Saturday, November 22, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రేపు దేశవ్యాప్త నిరసన దినం

రేపు దేశవ్యాప్త నిరసన దినం

- Advertisement -

మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్‌కౌంటర్లు బూటకం
నిరాయుధుల్ని పట్టుకుని కాల్చి చంపారు
ఉద్యమాన్ని కొనసాగిస్తాం : మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్‌కౌంటర్లు బూటకమనీ, నిరాయుధులైన కేంద్ర కమిటీ సభ్యులు మాడ్వి హిడ్మా, ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యులు శంకర్‌, రాజేలతో పాటు పలువురు మాయివోస్టులను పోలీసులు పట్టుకెళ్లి కాల్చి చంపారని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)అధికార ప్రతినిధి అభయ్‌ ప్రకటించారు. బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ ఈ నెల 23న(ఆదివారం) దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వారి స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తామని శపథం చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా, అతని సహచరిణి రాజే కొద్ది మంది వ్యక్తులతో కలిసి వైద్య చికిత్స కోసం విజయవాడ వెళ్లారనీ, చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం వల్ల వారి సమాచారం పోలీసులకు చేరిందని తెలిపారు. కేంద్ర హోం శాఖ డైరెక్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఐబీ ఈ నెల 15న తేదీన వారిని అదుపులోకి తీసుకుని లొంగదీసుకునేందుకు విఫల ప్రయత్నం చేసి విఫలమై క్రూరంగా హతమార్చిందని వివరించారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ జరగడం, వారి వద్ద ఆయుధాలు దొరకడం, ఆరుగురు చనిపోవడం పచ్చి అబద్ధమని కొట్టిపడేశారు. రంపచోడవరం ఎన్‌కౌంటర్‌ కూడా బూటకమని తెలిపారు. చివరి వరకు ఉద్యమంలో కొనసాగి శత్రువుకు తలవంచకుండా ప్రాణాలర్పించిన హిడ్మా, శంకర్‌, రాజే, చైతు, కమ్లూ, ముల్లాల్‌, దేవే తమ ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టారని కొనియాడారు. హిడ్మా నిరంతరం ప్రజల్లో పనిచేస్తూ ఉద్యమ అవసరాల కోసం మార్క్సిజాన్ని విశేషంగా అధ్యయనం చేశారనీ, దక్షిణ సబ్‌ జోన్‌లో ప్రజా రాజ్యాధికార అంగాల(జనతన సర్కార్లు) ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారని వివ రించారు. ప్రజల కోసం పనిచేస్తున్న హిడ్మాను పాలకవర్గ మీడియా వాళ్లు, గోదీ మేధావులు దుర్మార్గునిగా చిత్రీకరిం చారని వాపోయారు. భగత్‌సింగ్‌, కొమ్రంభీమ్‌, అల్లూరి సీతారామరాజు, గూండాదూర్‌, గేంద్‌సింగ్‌ల మాదిరిగానే హిడ్మా భారత విప్లవోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌- బీజేపీ మనువాదులు అభివృద్ధి ముసుగులో దేశ సంపదను, ప్రకృతి వనరులను కార్పొరేట్లకు అప్పజెప్పుతున్న తీరును ఎండగట్టారు. పూటకోనినాదం.. రోజుకో పథకం పేరుతో మతోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ మోడీకి గోది కమిషన్‌గా మారిందని ఆరోపించారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీల్ని మొత్తం నిర్మూలించి బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను సైతం ధ్వంసం చేసే పథకంతో ముందుకు సాగుతున్నారని వివరించారు. ఫాసిస్టు ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ మనువాదులకు వ్యతిరేకంగా, దోపిడీ వ్యవస్థ నిర్మూలనకు సాగే పోరాటాల్లో కార్మికులు, రైతులు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -