స్వాతంత్ర సమరయోధుల వారసుల సంఘం ప్రధాన కార్యదర్శి రేపాల నరసింహ రాములు
నవతెలంగాణ – పరకాల
అమరుల త్యాగాలు, బలిదానాలను నేటి తరం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉందని స్వాతంత్ర సమరయోధుల వారసుల సంఘం ప్రధాన కార్యదర్శి రేపాల నరసింహ రాములు అన్నారు. పరకాల అమరవీరుల సంస్మరణ దినం సెప్టెంబర్ 2 సందర్భంగా స్థానిక అమరవీరుల స్మారక భవన ఆవరణలో అమరవీరుల శిలాఫలకానికి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కట్టంగూరి నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నరసింహా రాములు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2 -1947 న జరిగిన హత్యాకాండ కు నేటితో 78 ఏళ్లు పూర్తయ్యాయన్నారు. నిజాం నిరంకుశ పాలనలో అనగారిన ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రాల కోసం సాగించిన పోరాటంలో భాగంగా పరకాలలో నిజాం పోలీసులు జరిపిన తుపాకీ తూటాల కాల్పుల్లో ఒకేరోజు 22 మంది స్వాతంత్ర సమరయోధులు ఆత్మార్పణం చేశారని, వారి పోరాటాలు, త్యాగాలు వృధాగా పోవన్నారు. ఇందులో భాగంగా పరకాల అమరవీరుల స్మారకార్థం అమరవీరుల మైదానములో నిర్మించిన “అమరవీరుల స్వారక భవనం” తో పాటు “అమరధామం” పర్యాటక కేంద్రాలను పదిల పరుచుకొని భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా చేయాలన్నారు.
ఇందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకొని అమరధామం లో నిర్మించిన సజీవ చిత్రాలను పదిల పరిచేందుకు ప్రతి ఏటా రంగులు వేయించాలని అంతేకాకుండా రోడ్డు పక్కన గల విగ్రహాలు ధ్వంసం అయ్యే పరిస్థితి ఉన్నందున వాటి రక్షణ దిశగా గ్రిల్స్ ఏర్పాటు చేయుటకు నిధులు కేటాయించి వాటి రక్షణ, అమరధామం పరిరక్షణకు పాటుపడాలని కోరారు. ఇందుకు పరకాల స్వాతంత్ర సమరయోధుల వారసర సంఘం ఎల్లవేళలా అండదండలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారసుల సంఘం కోశాధికారి పాడి ప్రతాపరెడ్డి, సహాయ కార్యదర్శి ముదురుకోళ్ల సంపత్, జనార్దన్ రావు, జలాలుద్దీన్, జంగేటి సారంగపాణి, కైలాసం, భూషి ప్రభాకర్ రెడ్డి, కోడెపాక సమ్మయ్య, నర్సింగరావు, విజయ్ కుమార్, లింగయ్య, రాజయ్య, సాంబయ్య, శివ నాగులు తదితరులు పాల్గొన్నారు.
అమరుల త్యాగాలను విద్యార్థులకు గుర్తుచేసిన బిట్స్ పాఠశాల ఉపాధ్యాయులు..
స్థానిక పరకాల పట్టణంలోని బిట్స్ పాఠశాల విద్యార్థులను ప్రిన్సిపల్ పిండి యుగంధర్ అమరవీరుల మైదానంలో గల అమరధామం దగ్గరికి విద్యార్థులను తీసుకెళ్లి అక్కడ చరిత్రను వర్ణించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇందులో భాగంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నిజం పరిపాలనకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం బానిసత్వ విముక్తి కోసం సాగిన స్వేచ్ఛ స్వతంత్ర పోరాటంలో పరకాల లో జరిగిన సంఘటనను ఆయన విద్యార్థులకు వివరించారు.
మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థల ప్రజలకు నిజాం చెర నుండి విముక్తి లభించలేదని దీనితో అన్ని వర్గాల ప్రజలు అగ్రావేశాలతో ఉద్యమానికి నడుంబిగించారని అందులో భాగంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటాల పురిటి గడ్డైన పరకాలలో వేలమంది ప్రజలు పెద్ద ఎత్తున ఊరేగింపు చేపట్టారని దీనిని జీర్ణించుకోలేని నిజాం పోలీసులు ప్రజలపై కాల్పులు జరిపి చాలామందిని కాల్చి చంపారని అది జరిగి నేటికీ 78 ఏళ్ల పూర్తయిందని వారు త్యాగాలకు గుర్తుగా మన పరకాలలో ఈ అమరవీరుల మైదాన ప్రాంతంలో అమరధామం ఏర్పాటు చేశారని విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.