో సంబంధం లేకుండా కీళ్ల, వెన్ను, కండరాల నొప్పి లేదా అసౌకర్యం, చిరాకు, భావోద్వేగ అస్థిరతకు లోనవడం వంటివి జరుగుతాయి.
మరి నీరసం..?
నిరంతరంగా అలసట కొంతకాలం కొనసాగితే, అంతర్లీనంగా రోజువారీ పనుల్లో పాల్గొనడానికి ఉత్సాహం లేకపోవడమనేది అందులో భాగమే కాబట్టి, దీర్ఘకాల అలసటను నీరసంగా భావించవచ్చు. దీని వల్ల దైనందిక పనుల్లో, తద్వారా జీవితంలో చురుకుదనం, ఉత్సాహమనేది లేకుండా పోతుంది. సాధారణంగా అలసటకు శారీరిక శ్రమ కారణమైతే, పలు సార్లు నీరసానికి మానసిక వత్తిడి కారణ మవుతుంది. ఇది మనలో చాలామందికి అనుభవం కూడా అయి ఉండవచ్చు. అప్పటివరకు బాగానే ఉన్నా కొందరు కొన్ని అనుకోని పరిస్థితు లెదురైనా, ఇష్టపడని వ్యక్తుల్ని కలవాల్సి వచ్చినా, అవగాహన లేని విషయాల గురించి మాట్లాడాల్సి వచ్చినా, క్లుప్తంగా చెప్పాలంటే వారు ఇష్టపడనిది ఏది చేయవలసి వచ్చినా వెంటనే నీరసానికి గురౌతారు. వారికిష్టం లేని ప్రతికూల పరిస్థితినుండి బయటపడేసే ఒక రకమైన శారీరిక ‘పలాయన’ ప్రతిస్పందన నీరసంగా బహిర్గతమౌతుంది. ఆ క్షణం దాటగానే వారు యథావిధిగా అయిపోతారు.
పరిష్కార మార్గాలు?
అలసట, నీరసం అసలు రాకుండా ఉండే మానవ మాత్రులెవరూ ఉండరు. ఎప్పుడైనా ఒకసారి అనిపించడం సర్వసాధారణం. విశ్రాంతి తీసుకోవడం, సరిపడా ఆహారం, ఎలెక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉండే పానీయాలు సేవించడం వంటివి చేస్తే వెంటనే కోలుకోవచ్చు. అతిగా లోనవుతుంటే మాత్రం పట్టించుకోవాల్సిన విషయాలే. అలసట నుండి నీరసం మొదలౌతుంది కాబట్టి వీటి చికిత్స కూడా దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది. తరచూ అలసట-నీరసాలకి గురవుతూ ఉన్నప్పుడు, వాటి కారకాలు సాధారణమైనవిగా అనిపిస్తే, వాటిని అదుపులో పెట్టుకొనే విధంగా జీవనశైలి మార్పులు చేసుకోవాలి.
జీవనశైలిని సులభతరం…
స్త్రీలు ముఖ్యంగా ఆహారలోపాల్ని సరిదిద్దుకో వాలి. ప్రతి పోషకం శరీరానికి కావాల్సిన మోతాదు ల్లో లభ్యమవుతుందీ-లేనిదీ అనే అంశం పట్ల జాగరూకత వహించి, ఆహారంలో లభ్యం కానప్పు డు, వాటిని పుష్కలంగా అందచేసే పదార్థా లను దైనందిన ఆహారంలో ఇముడ్చు కోవడమో లేదా ఆహార-అనుబంధాలు (ఫుడ్ సప్ప్లీమెంట్స్) గా తీసు కోవల్సి ఉంటుంది. శాకాహార భోజనంలో అన్ని సూక్ష్మ పోషకాలు లభించక పోవచ్చు. పాలు కూడా తీసుకోకూడని ఆహార నియమాలు పాటించే వారికి బీ12 లభ్యమవ్వదు కాబట్టి వారు తప్పక ఆహార అనుబంధంగా బీ12 తీసుకోవాల్సి ఉంటుంది. జీవనశైలిని సులభతరం చేసుకొనే దిశగా మలుచు కొని, శారీరిక-మానసిక ఒత్తిడిని తగ్గించుకొనే ప్రయత్నం చేయాలి. తగినంత విశ్రాంతి, జీవనశైలి సర్దుబాట్లు ఉన్నప్పటికీ అలసట కొనసాగితే, అంతర్లీన కారణాలను గుర్తించి, పరిష్కరించడానికి ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా అవసరం.
– డా|| మీరా, ఎండీ
రిటైర్డ్ ప్రొఫెసర్ , ఉస్మానియా మెడికల్ కాలేజీ