– బోధన్ లో లయన్స్ జనరల్ ఆస్పత్రిని ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి
– పేదలకు సాయం అందించే సంస్థలకు ప్రభుత్వ సహకారం ఉంటుందని వెల్లడి
నవతెలంగాణ – బోధన్
బోధన్ పట్టణంలో లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన లయన్స్ జనరల్ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ప్రారంభించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించి, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, పేదలకు నామమాత్రపు రుసుముతో నాణ్యమైన రీతిలో ఆరోగ్య సేవలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశ్యంతో లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయించామని అన్నారు. గడిచిన పాతిక సంవత్సరాల నుండి లయన్స్ కంటి ఆసుపత్రి ద్వారా సంతృప్తికరమైన రీతిలో సేవలు అందిస్తున్నారని, దీనికి అనుసంధానంగా ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసిన జనరల్ ఆస్పత్రి ద్వారా కూడా మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల్లో మంచి పేరు పొందాలని అన్నారు.
ప్రజలకు సేవలందించే సంస్థలకు ప్రభుత్వం తరపున సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, పేదలకు వైద్య సేవలు భారంగా మారకుండా మానవతా దృక్పధంతో సేవలు అందించాలని హితవు పలికారు. అనారోగ్యాలతో వైద్యం కోసం వచ్చే వారికి సరైన విధంగా పరీక్షలు చేసి, అవసరమైన మేరకు టెస్టులు, మందులు రాయాలని సూచించారు. సేవాభావంతో పనిచేసే స్వచ్చంద సంస్థలకు జిల్లా యంత్రాంగం తరపున తోడ్పాటుగా నిలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు బసవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



