పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసు అధికారులకు శుక్రవారం ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నరసింహ రెడ్డి అతిథిగా పాల్గొన్నారు. సుదీర్ఘకాలం పోలీస్ శాఖకు విశిష్ట సేవలు అందించిన ప్రభాకర్ రెడ్డి (ఏఎస్‌ఐ, మాచారెడ్డి), కలదర్ రాజు (ఏఎస్‌ఐ, రామారెడ్డి) దశరథ్ (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్) లను వారి కుటుంబ సభ్యుల సమక్షంలో శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ కె. నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల పాటు పోలీసు శాఖలో క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసి పదవీ విరమణ పొందడం అభినందనీయమని కొనియాడారు. 1985, 1989 బ్యాచ్‌లకు చెందిన వీరు ఉమ్మడి జిల్లాలో కానిస్టేబుళ్లుగా సేవలు ప్రారంభించి, శాంతిభద్రతల పరిరక్షణలో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తుచేశారు. ముఖ్యంగా దశరథ్ 41 సంవత్సరాల పాటు నిరంతర సేవలు అందించడం విశేషమని తెలిపారు. పదవీ విరమణ అనంతరం మిగిలిన జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లు, రోజువారీ వ్యాయామంతో శారీరక-మానసిక దృఢత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు.
పదవీ విరమణ పొందిన అధికారులకు అందవలసిన అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో పోలీస్ శాఖ వారి వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొని, కరతాల ధ్వనుల మధ్య పదవీ విరమణ పొందిన అధికారులకు ఘనంగా వీడ్కోలు పలికారు.


