అమెరికా యుద్ధనౌకలో నిర్వహణ లేక పనిచేయని 650 మరుగుదొడ్లు
45 నిమిషాల పాటు క్యూలో నిల్చుంటున్న సిబ్బంది
సమస్య పరిష్కారానికి రోజుకు 19 గంటలు పనిచేస్తున్నా ఫలితం శూన్యం
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతోన్న నేపథ్యంలో ఇప్పటికే భారీస్థాయిలో అమెరికా సైన్యం ఇరాన్‌ను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. అమెరికా విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సహా పలు యుద్ధనౌకలను ఇరాన్ దిశగా తరలించింది. అయితే యుద్ధం ప్రారంభించకముందే అమెరికా సిబ్బంది తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. విమాన వాహక నౌకలో విధులు నిర్వహిస్తోన్న 4500 సిబ్బంది ‘టాయిలెట్’ కష్టాలను ఎదుర్కొంటున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
నివేదికల ప్రకారం.. ఎనిమిది నెలలుగా నడి సముద్రంలో ఉన్న యుద్ధనౌకలోని మురుగునీటి వ్యవస్థలో ఇటీవల వైఫల్యం తలెత్తింది. యుద్ధనౌక నిరంతరం కదులుతున్నందున, సరైన నిర్వహణ లేకపోవడంతో అందులో ఉన్న మొత్తం 650 మరుగుదొడ్లలో చాలా వరకు పనిచేయడం లేదు. దీంతో మహిళా సిబ్బందితో పాటు పురుషులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాత్రూంను ఉపయోగించు కోవాలంటే సిబ్బంది రోజు దాదాపు 45 నిమిషాల పాటు క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి నౌకలోని సాంకేతిక నిపుణులు రోజుకు 19 గంటలు పనిచేస్తున్నా లాభం లేకుండా పోతోంది.
అయితే టాయిలెట్ సమస్యలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదని.. గతేడాది మార్చిలోనూ నాలుగు రోజుల్లో నౌకలోని 205 టాయిలెట్లు పాడయ్యాయని సిబ్బంది తెలిపారు. ఇందులో అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ.. పెళుసుగా ఉండే వాక్యూమ్-ఆధారిత మురుగునీటి వ్యవస్థపై ఆధారపడడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తుతున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. ఇరుకైన మురుగు వ్యవస్థ నిర్మాణం కారణంగా ఒక వాల్వ్‌లో వైఫల్యం తలెత్తినా అన్ని టాయిలెట్లపై ఆ ప్రభావం పడుతోందన్నారు. ఈ పైపులను పునరుద్ధరించడానికి ప్రతిసారీ యాసిడ్ ఫ్లష్ చేయాల్సి వస్తోందన్నారు. దీని కోసం దాదాపు రూ.3 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. అమెరికా ప్రభుత్వం తన కార్యక్రమాలను తరచూ పొడిగిస్తున్న కారణంగా కొంతమంది సిబ్బంది తీవ్ర అసహనానికి గురై సైన్యం నుంచి వదిలి వెళ్లిపోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల అమెరికా వెనిజులాపై దాడి చేసి, మదురోను బంధించిన సమయంలోనూ ఈ నౌక నుంచే యుద్ధ విమానాలు దాడిలో పాల్గొన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
‘టాయిలెట్ వార్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



