Tuesday, November 11, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలునేడు జూబ్లీ బైపోల్‌

నేడు జూబ్లీ బైపోల్‌

- Advertisement -

పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌, డ్రోన్లతో నిఘా
ఈవీఎంలతో పోలింగ్‌ స్టేషన్లకు చేరుకున్న సిబ్బంది
భద్రత కట్టుదిట్టం

నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌ మంగళవారం జరగనుంది. అందుకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. 25 రోజులుగా హౌరాహౌరీగా సాగిన ప్రచార పర్వం ఆదివారం సాయంత్రంతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 407 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసింది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. యూసఫ్‌గూడలోని డీఆర్‌సీ సెంటర్‌లో ఈసీ అధికారులు సిబ్బందికి ఈవీఎంలను, పోలింగ్‌ స్టేషన్లను కేటాయించారు.

ఈవీఏంలు, ఎన్నిక మెటీరియల్‌ తీసుకుని ఎన్నికల సిబ్బంది సోమవారం సాయంత్రం పోలింగ్‌ స్టేషన్లకు చేరుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వి.కర్ణన్‌ పోలింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ఉప ఎన్నిక నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ శాఖ మరింత అప్రమత్తమైంది. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలతో నిఘా పెట్టారు. డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్‌ చేయనున్నారు. పోలింగ్‌ ఏజెంట్‌కు, సిబ్బందికి ప్రత్యేక పాస్‌ను కేటాయించారు. పోలింగ్‌ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలోని వైన్స్‌, పబ్బులు మూసేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లకు, కాలేజీలకు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అంవాఛనీయ ఘటనలూ జరగకుండా పోలీస్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. 2060 మంది ఎన్నికల సిబ్బందితోపాటు 2000మంది పోలీస్‌ సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే 144 సెక్షన్‌ ఆంక్షలు విధించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం పరిధిలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో 139 సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. నేడు పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం, ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాన్ని వెల్లడిస్తారు.

ఓటర్లు ముందుకు వచ్చి ఓటెయ్యాలి : ఆర్‌వి.కర్ణన్‌
స్వచ్ఛందంగా తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ముందుకొచ్చి ఓటెయ్యాలని జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వి.కర్ణన్‌ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్‌ స్టేషన్లలో 226 క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. పోలింగ్‌ను డ్రోన్ల ద్వారా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈసారి 4 బ్యాలెట్‌ యూనిట్లు వాడుతున్నామని తెలిపారు. వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశామని, అన్ని పోలింగ్‌ స్టేషన్స్‌ దగ్గర 1950 నెంబర్‌గల హెల్ప్‌ డెస్క్‌లు ఉన్నట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -