ఒక పెద్ద అపార్ట్‌మెంట్ సముదాయంలోని సెక్యూరిటీ రూమ్ పక్కన ఒక తల్లికుక్క తన పిల్లలతో నివసిస్తోంది. ఆ పిల్లల్లో ఒకదాని పేరు టామీ.
ఆ అపార్ట్‌మెంట్లో నివసించే కొందరు విదేశీ జాతి పెంపుడు కుక్కలను ఎంతో ముద్దుగా పెంచుకునేవారు. టామీ ఇదంతా గమనిస్తూ ఉండేది.
ఒకరోజు టామీ ఎవరూ చూడకుండా ఒక ఇంటి దగ్గరకు వెళ్ళింది. లోపల, ఒక పెంపుడు కుక్క మెత్తని సోఫాలో కూర్చుని ఆహారం తింటోంది.
అదే సమయంలో అటుగా వచ్చిన మరొక పెంపుడు కుక్క టామీని చూసి, కోపంగా ”ఛీ ఛీ! నువ్వు వీధి కుక్కవి! ఇక్కడి నుంచి పో!” అని పెద్దగా అరిచింది.
ఆ అరుపు విన్న ఇంటి యజమాని కర్రతో టామీని బెదిరించాడు.
భయపడిన టామీ పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళింది. జరిగినదంతా చెప్పి కన్నీళ్లతో, ”ఆ పెంపుడు కుక్కలకు, మనకు తేడా ఏమిటి? మనమంటే అంత చిన్న చూపు ఎందుకు?” అని అమాయకంగా అడిగింది.
”పద! చూస్తే నీకే తెలుస్తుంది” అని టామీని తీసుకుని తల్లి బయలుదేరింది. దారిలో మాంసం కొట్టు నుంచి మాంసం దొంగిలిస్తున్న కుక్కలు, వాహన చోదకులను వెంటాడుతున్న కుక్కలు కనిపించాయి.
”మనం మనుషులకు, వారి ఆస్తులకు రక్షణగా ఉండాలి. ఇళ్లకు కాపలా కాయాల్సిన బాధ్యత మన మీద ఉంది, యజమాని చెప్పినట్లు వినాలి. కానీ, ఆ బాధ్యతను మరచి ఇలా అల్లరి చిల్లరగా తిరగడం వల్లే మనం చులకనయ్యాం. ఈ లోకంలో ప్రత్యేకమైన నైపుణ్యం లేకపోతే, ఈ సమాజం ఎవరినీ గుర్తించదు” అని చెప్పింది తల్లికుక్క.
తల్లి మాటలు టామీలో గొప్ప ఆలోచనలు రేకెత్తించాయి. ఆ రోజు నుండి టామీ రాత్రిపూట అపార్ట్‌మెంట్ చుట్టూ గస్తీ తిరిగేది, వేగాన్ని పెంచుకోవడానికి సాధన చేసేది.
ఒకరోజు రాత్రి అపార్ట్‌మెంట్‌లోకి కొంతమంది దొంగలు ప్రవేశించారు. టామీ వారిని గుర్తించి, వెంబడించి ధైర్యంగా దాడి చేసింది.
అప్పుడే అటువైపు పెట్రోలింగ్ చేస్తున్న జాగిలాల దళ నాయకుడు వారిని పట్టుకున్నాడు.
ఆ జాగిలాల దళ నాయకుడు టామీ ధైర్యాన్ని, దాని అత్యద్భుతమైన వేగాన్ని చూసి దానిని తమ శిబిరానికి తీసుకువెళ్లి కఠోర శిక్షణ ఇచ్చాడు.
కొన్ని నెలల తరువాత టామీ తల్లి ఉంటున్న పక్క అపార్ట్‌మెంట్‌లో దొంగతనం జరిగింది. జాగిలాల దళం టామీని తీసుకువచ్చి సంఘటన స్థలంలో వదిలారు. టామీ వాసన చూస్తూ ఇళ్లన్నీ తిరిగింది.
పోలీసులతో హుందాగా ఉన్న టామీని చూసి తల్లి కుక్క ఆనందంతో పొంగిపోయింది. టామీ గర్వంగా తల్లి వైపు చూసి, ”మనం చేసే పనులను బట్టే గొప్పవారిగా గుర్తించబడతాం అని నువ్వు చెప్పిన మాటలే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చాయి!” అని చెప్పి, తన విధినిర్వహణలో మునిగిపోయింది.
టామీని పోలీస్ జాగిలంగా చూడగానే, దానిని ‘వీధి కుక్క’ అన్న పెంపుడు కుక్కల నోరు ఆశ్చర్యంతో మూతపడింది. దాని పనితీరే దానికి గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది.
కాశీ విశ్వనాథం పట్రాయుడు, 9494524445



