– మంత్రివర్గం ముందుకు పీసీ ఘోష్ కమిటీ నివేదిక సారాంశం
– బీసీ బిల్లుపై 5న ఢిల్లీకి సీఎం, మంత్రులు
– మూడురోజులపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ అక్కడే
– ఇండియా బ్లాక్ నేతలతో భేటీ
– రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్న సీఎం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘కాళేశ్వర’మే ఏకైక ఎజెండాగా సోమవారం రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఆ ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం విదితమే. 700 పేజీలతో ఉన్న ఈ రిపోర్టులోని ముఖ్యాంశాలతో సారాంశాన్ని రూపొందించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ సారాంశాన్ని సోమవారం క్యాబినెట్ ముందు ఉంచనున్నారు. దానిపై చర్చించి, ఒక నిర్ణయానికి వచ్చేందుకు వీలుగా మంత్రివర్గాన్ని అత్యవసరంగా సమావేశపరుస్తున్నారు. దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై కూడా చర్చించనున్నప్పటికీ కాళేశ్వరంపైన్నే ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
ఇక బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా మంగళవారం ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. వారితోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మెన్లు హస్తినకు పయనం కానున్నారు. వరసగా మూడు రోజులపాటు (ఈనెల 7 వరకు) వారు అక్కడ మకాం వేయనున్నారు. తద్వారా కాంగ్రెస్ తరపున ఢిల్లీలో బలప్రదర్శన చేయాలని సీఎం యోచిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన మేరకు రేవంత్ తమ పర్యటనలో భాగంగా ఈనెల 5న ఇండియా బ్లాక్‌లోని అన్ని పార్టీలను కలిసి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని, తెలంగాణలో తమ ప్రభుత్వం కులగణన చేపట్టిన తీరు తెన్నులను వివరిస్తారు. 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తారు. 7న ఆయన రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసి వినతిపత్రం సమర్పిస్తారని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారు కావాల్సి ఉందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. మూడు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజైన మంగళవారమే రాష్ట్రపతిని కలవాలని సీఎం భావించినప్పటికీ… ఆమెను కలిసిన తర్వాత ధర్నా చేస్తే బాగోదనే ఉద్దేశంతో… ఆ కార్యక్రమాన్ని 7కు వాయిదా వేసుకున్నారు. ఢిల్లీలో ఈ రకంగా హడావుడి చేయటం ద్వారా బీసీ రిజర్వేషన్లపై కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టాలని సీఎం భావిస్తున్నారు. తద్వారా ఈ విషయంలో తమ ప్రభుత్వాన్ని ఛాంపియన్ చేయాలన్నది ఆయన వ్యూహంగా కనబడుతున్నది. వాస్తవానికి ప్రతీ పదిహేను రోజులకోసారి క్యాబినెట్‌ను సమావేశపరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ క్రమంలో గత నెల 28న మంత్రివర్గం సమావేశమైంది. అయితే పదిహేను రోజులు కాకముందే సోమవారం క్యాబినెట్ అత్యవసరంగా భేటీ కానుండటం గమనార్హం.
రేపటి క్యాబినెట్ ఎజెండా కాళేశ్వరమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES