చొక్కాలు విప్పి యూత్ కాంగ్రెస్ నేతల నిరసన
న్యూఢిల్లీ : ఢిల్లీ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టించారు. శుక్రవారం సదస్సులోని ఒక వేదిక వద్దకు చేరుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా అందరూ తమ చొక్కాలు విప్పి నిరసన తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నిర్భయంగా తమ కార్యకర్తలు నిరసన తెలిపారని, ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా ప్రధాని మోడీ దేశం విషయంలో కాంప్రమైజ్ అయ్యారని కాంగ్రెస్ ఆరోపించింది.
దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే అంతర్జాతీయ సదస్సులో కాంగ్రెస్ నేతలు ఇలా ప్రవర్తించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. వేదిక వద్ద ఆందోళన చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ ఘటనపై బిజెపి కాంగ్రెస్‌పై మండిపడింది. ఏఐ సదస్సు విజయవంతం కావడంతో, దీన్ని చెడగొట్టేందుకు కాంగ్రెస్ నేతలు అసూయతో ఇలా ఆందోళన చేశారని బీజేపీ వ్యాఖ్యానించింది. వీళ్లు ఐఎన్‌సీ కాదని.. ఏఎన్‌సీ (యాంటీ నేషనల్ కాంగ్రెస్) అని బీజేపీ వర్ణించింది.
ఏఐ సదస్సులో అమెరికా డీల్‌కు వ్యతిరేకంగా అర్థనగ్న ప్రదర్శన
- Advertisement -
- Advertisement -



