నో హెల్మెట్ – నో పెట్రోల్
– ఎస్ఐ మునుగోటి రవీందర్
నవతెలంగాణ – కట్టంగూర్ : ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడినప్పుడు వారి ప్రాణాలను రక్షించేందుకే జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ వినూత్నంగా నో హెల్మెట్- నో పెట్రోల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని దీనిని ప్రతి వాహనదారుడు పాటించి సురక్షితంగా ఉండాలని స్థానిక ఎస్సై మునుగోటి రవీందర్ పిలుపునిచ్చారు. జిల్లాలో ఈ కార్యక్రమ ప్రారంభాన్ని పురస్కరించుకొని బుధవారం మండల పరిధిలోని పలు పెట్రోల్ బంకుల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమ ప్రాధాన్య అంశాలను ఎస్సై వివరించారు.
పెట్రోల్ బంక్ సిబ్బందికి కూడా హెల్మెట్ లేకుండా వచ్చే వారికి పెట్రోలు పోయావద్దని సూచించారు. ఒకవేళ వాహనదారులు ఎవరైనా హెల్మెట్ లేకుండా వచ్చి పెట్రోల్ కోసం సిబ్బందిపై ఒత్తిడి తెస్తే సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విలువైన మనిషి ప్రాణాలను ప్రమాదాల బారిన పడకుండా నివారించేందుకు ప్రతి ఏటా జనవరిలో రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. మన అందరి ప్రాణాల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రతి ద్విచక్ర వాహనదారుడు సహకరించి ప్రమాదరహిత జిల్లాగా నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది బండారు సతీష్, శీను, మధుసూదన్ రెడ్డి, విజయ్, కోటి ఉన్నారు.



