ఇది ఒకప్పటి కథ. ఒక ఊళ్ళో ఏడుకొండలు అనే చిన్న రైతు ఉండేవాడు. రైతుకు పొలం ఉంటే సరిపోదు కదా! పంట పండించడానికి నీరు కూడా కావాలి. కానీ ఆ ఊళ్ళో నీటి కరువు ఉండేది. వర్షాలు సరిగా పడక పొలాలు ఎండిపోయాయి. ఏడుకొండలు కష్టపడే తత్వం గల మనిషి. తన పొలంలో నెమ్మదిగా బావి తవ్వడం మొదలుపెట్టాడు. తన ఇరుగుపొరుగు రైతుల సహాయం కూడా అడిగాడు. నీరు పడితే వాళ్ళ పొలాలకు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాడు. అందువల్ల అందరూ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అందరూ కలసి పని చేసేవారు. ఒక రోజు బావి తవ్వుతుండగా ఏడుకొండలు తన పనిముట్టుకి ఏదో మెత్తగా తగిలింది. విలువైనది ఏదో అయి ఉంటుందని ఊహించాడు. అందరిలో చూస్తే అందరికీ అందులో భాగం ఇవ్వాలి లేదా జమీందారుకు తీసుకెళ్ళి అప్పగించాలి. దాని వల్ల అతనికి ఏ ప్రయోజనం ఉండదు. అందుకే ముందుగా అక్కడున్న మనుషుల్ని ఆ రోజుకు పని ఆపమని ఇంటికి పంపేశాడు.
అందరూ వెళ్ళాక రాత్రి బావిలోకి దిగి ఏముందో చూశాడు. ఒక చిన్న గుడ్డ సంచి మూట కట్టి ఉంది. ఎవరైనా చూస్తారేమోనని గబగబా ఇంట్లోకి వెళ్ళి తలుపులు బిగించాడు. పెళ్ళాన్ని పిలిచి మూట చూపించాడు. ఆమె ముఖంలో వెలుగు ఇంట్లో లాంతరు వెలుగుని మించిపోయింది. ఇన్నాళ్ళకు తమకు మంచి జరిగిందని దేవుళ్ళందరికీ దణ్ణం పెట్టింది. ఏడుకొండలకు ఎప్పుడెప్పుడు ఆ సంచిని తెరిచి చూద్దామా అని తొందరగా ఉంది. అప్పుడే అతని పెళ్ళానికి ఆ రోజు అమావాస్య అని గుర్తొచ్చింది. ఒక్క రాత్రి ఆగి రేపు తెల్లారగానే చూద్దామని మొగనికి చెప్పింది. ఇద్దరూ రాత్రంతా జాగారమే! మర్నాడు లేచి చూసేసరికి ఆ సంచి కాస్త పెద్దద్దయింది. పెళ్ళాం ఆశగా మూట విప్పబోయింది. ‘నిన్నటి కన్నా ఇవాళ పెద్దది అయితే రేపటికి ఇంకా పెద్దది అవుతుంది. రేపటి దాకా ఆగుదాం’ అన్నాడు ఏడుకొండలు. నిజమే కదా అని మగని తెలివితేటలు మెచ్చుకుని పాయసం చేసిన పెట్టింది పెళ్ళాం. మరుసటి రోజు సంచీ ఇంకాస్త పెద్దది అయింది. ఆ రోజూ తెరవలేదు. అలా ప్రతీ రోజూ సంచి పెద్దదవడం, వాళ్ళు తెరవకుండా ఉండడం జరుగుతున్నాయి. వారం రోజుల్లో సంచి ఆ గదిని మొత్తం ఆక్రమించింది. ఒక రోజు రాత్రి పెళ్ళాం ఇంక ఉండబట్టలేక సంచీ మూట విప్పింది. అందులో నుండి వచ్చిన బలమైన గాలికి ఆమె పైకి ఎగిరి ఇంటి పై కప్పుకు అతుక్కుపోయింది. ఆ శబ్దానికి ఏడుకొండలు నిద్ర మత్తు వదిలిపోయింది. పెళ్ళాన్ని చూసి లబోదిబోమన్నాడు. ఆ సంచి వల్లే ఇదంతా అని ఏడ్వడం మొదలుపెట్టాడు. సంచికి జాలేసింది. ”ఏడవకు ఏడుకొండలు.. నీకేం కావాలో అడుగు. నేను ఇస్తాను” అంది సంచి. ఏడుకొండలు ఇంకా భయపడిపోయాడు.
సంచి ”భయపడొద్దు.. నిన్నేమీ చేయను. ఏం కావాలో అడుగు” అంది. పై నుంచి పెళ్ళాం ఆశగా చూస్తోంది. ఏడుకొండలు వెంటనే బంగారు నాణేలు కావాలన్నాడు. వెంటనే ఎదురుగా కాంతులీనే కాసులు కనిపించాయి.
పెళ్ళాం తనను దింపమని అడగమని మొత్తుకుంది.
”నిన్ను నేనైనా దింపుతాను. ముందు అడగనీ” అన్నాడు. సంచిని పాడి, పశువులు కావాలన్నాడు. అన్నీ ప్రత్యక్షమయ్యాయి. విందు భోజనం కావాలన్నాడు. కడుపారా తిన్నాడు. అన్ని కోరికలు తీరాకా సంచిని వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపొమ్మని చెప్పాడు. ఆ ఒక్కటి కుదరదని చెప్పింది సంచి. తలపట్టుకున్నాడు ఏడుకొండలు. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు గుర్తొచ్చింది పెళ్ళాం. పెళ్ళాంని కిందకు దింపమని కోరాడు. పెళ్ళాం కిందకు దిగుతూనే మొగుని నెత్తి మీద మొట్టికాయ వేసింది. సంచిని ఇంటి నుండి ఎలా పంపాలో ఆలోచించమని పెళ్ళాన్ని వేడుకున్నాడు. తమ ఊరి బావిలో నీళ్ళు రావాలని పెళ్ళాం సంచిని కోరింది. వెంటనే సంచి మాయమయ్యింది. వెన్నెల వెలుగుల్లో బావిలో నీళ్ళు మెరిశాయి. ఆ ఊరి నుండి కరువు పారిపోయింది.
– డా. హారిక చెరుకుపల్లి, 9000559913
కథ సంచికి
- Advertisement -