Thursday, January 29, 2026
E-PAPER
Homeజాతీయంముస్లింలను వేధించడానికే

ముస్లింలను వేధించడానికే

- Advertisement -

సర్‌పై నిజం ఒప్పుకున్న అసోం సీఎం హిమంత బిస్వా
బీజేపీ బతకాలంటే విభజన రాజకీయాలు తప్పదని వ్యాఖ్య
తీవ్రంగా ఖండించిన ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ : ఎన్నికల సంఘం చేస్తున్న ఓటర జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్‌)పై పెద్ద ఎత్తున్న వస్తున్న విమర్శలు, అభ్యంతరాలు నిజమని వెల్లడయింది. ముస్లింలను వేధించడానికే సర్‌ తీసుకొచ్చినట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా స్వయంగా వెల్లడించారు. బీజేపీ బ్రతకాలంటే ఇలాంటి విభజన రాజకీయాలు తప్పవని కూడా తెలిపారు. దేశంలో మరికొన్ని రాష్ట్రాలతో పాటు అసోంలో కూడా సర్‌ 2 ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే అసోంలో కూడా ఈ సర్‌ ప్రక్రియపై వివాదాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఓటర్ల జాబితాల నుంచి అర్హులైన ఓటర్లను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. అర్హులైన ఓటర్లు సంబంధిత పోలింగ్‌ బూత్‌ల నుంచి శాశ్వతంగా వెళ్లపోవడం, లేదా చనిపోవడం జరిగిందని ఈసీకి కొన్ని తప్పుడు ఫిర్యాదులు వచ్చాయి. అయితే వీటిని బీజేపీ కార్యకర్తలే చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

దీనిపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా స్పందించారు. తన ఆదేశాల ప్రకారమే బీజేపీ కార్యకర్తలు ఈ అభ్యంతరాలను దాఖలు చేశారని తెలిపారు. అలాగే నిజానికి ముస్లింలను వేధించడానికే సర్‌ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు నిస్సిగ్గుగా చెప్పారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ‘మియాల (అసోంలో బెంగాలీ మూలాలున్న ముస్లింలను కించపర్చడానికి ఉపయోగించే పదం)ను వేధించడానికి సర్‌ అమలు చేస్తున్నాం. మియాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తూనే ఉండాలని బీజేపీ కార్యకర్తలకు చెప్పాను. ఇందులో దాచడానికి ఏమీ లేదు. నేను సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌ల్లో మాట్లాడుతూ సాధ్యమైన చోటల్లా ఫారం7లను పూరించాలని చెప్పాను. తద్వారా వారు (ముస్లింలు) కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తుంది. ఇబ్బందులు పడతారు’ అని అన్నారు.

వారు ఇబ్బందులు పడితేనే అసోంను వదలివెళ్తారని తెలిపారు. అలాగే, మీడియా ప్రతినిధులను ఉద్దేశిస్తూ.. మీరు కూడా వారిని ఇబ్బంది పెట్టాలని సూచించారు. వారికి సానుభూతి వార్తలు ప్రచురించ కూడదని, అలా చేస్తే మీ సొంత ఇంట్లోనే లవ్‌ జిహాద్‌ జరుగుతుందని హెచ్చరించారు. అలాగే, మనం (బీజేపీ) జీవించాలంటే రాబోయే 30 ఏండ్ల పాటు విభజన రాజకీయాలు చేయాలని చెప్పారు. దీనికి ముందు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సర్‌ తరువాత అసోంలో కనీసం ఐదు లక్షల మియా ఓట్లు తొలగిస్తామని చెప్పారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు ఎంత కావాలంటే అంతగా నన్ను తిట్టుకోవచ్చునని, మియాలను ఇబ్బంది పెట్టడమే తన పని అని చెప్పారు. హిమంత బిస్వా వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిస్వాను ‘హిందూ జిన్నా’గా అస్సాం పీసీసీ అధ్యక్షులు గౌరవ్‌ గొగోయ్ అభివర్ణించారు.

బిస్వాను అరెస్టు చేయాలి : సీపీఐ(ఎం)
రాజ్యాంగ పదవిలో ఉంటూ విద్వేష వ్యాఖ్యలు, దేశ లౌకిక విలువలకు అవమానకరంగా మాట్లాడిన హిమంత బిస్వా శర్మను తక్షణమే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. సర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న సమయంలో ఈ ప్రక్రియను దుర్వినియోగం చేయాలని బహిరంగా బిస్వా పిలుపు నిచ్చారని, రెచ్చగొట్టే ఈ వ్యాఖ్యలను కోర్టు సుమోటా స్వీకరించాలని, మత సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు బిస్వాపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -