పారలమెంటును కుదిపేసిన ‘సర్’
పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాల ఆందోళన
లోక్‌సభ పలుమార్లు వాయిదా… రాజ్యసభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్
‘సర్, ఓటు దొంగతనం’ ఆపాలి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండోరోజూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అంశం ఉభయ సభల్ని కుదిపేసింది. సర్‌పై చర్చకు అధికారపక్షం ముందు కురాకపోవడంతో ప్రతిపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా అమలు చేస్తున్న సర్ ప్రక్రియపై చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేసిన ఆందోళనతో లోక్‌సభ, రాజ్యసభలకు పలుమార్లు అంతరాయం కలిగింది. మరోపక్క వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చ తర్వాతే సర్ అంశాన్ని పరిగణించవచ్చని మోడీ ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
ప్రతిపక్షాల డిమాండ్ పట్ల ప్రభుత్వ వైఖరి, ఇప్పటికే కుదించిన శీతాకాల సమావే శాలు ఎటువంటి గందరగోళం లేకుండా శాంతియుతంగా నిర్వహించడం కష్టమేనని తెలుస్తోంది. శీతాకాల సమావే శాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో సర్‌తో సహా ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, సమావేశాల మొదటి రెండు రోజుల్లోనే ప్రతిపక్షాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ఇష్టపడటం లేదు.
మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే, స్పీకర్ ఓం బిర్లా జార్జియన్ పార్లమెంట్ అధ్యక్షులు షల్వా పాపువాష్విలీ నేతృత్వంలోని జార్జియా పార్లమెంట్ బృందాన్ని స్వాగతించారు. ప్రతినిధి బృందం పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని స్పీకర్ అన్నారు. మరోవైపు ‘సర్’ అంశంపై ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కేవలం 16 నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదా పడింది.
తిరిగి సభ ప్రారంభంకాగానే… కాంగ్రెస్, డీఎంకే, సీపీఐ(ఎం), సీపీఐ, ఎన్‌సీపీ, ఎస్‌పీ, టీఎంసీ తదితర ప్రతిపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి సర్‌పై చర్చకు డిమాండ్ చేశారు. మరోవైపు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించవద్దని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్ష ఎంపీలను కోరారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధమన్నారు. అయితే ‘ఓట్ చోరీ, గద్ది చోరీ’ అంటూ నినాదాలతో హౌరెత్తించారు. దీంతో 9 నిమిషాల్లోనే మధ్యాహ్నం 2 గంటలకు సభ వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైనా ప్రతిపక్షాలు ఆందోళనను కొనసాగించాయి. దీంతో సభను నేటికి (బుధవారం) వాయిదా వేశారు.
రాజ్యసభ నుంచి వాకౌట్
‘సర్’పై చర్చ జరగాలని రాజ్యసభలోనూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. తొలుత రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ జార్జియ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం జీరో అవర్‌ను ప్రారంభించారు. వివిధ అంశాలపై చర్చ చేపట్టాలని రూల్ 267 కింద ఇచ్చిన 20 నోటీసులను చైర్మెన్ తిరస్కరించారు. వెంటనే ప్రతిపక్ష ఎంపీలు సర్, ఇతర అంశాలపై చర్చకు పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ సర్ ఒక ముఖ్యమైన అంశమని, దానిపై వెంటనే చర్చించాలని డిమాండ్ చేశారు. సభ సజావుగా సాగే పరిస్థితి లేకపోవడంతో చైర్మెన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
తిరిగి ప్రారంభమైన సభలో ఎన్నికల సంస్కరణలు, ఇతర అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కిరణ్ రిజిజు అన్నారు. అయితే రాజ్యసభ రూల్ 267 ప్రకారం సర్‌పై తక్షణ చర్చ చేపట్టవచ్చని మల్లికార్జున ఖర్గే, సీపీఐ(ఎం) రాజ్యసభ నాయకుడు జాన్ బ్రిట్టాస్, టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రియన్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ డిమాండ్ చేశారు. అనంతరం సర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం సభ మణిపూర్ వస్తువులు, సేవల పన్ను(రెండో సవరణ) బిల్లు-2025 చర్చించి ఆమోదం తెలిపింది. అనంతరం సభ్యులు అత్యవసర ప్రాముఖ్యత కలిగిన అంశాలను లేవనెత్తారు. ఆ తరువాత సభను నేటికి వాయిదా వేశారు.
పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాల ఆందోళన
ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)’ వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మకర ద్వారం ఎదుట ప్రతిపక్ష నేతలంతా ‘సర్’ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, సీపీఐ(ఎం) ఎంపీలు కె.రాధాకృష్ణన్, జాన్ బ్రిట్టాస్, డీఎంకేకు చెందిన కనిమొళి, టీఆర్ బాలు, ఇతర పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు, పోస్టర్లు పట్టుకొని నిరసన తెలిపారు. అలాగే ‘స్టాప్ సర్-స్టాప్ ఓటు చోరీ’ అని రాసి ఉన్న భారీ బ్యానర్ తో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ నిరసన కొనసాగిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు.
8న వందేమాతరం… 9న సర్‌పై చర్చ 10గంటల పాటు డిబేట్ : బీఏసీలో నిర్ణయం
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై చర్చకు కేంద్రం అంగీకరించింది. అయితే ప్రత్యేకంగా ‘సర్’పై కాకుండా ఎన్నికల సంస్కరణలు అనే విస్తృత అంశాన్ని సభ ముందు ఉంచనుంది. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య అవగాహన కుదిరిందని తెలిపారు.
”వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందున డిసెంబర్ 8 తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి దానిపై చర్చ జరపాలని సమావేశం నిర్ణయించింది. డిసెంబర్ 9 తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎన్నికల సంస్కరణలపై చర్చ మొదలవుతుంది’ అని కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపారు. కాగా, అఖిలపక్ష సమావేశానంతరం మీడియాతో కాంగ్రెస్ విప్ కె.సురేశ్ మాట్లాడుతూ సర్ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు కోరాయని, సర్‌ను కూడా జతచేసి ఎన్నికల సంస్కరణలపై విస్తృత చర్చకు సమావేశం నిర్ణయించిందని తెలిపారు. సభలో 10 గంటల చొప్పున రెండు డిబేట్లకు సమయం కేటాయించారని, అవసరమైతే సమయం మరింత పొడిగించే అవకాశం ఉంటుందని చెప్పారు.



