– భారీగా ఏర్పాట్లు ట్రాఫిక్ క్లియరెన్స్‌కు చర్యలు
– కటౌట్లు, ఫ్లెక్సీలలో కనిపించని హరీశ్‌రావు ఫొటోలు
– నేతల్లో కుదరని సమన్వయం
– ఈ క్రమంలో చారిత్రాత్మక సభగా నిలిచేనా..?
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి చింతలపల్లిలో సభ నేపథ్యంలో ఆ పార్టీలోని అంతర్గత విభేదాలపై చర్చలు నడుస్తున్నాయి. భారీగా ఏర్పాట్లు చేసినప్పటికీ నేతల మధ్య సమన్వయ లోపం, పార్టీ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం లాంటి విషయాలపై శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అయితే, కీలక నేత ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇన్ని రోజులూ సభా ఏర్పాట్ల విషయంలో అంటీ ముట్టనట్టు ఉండటం చర్చకు తావిచ్చింది. ఈ క్రమంలో శనివారం ఆయన సభాస్థలికి చేరుకొని విలేకరుల సమావేశం నిర్వహించి వెళ్లారు. అయితే, బహిరంగ సభలో ఎక్కడా హరీశ్‌రావు కటౌట్‌లకు స్థానం లేకపోవడం గమనార్హం. ఫ్లెక్సీలలో కేసీఆర్, కేటీఆర్‌ల ఫొటోలే కనిపించడంతో పార్టీ శ్రేణుల్లో పెద్దఎత్తున చర్చకు దారితీసింది.
బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను 1,213 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. 154 ఎకరాల్లో సభావేదిక ఏర్పాటు చేయగా, 500 మంది వేదికపై కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 1,059 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 10 లక్షల వాటర్ బాటిల్స్, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందించనున్నారు. వివిధ రూట్లలో 6 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. సభా స్థలి పరిసరాల్లో 12 వైద్య శిబిరాలు పెట్టారు. 1,200 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. పార్కింగ్ నిర్వహణకు 2 వేల మంది వాలంటీర్లను నియమించారు.
భారీ బందోబస్తు
రజతోత్సవ సభకు పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1,100 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. ఇద్దరు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలు, 8 మంది ఏసీపీలు, 28 మంది ఇన్స్‌పెక్టర్లు, ఆర్‌ఐలు, 66 మంది ఎస్‌ఐలు, 137 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 511 మంది కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులతోపాటు డిస్ట్రిక్ట్ గార్డ్స్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
ట్రాఫిక్ రద్దీపై నజర్..
సభకు వచ్చే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఒకవైపు పోలీసు అధికారులు, మరోవైపు బీఆర్‌ఎస్ శ్రేణులు ట్రాఫిక్ రద్దీని క్లియర్ చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఎక్కడా ట్రాఫిక్ జామ్ జరగకుండా పార్టీ నేతలు, కార్యకర్తలే ట్రాఫిక్ సిబ్బందిగా పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు.
చారిత్రాత్మక సభగా నిలిచేనా..?
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ చారిత్రాత్మక సభగా నిలుస్తుందా ? అనే విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ చేసే ప్రకటనలు ఏ మేరకు రాజకీయాలను ప్రభావితం చేస్తాయన్న విషయంలో ఇప్పటికే రాజకీయ పరిశీలకులు ఎదురు చూస్తున్నారు. 10 లక్షల మంది వస్తారంటున్నా.. ఒకవైపు ఎండలు, మరోవైపు నేతల మధ్య విభేదాలతో జన సమీకరణ అన్ని నియోజకవర్గాల్లో ఒకే పద్ధతిలో జరగడం లేదని తెలుస్తోంది.
పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి
ఎల్కతుర్తి చింతలపల్లిలో భారీగా రజతోత్సవ సభకు ఏర్పాట్లు చేసినా.. మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో పార్టీ బలోపేతం కాకపోవడం ఆ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మహబూబాబాద్ జిల్లాలో సీనియర్ నేతలున్నా, సమన్వయం కుదరడం లేదు. ఎవరికివారే ఒంటెద్దు పోకడలతో మహబూబాబాద్ జిల్లా గులాబీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ములుగు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇందుకు నాయకత్వంలో లోపాలే కారణంగా ఉంది. ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి పూర్తిస్థాయిలో శ్రేణులకు అందుబాటులో వుండకపోవడం, పార్టీ కార్యక్రమాలను నిర్వహించకపోవడంతో కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి శక్తి సామర్థ్యాలు సైతం పార్టీని సమన్వయంతో నడిపే పరిస్థితి లేకపోవడం శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నాయకత్వం పట్ల డిప్యూటీ మేయర్ వర్గం తీవ్ర ఆగ్రహంతో వుంది. ఇన్‌చార్జిని మార్చాలని డిమాండ్ చేయడం గమనార్హం. పార్టీ సంస్థాగతంగా చాలా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో బలహీనంగా వున్నా వాటన్నింటినీ పరిష్కరించే దిశగా నాయకత్వం ఇప్పటి వరకు దృష్టి కేంద్రీకరించలేదు. ఈ విషయంలో సీనియర్ నేతలు తీవ్ర అసహనంతో వున్నారు.
నేడే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ
- Advertisement -
RELATED ARTICLES