Wednesday, January 7, 2026
E-PAPER
Homeజాతీయంరేపు దేశవ్యాప్తంగా లక్ష పంచాయతీల్లో ఆందోళన

రేపు దేశవ్యాప్తంగా లక్ష పంచాయతీల్లో ఆందోళన

- Advertisement -

‘వీబీ జీ రామ్‌ జీ’ని వ్యతిరేకిస్తూ 8న ఢిల్లీలో రౌండ్‌టేబుల్‌ సమావేశం
19న కార్మిక, కర్షక ఐక్యతా దినం : ఏఐఏడబ్ల్యూయూ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయరాఘవన్‌, వెంకట్‌

విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్‌ నుంచి నవతెలంగాణ ప్రతినిధి ఎస్‌ వెంకన్న

‘వీబీ జీ రామ్‌జీ’ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లక్ష గ్రామపంచాయతీల్లో సోమవారం ఆందోళనలు చేపట్టనున్నట్టు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయరాఘవన్‌, బి.వెంకట్‌ తెలిపారు. ఈ నెల 19న లేబర్‌ కోడ్‌లు, ‘వీబీ జీ రామ్‌జీ’ని వ్యతిరేకిస్తూ కార్మిక, కర్షక ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఫిబ్రవరి 12న జరగబోయే దేశవ్యాప్త సమ్మెకు తమ సంఘం మద్దతు ఉంటుందని ప్రకటించారు. శనివారం విశాఖపట్నం బీచ్‌రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌ ప్రాంగణంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి విక్రమ సింగ్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లుతో కలిసి విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ వందలాది సంఘాలతో ఈనెల 8న ఢిల్లీలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ- జీ రామ్‌ జీ చట్టం-2025ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ చట్టాన్ని కేరళ ప్రభుత్వం ఇప్పటికే వ్యతిరేకించిందనీ, తెలంగాణ ప్రభుత్వం తిరస్కరిస్తూ తీర్మానం చేసిందని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తి భిన్నంగా వ్యవహరించటం శోచనీయమన్నారు. ఏపీపై రూ.30 వేల కోట్ల భారం పడుతుంటే పంచాయతీల్లో సంబురాలు నిర్వహించేందుకు సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. ఇదే వైఖరిని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగిస్తే ప్రజా ద్రోహిగా మిగిలిపోతుందని హెచ్చరించారు. కేరళ మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ భూ సేకరణ చేపట్టి, కార్పొరేట్లకు దోచిపెడుతున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో అభివృద్ధి పేరుతో ఇప్పటికే లక్షల ఎకరాలు సేకరించారని తెలిపారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు దోచిపెడుతున్న ప్రభుత్వం, ఆక్రమ భూ సేకరణకు వ్యతిరేకంగా ఏపీలో పోరాడిన అప్పలరాజుపై పీడియాక్ట్‌ కింద కేసు నమోదు చేయటం సిగ్గుచేటని విమర్శించారు. మోడీ పాలనలో దళితులు, మహిళలకు రక్షణ లేకుండాపోయిందని చెప్పారు. రాజ్యాంగ హక్కులపై జరుగుతున్న దాదులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని ప్రకటించారు.

కార్మిక వర్గ చైతన్యం కోసం..
సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభలో భూపాల్‌
నయా ఉదారవాద విధానాల పాలనకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలు సామాజిక శ్రేణుల భాగస్వామ్యాన్ని పెంచుతున్నాయనీ, కార్మిక వర్గ చైతన్యాన్ని పెంచటంలో వెనుకబడుతున్నామని నిర్ధారిస్తూ మహాసభ ప్రత్యామ్నాయ డాక్యుమెంట్‌ రూపొందించటం సరైందేనని తెలంగాణ ప్రతినిధులు అభిప్రాయపడ్డట్టు సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ తెలిపారు. ‘పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా వర్గ చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేయాలి. కామ్రేడ్‌ పి.సుందరయ్య చెప్పిన విధంగా కార్యాచరణ ఉండాలి. పని ప్రదేశాల్లో ఉన్న చైతన్యం, నివాస ప్రాంతాల్లో ఉండటం లేదనేది కూడా వాస్తవమే’ అని తెలిపారు.

మితవాద శక్తులు ఒకవైపు ఆధ్యాత్మికతతో సామాజిక శ్రేణుల్లో ఉద్వేగాలు సృష్టిస్తున్నాయనీ, కార్మికుల చైతన్యాన్ని మొద్దుబారుస్తున్నాయని ఆందోళన వ్యక్తపరిచారు. పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో అనేక సమస్యలు పెరిగి భారమవుతున్నాయనీ, మనం రూపొందించుకున్న ‘సెక్టోరల్‌ బాడీ’ని మార్క్సిస్ట్‌ పద్ధతిలో మరింత విస్తృతపర్చాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తెలంగాణలో కొంత కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ‘దేశంలో అభివృద్ధి గురించి చర్చ జరుగుతున్నది. పెట్టుబడిదారీ అభివృద్ధి కాదు మానవ అభివృద్ధిగా ఉండాలి. కేరళలో మానవాభివృద్ధి నమూనా అనేది ఒక ప్రత్యామ్నాయంగా ఉంది. కార్మికుల్లో రాజకీయ చైతన్యం, సామాజిక స్పృహ పెంపొందించాలి. పేదల సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణలో అనేక సందర్భాల్లో వర్గ స్పృహను పెంపొందించడానికి ప్రయత్నాలు జరిగాయి’ అని వివరించారు.

వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడి అప్రజాస్వామికం
విశాఖ ఆర్కేబీచ్‌ రోడ్డులో సీఐటీయూ నిరసన ప్రదర్శన
దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన డాక్టర్‌ కె.హేమలత, తపన్‌సేన్‌

వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడి అప్రజాస్వామికమని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్‌ కె.హేమలత, ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ అన్నారు. అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించారు. వెనిజులాపై అమెరికా దాడిని నిరసిస్తూ శనివారం విశాఖపట్నంలో ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌ నుంచి బీచ్‌ రోడ్డుపై నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎండగడుతూ నాయకులు నినాదాలు చేశారు. అనంతరం సీఐటీయూ మహాసభ ప్రాంగణంలో సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా తపన్‌సేన్‌ మాట్లాడుతూ..అమెరికా దుర్మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ట్రంప్‌ రాజకీయాలు ప్రపంచ శాంతిని నాశనం చేస్తున్నాయని విమర్శించారు. 1989 తర్వాత ఒక లాటిన్‌ అమెరికా దేశంపై అమెరికా దాడికి పాల్పడిందని తెలిపారు. వెనిజులాపై అమెరికా దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. వెనిజులాకు సహాయసహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై మన దేశ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. డాక్టర్‌ కె.హేమలత మాట్లాడుతూ..ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పనిప్రదేశాల్లో, మండల, జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -