మత విద్వేషాలను రెచ్చగొట్టిన
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ప్రసంగానికి సీపీఐ(ఎం) ఖండన
న్యూఢిల్లీ : ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఫ్‌ుచాలక్ మోహన్ భగవత్ ప్రసంగాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు భారత రాజ్యాంగం పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌కు వున్న అగౌరవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ దేశ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఢిల్లీలో ఎంపిక చేసిన కొద్దిమంది ఆహుతులనుద్దేశించి మూడు రోజుల పాటు మోహన్ భగవత్ ప్రసంగించారు. మథుర, కాశీ వివాదాలను మళ్ళీ రగిల్చేందుకు ఆయన ప్రయత్నించారు. సోదర భావం కోసం ముందస్తు షరతుగా ముస్లింలు ఈ రెండు ప్రాంతాల్లోని మసీదులను ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాబ్రి మసీదు కూల్చివేత తర్వాత-ఆర్‌ఎస్‌ఎస్ ఈ విధ్వంసంలో పాల్గొంది-1947కి ముందున్న ఏ ఆరాధనా స్థలాన్నైనా మార్చడాన్ని నిషేధిస్తూ పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం, మథుర, కాశీల్లో, ఇతర ఆరాధనా స్థలాల్లో మెజారిటీ మతోన్మాద శక్తులు ఎలాంటి వాదనలు చేసినప్పటికీ, యథాతథ స్థితిని కొనసాగించాలి. మతోన్మాద విద్వేషాలను రెచ్చగొట్టడానికి, ప్రజల దృష్టిని మళ్ళించడానికి, మత ప్రాతిపదికన సమాజాన్ని చీల్చడానికి ఉద్దేశించే ఇలాంటి డిమాండ్లు వస్తుంటాయి. రాబోయే ఎన్నికలకు ముందుగా ప్రజాగ్రహం నుండి బిజెపి ప్రభుత్వాన్ని రక్షించేందుకు గానూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఇలాంటి విచ్చిన్నకర అంశాలను రెచ్చగొడుతున్నారు. అధ్వాన్నంగా మారుతున్న ఆర్థిక పరిస్థితుల నుండి ప్రజల దృష్టిని మళ్ళించాలని అనుకున్నప్పుడల్లా మతోన్మాద విభజనలను రెచ్చగొట్టడమనేది ఆర్‌ఎస్‌ఎస్ దాని అనుబంధ సంస్థల పద్ధతిగా వుంది. అమెరికా అధిక టారిఫ్‌లు, బలహీనమవుతున్న ఆర్థిక వ్యవస్థ, రైతులు, కార్మికులపై పెరుగుతున్న దాడులు, ఓటర్ల జాబితాలో చోటు చేసుకుంటున్న అవకతవకలు, అక్రమాలకు పెరుగుతున్న రుజువులు వీటన్నింటి కారణంగా బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజలకు వున్న భ్రమలన్నీ తొలగిపోతున్నాయి. ఆ ప్రభుత్వ వైపల్యాలన్నీ మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ విచ్ఛిన్నకర విధానాలకు వ్యతిరేకంగా అప్రమత్తంగా వుండాల్సిందిగా దేశ ప్రజలకు సీపీఐ(ఎం) పిలుపిచ్చింది. దేశ ఐక్యత, సమగ్రతలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. ఎన్ని వ్యయ ప్రయాసలకోర్చి అయినా వాటిని పరిరక్షించుకోవాలి. దీన్ని సాధించడం కోసం, అన్ని వర్గాలకు చెందిన ప్రజలను ఏక తాటిపైకి తీసుకురావడం ద్వారా విస్తృత ప్రాతిపదికన ప్రతిఘటనను అత్యవసరంగా కూడగట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది.
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES