జీహెచ్‌ఎంసీలో రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన
కొత్తగా 300 వార్డులు..మూడు కార్పొరేషన్లు
నేడు ఉత్తర్వులు విడుదల?
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పాలకవర్గం ఐదేండ్ల పాలన (నేడు) ఫిబ్రవరి 10తో ముగియనుంది. దాంతో స్పెషల్ ఆఫీసర్ పాలన మొదలు కానుంది. జీహెచ్‌ఎంసీ మూడు మహానగర పాలక సంస్థలుగా మారే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అయితే అధికారికంగా ప్రకటించకపోయినా, (రేపు) బుధవారం 11న 300వార్డులతో ‘మహా నగరంగా’ మూడు కార్పొరేషన్లపై ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. బుధవారం నుంచి మొదలు కానున్న స్పెషల్ ఆఫీసర్ పాలన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే వరకు కొనసాగనుంది.
దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ
జీహెచ్‌ఎంసీ పరిధిలోకి 20 పురపాలికలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు కలిపి మొత్తం 27 పట్టణ స్థానిక సంస్థలను (యూఎల్‌బీలు) విలీనం చేయడంతో జీహెచ్‌ఎంసీ 300 వార్డులు, 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి 2,053 చదరపు కిలోమీటర్లకు పెరిగిం ది. 12 జోన్లు, 60 సర్కిళ్లుగా ఏర్పడ్డాయి. జనాభా 1.34 కోట్లకు పైగా ఉండటంతో జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ అవతరించింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) వరకు విస్తరించిన జీహెచ్‌ఎంసీని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి (లేదా సికింద్రాబాద్) మూడు కార్పొరేషన్లుగా విభజించనున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణాలకు సైతం ఇక్కడి నుంచే అనుమతులు జారీ చేస్తారు. పాలన అంతా ఇక్కడి నుంచి కొనసాగనుంది.
చివరి రోజు పెద్దఎత్తున అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
మంగళవారం(నేటి)తో జీహెచ్‌ఎంసీ పాలకవర్గం పాలన ముగియనుండడంతో చివరిరోజు కార్పొరేటర్లు ప్రారంభోత్సవ కార్యక్రమాలల్లో మునిగిపోయారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్‌ను ఘనంగా సన్మానించారు. ఇదిలావుండగా మంత్రి, మేయర్‌లను రప్పించుకుని తమ పరిధిలో పెద్దఎత్తున అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలో రూ.115.85కోట్లతో మంత్రి శ్రీధర్‌బాబు అభివృద్ధి పనులకు మంగళవారం ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు.
మూడు ప్రధాన కార్పొరేషన్లు
-హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) : శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, ఖైరతాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్ జోన్‌లు.
-సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీసీఎంసీ) : కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్‌లు.
-మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంఎంసీ) : మల్కాజిగిరి, ఎల్.బి. నగర్, ఉప్పల్ జోన్లు.



