– పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు
– జలాశయాలకు పెరిగిన వరద ప్రవాహం
– రోడ్లు జలమయం.. రాకపోకలు బంద్
– నీట మునిగిన వాడలు, నేలమట్టమైన ఇండ్లు
– గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి దారుణం
– సహాయక చర్యల్లో అధికారులు
– బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
– ములుగు జిల్లాలో పరిశీలించిన మంత్రి సీతక్క
అల్పపీడన ద్రోణి కారణంగా మూడురోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, తదితర జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతుండటంతో అక్కడక్కడ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పత్తి, మొక్కజొన్న, వరి పంట పొలాల్లోకి నీరు చేరడంతో నీట మునిగాయి.
నవతెలంగాణ- విలేకరులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి ఎడ తెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 25.8 సెం.మీ వర్షపాతం రికార్డయింది. ఏటూరునాగారంలో 18.5సెం.మీ, మంగపేటలో 17.6సెం.మీ, గోవిందరావుపేటలో 15.3సెం.మీ వర్షపాతం నమోదయింది. దాంతో జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ములుగు జిల్లా పప్రా-తాడ్వాయి మధ్య ఉన్న గుండ్లవాగు, జలగలంచ వాగుల్లో వరద ఉధృతిని మంత్రి సీతక్క స్వయంగా పరిశీలించారు. మంగపేట మండలం మల్లూరులో అత్తచెరువు నుంచి తూము నీటి ప్రవాహం 20 ఇండ్లల్లోకి చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం బుర్కిపల్లి గ్రామంలో చేపలవేటకు వెళ్లిన ఆగబోయిన నరేష్ వరద ఉధృతికి గల్లంతయ్యారు. గార్ల వద్ద మున్నేరు వాగు తీవ్రంగా ప్రవహిస్తుండటంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాళ్లవాగు వంతెన కోతకు గురికావడంతో వెంకటాపూర్-భద్రాచలం మధ్య రాకపోకలను నిలిపివేశారు. ప్రయాణికులు మణుగూరు మీదుగా భద్రాచలం వెళ్లాలని అధికారులు సూచించారు. భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ములుగు జిల్లా పప్రా-తాడ్వాయి మధ్యనున్న గుండ్లవాగు, జలగలంచ వాగుల్లో వరద ఉధృతిని మంత్రి సీతక్క పరిశీలించారు. మరో నాలుగురోజులపాటు భారీ వర్షాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ములుగు జిల్లా అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. చేపల వేటకు ఎవరూ వెళ్లకూడదని సూచించారు.
నీట మునిగిన వాడలు
ఏజెన్సీ జిల్లా అయిన ములుగులో చాలాచోట్ల సరైన డ్రయినేజీ వ్యవస్థ లేకపోవడంతో పలు గ్రామాల్లో ఇండ్లలోకి నీరు చేరి బురదమయ్యాయి. రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. మంగపేట మండలంలోని చెరువులు, కుంటలు పొంగి పొర్లుతుండటంతో గంపనిగూడెం, పోదుమూరు, మల్లూరు గ్రామాల్లోని కొన్ని వాడలు చెరువులను తలపించాయి. గంపోనిగూడెంలో ఇండ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ఇండ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. మంగపేట-కమలాపురం మధ్య జీసీసీ పెట్రోల్ బంక్ వద్దనున్న కల్వర్టు కోతకు గురై ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. దాంతో అక్కడ ప్రమాదాల నివారణకు పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు.
బొగత జలపాతం సందర్శన నిలిపివేత
వాజేడులోని బొగత జలపాతానికి భారీగా వరదనీరు చేరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండటంతో పర్యాటకులకు జలపాతం సందర్శనను నిలిపివేస్తున్నట్టు అటవీ శాఖ అధికారి చంద్రమౌళి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే, ముత్యందర జలపాతం, కొంగల జలపాతం, మామిడిలొద్ది జలపాతం, కృష్ణపురం జలపాతాలకు కూడా పర్యాటకుల సందర్శనను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెయ్యి మి.మీ పైగా..
ఖమ్మం జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 1141.8 మి.మీ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ వెయ్యి మి.మీకు పైగా వర్షం కురిసింది. మున్నేరులో నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. 25 అడుగులకుపైగా నీరు ప్రవహిస్తే మరోమారు మున్నేరు పరిసరాలు ప్రమాదంలో పడతాయి. వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఇరుజిల్లాల కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. విపత్తుల సహాయార్థం 1077కు కాల్ చేయాల్సిందిగా సూచించారు. అత్యవసరమైతే 100కు ఫోన్ చేయాలని పోలీసుశాఖ ప్రకటించింది.
అతలాకుతలమైన కరీంనగర్
కరీంనగర్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జమ్మికుంట పట్టణ కేంద్రంలో 78.8 మిల్లీమీటర్లు, మానకొండూర్ మండలం పోచంపల్లిలో 75.8 మిల్లీమీటర్లు, కరీంనగర్ జిల్లా కేంద్రంలో 62.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్ నుంచి సిరిసిల్ల, జగిత్యాలకు వెళ్లే రహదారులు పూర్తిగా నీట మునిగిపోవడంతో బస్సులు దారి మళ్లింపు ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది. అల్గునూర్ చౌరస్తాలో భారీగా వరద నీరు చేరడంతో కరీంనగర్ నుంచి హైదరాబాద్, వరంగల్ వెళ్లే వాహనాలు దాదాపు గంటపాటు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితి వస్తే సంప్రదించాలని నగరపాలక సంస్థ కాల్ సెంటర్ 9849906694ను ఏర్పాటు చేసింది. రామగుండం రీజియన్‌లోని 1,2,3,5 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో సుమారుగా 80వేల పైచిలుకు టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. షాబాద్ మండలంలో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం..
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండలంలో భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. సోమిని గ్రామ పంచాయతీలోని ఒర్రెలు ఉప్పొంగడంతో సోమినితో పాటు మరో 12 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బెజ్జూర్ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వాగులో మతిస్థిమితం లేని వ్యక్తి చిక్కుకుపోయాడు. ఆతన్ని కాపాడేందుకు ఎస్‌ఐ సర్ధార్ పాషా తీవ్ర ప్రయత్నాలు చేశారు. వాగు పరివాహక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగి పత్తి, వరి దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాజెక్టులకు పోటెత్తిన వరద నీరు
ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరదనీరు పోటెత్తడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దాంతో బుధవారం ఉదయం 14 గేట్లు మూడు అడుగుల మేర, ఒక గేట్‌ను పూర్తిగా ఎత్తి దిగువన ఉన్న గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. అయితే రాత్రి 7 గంటల వరకు వరద ఉధృతిని అంచనా వేస్తూ మూడు గేట్లను మూడు అడుగుల మేర ఒక గేటును రెండు అడుగుల మేర, రెండు గేట్లను పూర్తిగా ఎత్తి 14,931 క్యూసెక్కుల వరదను దిగువకు వదిలారు. పెద్దపల్లి జిల్లా అంతర్గంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 8.8టీఎంసీల నీరు నిల్వ ఉండగా 2,334 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అదేవిధంగా సుందిళ్ల పార్వతి బ్యారేజ్‌కు ఉన్న 74గేట్లన్నీ ఎత్తి వరదనీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు.
పురిటి నొప్పులతో వాగు దాటి..
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంధాల గ్రామపంచాయతీ పరిధిలోని అల్లిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ గుమ్మడి కృష్ణవేణి నిండు గర్భిణి. గురువారం తెల్లవారుజామున ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి వెళ్లాలంటే సుమారు 30 కి.మీ దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. మార్గమధ్యలో అల్లిగూడెం నుంచి పోచాపూర్ మధ్యలో ఒక వట్టి వాగు ఉంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆ వాగు ఏరులై పారుతోంది. దీంతో గర్భిణిని ఆదివాసీ గిరిజనులు భుజాలపై ఎక్కించుకొని వాగు దాటించారు. అనంతరం అక్కడ అప్పటికే వచ్చి ఉన్న అంబులెన్స్‌లో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఏటా వర్షాకాలంలో తమకు ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం, మంత్రి సీతక్క స్పందించి ఈ వాగులపై వంతెనలు నిర్మించి రోడ్డు సౌకర్యం కల్పించాలని అల్లిగూడెం, నర్సాపూర్ (పీఎల్) ఆదివాసీ గిరిజనులు కోరుకుంటున్నారు.
ముంచెత్తిన వాన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES